వంటిల్లు ఒక అమృత భాండాగారం. ఆహారం తీసుకోవడం వల్ల మన ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు అబ్బో ఇవన్ని పుష్కలంగా మనకు అందడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అయితే ఒకసారి మన వంశాన్ని పరిశీలిస్తే మన ముత్తాతలు, ముత్తవ్వలు, తరువాత తాత అవ్వలు, ఆ తరువాత అమ్మ నాన్నలు ఇలా వీరందరి జీవన శైలి, వీళ్ళు ఆచరించిన పద్ధతులు ఒక్కొక్కటి తెల్సుకుంటూ ఉంటే వంటింట్లోనే మొదటి వండర్ కనబడుతుంది.
మనం కుక్కర్లు, కడాయ్ లు, నాన్ స్టిక్ వేర్ లు అబ్బో ఎన్నెన్ని డిజైన్లో వీటన్నింటినీ మన వంట గదిలో అందంగా పేర్చి ఉంటాం. కానీ మన పెద్దలు వాళ్ళ పూర్వీకులు వంటగధుల్లో ఇత్తడి, రాగి,మట్టి పాత్రలను అందంగా పేర్చేవారు. ముఖ్యంగా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద వండే పదార్థానికి అమృత సమానమైన ప్రయోజనాలు ఉంటాయంటే ఆశ్చర్యం వేస్తుంది.
అసలు మట్టి పాత్రలో వండటం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
◆మనం వంటకు ఉపయోగించే పాత్రలే కాదు మనం వండే కూరగాయలు, ఆకు కూరలు వంటి వాటిలో పోషకాలు ఉంటాయని అందరికి తెలిసినదే. అయితే మట్టి పాత్రలలో వంట చేసేటపుడు కూరగాయల్లో ఉన్న పోషకాలు నశించకుండా ఉంటాయి. దీనివల్ల మట్టి పాత్రలలో వండిన వంట రుచి అద్బుతంగానూ వందశాతం ఆరోగ్యకరంగానూ ఉంటుంది.
◆మట్టి పాత్రలలో వండేటపుడు ఆవిరి ద్వారానే పదార్థం చాలా వరకు ఉడికిపోతుంది. మట్టి పాత్రలలో ఉన్న మైక్రో న్యూక్లియన్స్ వల్ల ఇందులో వండిన ఆహార పదార్థం గుణం మారకుండా ఉంటుంది.
◆స్టీల్, అల్యూమినియం పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రలలో ఉష్ణాన్ని గ్రహించడం మరియు చల్లబడటం కాసింత ఆలస్యంగా జరుగుతుంది దీనివల్ల ఆహారపదార్థం మెల్లిగా సంపూర్ణంగా తయారవుతుంది. ఆహార పదార్థం ఉడికేటపుడు గాలి వెలుతురు తగలడం వల్ల ఆహారానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే గుణం చేరుతుంది. అందువల్ల మట్టి పాత్రలో వంట చాలా ప్రయోజనమైనది.
◆మట్టి పాత్రలలో వంట చేయడం వల్ల పదార్థాలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి పోషకాలు నశించకుండా ఉంటాయి.
◆ఈ పాత్రలు సిరామిక్ తో తయారు చేస్తారు. వీటిని తయారు చేయడానికి ప్రత్యేకమైన మట్టిని ఉపయోగిస్తారు కాబట్టి వీటిలో ఆమ్లగుణాన్ని నిలిపి ఉంచే శక్తి ఉంటుంది.
◆మట్టి పాత్రలో వండేటపుడు నూనె తక్కువ అవసరం అవుతుంది అందువల్ల ఈ పద్దతిలో వండుకుంటే రోజువారీ అవసరం నుండి నూనెను తగ్గించిన వాళ్ళం అవుతాము.
◆అల్సర్, టి.బి, గుండె నొప్పి వంటి సమస్యలను దరికి చేరనివ్వకుండా ఉంటుంది. మట్టి సహజసిద్ధమైనది ఎలాంటి రసాయనాల కలబోత ఈ పాత్రల తయారీలో ఉండదు కాబట్టి వీటిలో వండిన పదార్థం అత్యుత్తమమైనది అని చెప్పవచ్చు.
చివరగా….
ప్రస్తుత కాలానికి మట్టి పాత్రల లో నీళ్లు నిల్వచేసుకుని తాగడం మాత్రమే తెల్సు. అయితే వంటకు ఉపయోగించే నాన్ స్టిక్, అల్యూమినియం వంటి పాత్రలు వేడి చేసినపుడు వెలువడే రసాయనాలు మరియు విషవాయువుల వల్ల ఆహారంలో ఉండాల్సిన పోషకాల స్థానంలో విషాలు చేరి ఇవి స్లో పాయిజన్ గా పని చేస్తూ శరీరంలో వివిధ అవయవాలను దెబ్బ తీస్తాయి. కాని మట్టి పాత్రల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఏమి ఉండకపోవడం ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ సూత్రం. అందుకే మట్టి పాత్రలలో వంట అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదంట.