ఆరోగ్యానికి అమృత సమానమైనది ఉత్తమమైన ఆహారం. పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు, యువత, ముఖ్యంగా మహిళలు ఇలా వర్గీకరణను బట్టి తీసుకునే ఆహార వర్గీకరణ కూడా ఉంటుంది. ఒక వయసుకు వచ్చాక ఆడపిల్లలో మొదలయ్యే ఋతుచక్రం వారి మానసిక శారీరక స్థితులను తారుమారుచెయ్యగలవు. ఎందుకంటే హార్మోన్ల రిసైకిల్ జరిగేటప్పుడు శరీరంలో కలిగే మార్పే వాటికి కారణం. అయితే అలాంటి సమయంలో ఆ పరిస్థితికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. నెలసరి సమయంలో వచ్చే చిరాకు, అసహనం, కోపం వంటి మానసిక సమస్యలు. కడుపునొప్పి, కండరాల తిమ్మిరి, ఒళ్ళు నొప్పులు వంటి శారీరక సమస్యలు మొదలైన వాటికి తీసుకునే ఆహారం కూడా కారణం అవుతుంది. అందుకే నెలసరిలో ఉన్నపుడు తీసుకోకూడని ఆహారపదార్థాలు తెలుసుకోండి. వాటిని ఆ మూడు రోజులు మినహాయించండి. ప్రశాంతంగా నెలసరిని దాటండి.
కెఫిన్ ఉన్న పదార్థాలు( కాఫీ )
నెలసరిలో ఎదురయ్యే హెచ్చుతగ్గుల హార్మోన్ల సమస్య తరచూ మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే చాలామందికి కాఫీ అనేది వ్యసనం అవుతుంది. అది నెలసరి సమయంలో హార్మోన్లను ప్రభావితం చేసి హార్మోన్ రిసైకిల్ ను డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా మానసిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కెఫిన్ తో కూడిన డ్రింక్స్ మరియు ఆహారపదార్థాలు నెలసరి సమయంలో మినహాయించడం చాలా ఉత్తమమైనది.
చక్కెర
చక్కెర అంటే మనం ఉపయోగించే చక్కెర మాత్రమే కాదు. ఆహార పదార్థాలైన పాస్తా లేదా బియ్యం, గోధుమ పిండి, మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాల వనరులు కూడా లెక్కించబడతాయి. అలాగే కేక్ మరియు బిస్కెట్లు వంటి బేక్ చేసిన పదార్థాలలో కూడా చెక్కర మరియు, పిండి పదార్థాల నుండి లభించే చెక్కెరలు కూడా. హార్మోన్ల రిసైకిల్ సమయంలో ఇలాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి కారణం అవుతుంది. ఇది మొదట పెరిగినట్టు అనిపించినా తరువాత ఒక్కసారిగా శరీరంలో చెక్కర స్థాయిలు తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి చెక్కెరల రూపం ఏదైనా నెలసరి సమయంలో వాటికి వీలైనంతవరకు దూరంగా ఉండటం మంచిది.
మాంసం & వేయించిన ఆహారాలు
ఎర్ర మాంసం, అలాగే మనం వేయించడానికి ఉపయోగించే కూరగాయల నూనెలలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు, అరాకిడోనిక్ ఆమ్లంతో సహా, మాంసంలో ఎక్కువగా లభిస్తాయి, ప్రోస్టాగ్లాండిన్స్ అని పిలువబడే రసాయనాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇది నెలసరి ప్రారంభంలో వచ్చే నొప్పి విషయంలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది.
పాలు, పాల ఉత్పత్తులు
సేంద్రీయ ఉత్పత్తులు మాత్రమే తీసుకోవడంలో జాగ్రత్తగా ఎంతో అవసరం. లేకపోతే ఈ పాలు పాల ఉత్పత్తులు మన హార్మోన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు హార్మోన్ల ద్వారా ఎదురయ్యే సమస్యలను మరింత ఉదృతం చేసే అవకాశాలు ఉన్నాయి. సేంద్రీయ ఉత్పత్తి కాని వాటిలో రసాయనాలు ఎక్కువ వాడి ఉంటారు కాబట్టి అవి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ పై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తుల నుండి లభించే పోషకాలను భర్తీ చేయడానికి ఆకుపచ్చ ఆకుకూరలు, బచ్చలికూర, క్యాబేజీ లేదా బ్రోకలీ, బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, కాయలు తీసుకోవచ్చు. వీటిలో చాలా వరకు మెగ్నీషియం వంటి అదనపు పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
ప్రాసెస్ చేసిన & ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలు
ప్రాసెస్ చేయబడిన మరియు ప్యాక్ చేసిన ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. (అదనపు కొవ్వు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మరియు రసాయన పదార్థాలు ఎన్ని కలుపుతారో చెప్పనవసరం లేదు!). నెలసరిలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతాయి.
చివరగా…
నెలసరిలో పైన చెప్పుకున్న ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా గడిపేయచ్చు.