దుంప కూరల మీద చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమని, వీటిలో ఉండే పోయాహకాల స్థాయి గూర్చి, పిండి పదార్థాల గూర్చి ఇలా బోలెడు అపోహలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ ఒక్కసారి ప్రస్తావించి నిజానిజాలు తెలుసుకుంటే మనం దుంపకూరలు తినడంలో ఒక కచ్చితమైన అభిప్రాయానికి రావచ్చు కాబట్టి దుంప కూరల గూర్చి కొన్ని అపోహాలు, నిజానిజాలు ఒకసారి చూద్దాం మరి.
◆ షుగర్ వ్యాధిని పెంచుతాయి అనేది ఒక అపోహ:
వరి, గోధుమలు కన్నా దుంప కూరల్లో షుగర్ ను పెంపొందించే కార్బోహైడ్రేట్లు బాగా తక్కువగా ఉంటాయి. తియ్యగా ఉండే 100 గ్రాముల చిలకడదుంపల్లో 28 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వరిలో ఈ కార్బోహైడ్రేట్లు శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిలకడదుంప లాంటి దుంప కూరలు వరికన్నా ఎన్నో రెట్లు మేలని అర్థమవుతుంది. దీనివల్ల షుగర్ పెరగడమనే సమస్య చాలా తక్కువ.
◆ దుంప కూరలు ఎలర్జీలను పెంచుతాయనే అపోహ :
దుంప కూరలు ఎలర్జీలు కల్గిస్తాయని, ఆరోగ్యానికి మంచివి కావని మరొక అపోహ ఉంది. బాగా దురదని కలిగించే చేమదుంప ను తీసుకుంటే ఉడికించి, నీటిని వార్చేసి పైన చర్మం తీసేస్తే చేమ దుంపల్లోని దురధను కలిగించే కాల్షియం ఆగ్జలెట్స్ పోతాయి. ఉడికించిన చేమదుంపలు ఎలర్జీ వ్యాధులలో మేలు చేస్తాయని వస్తు గుణ దీపిక అనే ఆయుర్వేద గ్రంథంలో ఉంది. వ్యక్తిగతంగా చేమదుంపలు సరిపోని వ్యక్తులకు తప్ప, మిగిలిన వారందరికీ ప్రయోజనాన్ని చేకూర్చేవే.
◆ దుంప కూరలు తినడం వల్ల వాతపు నొప్పుల్ని పెంచుతాయనే అపోహ :
దుంప కూరలు తింటే తగ్గిపోయిన వాతపు నొప్పులు, కీళ్ల నొప్పులు, మరియు కండరాల నొప్పులు తిరిగి మొదలవతాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే వీటికి కొన్ని కారణాలు ఉన్నాయి.
జీర్ణశక్తి సరిగా లేనివారు అన్నంలోనూ, పూరీలు, చపాతీల్లోనూ, బంగాళాదుంపల కూర తింటూ ఉంటారు. ఇదొక రుచికరమైన కాంబినేషన్. పూరి చపాతీ లు కానీ, వరి అన్నం కానీ, సులువుగా జీర్ణం కావు. వీటితో కలిసి దుంప కూరలు తినడం వల్ల జీర్ణక్రియ మరింత కష్టమవుతుంది. అరుగుదల కష్టంగా ఉన్నవారు వీటిని తిన్నపుడు సరిగా జీర్ణం కాక వాతాన్ని వికటింపజేసి నొప్పులు పెరగడానికి కారణం అయ్యే మాట వాస్తవమే. అందుకే దుంప కూరలను గోధుమ తోనూ, వరితోనూ కలిపి తీసుకోకుండా, విడిగా తీసుకోవడం ఉత్తమం. జీర్ణశక్తి ని పెంపొందించే అల్లం, ధనియాలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వాటిని కలుపుకోవడం ద్వారా కొత్త వంటకాలు చేసుకుని తింటూ ఉంటే నొప్పులు పెరగకుండా ఉంటాయి.
షుగర్, బీపీ, ఉబ్బసం, కీళ్ళవాతం వ్యాధులతో బాధపడేవారు జీర్ణశక్తిని బలంగా ఉంచుకునేట్టు అయితే దుంప కూరలను నిరభ్యరంతంగా తీసుకోవచ్చు, దీనివల్ల ఉపయోగాలే కానీ నష్టాలు ఉండవు.
బంగాళదుంపలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ప్రధాన ఆహారం.వీటిని ఉడికించి తినడం ఉత్తమం. అంతే కానీ వేపుడు కూరలు, శనగపిండి, చింతపండుతో కలిపి వండుకోవడం వల్ల ఆరోగ్యాన్ని హాని కలిగించేలా తయారవుతాయే కానీ ఉపయోగం ఏమి ఉండదు.
చివరగా…..
దుంపకూరలు ఏవైనా సరే క్యారెట్, ముల్లంగి, ఆలు, చిలకడదుంపలు, చేమదుంపలు, పెండలం, కర్ర పెండలం…. మొదలైన వాటిని ఎలా వండుకోవాలో సరైన విధంగా తెలుసుకుని వాడితే గొప్ప ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి