శరీరంలో బోలెడు అనారోగ్యాలకు కారణం అధిక కొవ్వు పేరుకుపోవడం. ఇది బోలెడు ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అయితే అధిక కొవ్వు మన శరీరంలో చేరుతున్నదని గ్రహించడానికి మన శరీరం కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది. వీటిని గ్రహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటే అధిక కొవ్వును నిర్మూలించుకోవచ్చు. ఆ లక్షణాలు తెల్సుకుందాం మరి.
జీర్ణశక్తి
శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతున్నపుడు మొదట వచ్చే సమస్య. తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది కలగడం. అధిక కొవ్వు వల్ల జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా మలబద్దకం మొదలవుతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవకపోతే కడుపు ఉబ్బరం కడుపులో వికారం వంటి సమస్యలు ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి.
గ్యాస్ట్రిక్ సమస్య
అధిక కొవ్వు అనర్థకమే పొట్టలో కొవ్వు పేరుకుపోవడం వల్ల పేగుల పనితీరు మందగిస్తుంది. జీర్ణాశయం ఇబ్బందిగా మారినందువల్ల తిన్న ఆహారం ఎక్కువసేపు అలాగే ఉండిపోయి కుళ్ళి ఆమ్లాలు, వాయువులు విడుదల అవుతాయి. ఇవే గ్యాస్ట్రిక్ సమస్యగా రూపాంతరం చెందుతాయి. గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల అది రొమ్ములకు చేరి మంటగానూ కూడా అనిపిస్తుంది.
కళ్ళ కింద భాగంలో తెల్లని మచ్చలు మరియు మొటిమలు
అధిక కొవ్వు ఉన్నవారిలో ముఖ్యంగా కనబడే సమస్య మొటిమలు. శరీరంలో పేరుకున్న కొవ్వు తాలూకు నూనెలు బయటకు వెళ్లాలని ప్రయత్నంలో చర్మరంధ్రాల నుండి మొటిమలుగా రూపాంతరం చెందుతుంటాయి. ఇవి ముక్కు మరియు గడ్డం భాగంలో ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే వయసులో ఉన్న వాళ్లకు ఈ మొటిమలు సాధారణం. కానీ అధిక కొవ్వు ఉన్నవారిలో కళ్ళ కింద తెల్లని మచ్చల్లా చిన్న చిన్న మొటిమల్లాంటి కురుపులు వస్తాయి. ఇవి వస్తే నిర్లక్ష్యం చేయకండి మరి.
ఛాతీ నొప్పి
గుండె ఆరోగ్యాన్ని శాసించేది ఆరోగ్యకరమైన ఆహారం. అధిక కొవ్వులు పెరిగినపుడు గుండెకు చేదు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫలితంగా ఛాతీ నొప్పి రావచ్చు. ముఖ్యంగా అడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించడం
అధిక కొవ్వు వల్ల శరీరంలో అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. ఏ చిన్న పని చేసినా అలసటకు గురికావడం. నీరసం, ఆయాసం, అధిక దాహం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తుంటాయి.
తలనొప్పి
శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల రక్తప్రసరణ నెమ్మదించడం వల్ల, గుండె పనితీరు మందగించడం వల్ల గుండె నుండి మెదడుకు వెళ్లే నరాల పనితీరు కూడా ఆలస్యమవుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం మెదడుకు అందాల్సిన ఒమేగా కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండటం వల్ల తరచూ తలనొప్పి రావడం జరుగుతుంది. చాలా మంది పెయిన్ కిల్లర్లతో ఈ నొప్పిని తగ్గించుకుంటూ ఉంటారు. అయితే ఇది వస్తున్న కారణాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.
కాళ్ళు చేతుల వేళల్లో తిమ్మిరి
అధిక కొవ్వు వల్ల రక్తనాళాలలో కొవ్వు పెరుకుపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఇలా రక్త ప్రసరణ నెమ్మదించడం వల్ల కాళ్ళు మరియు చేతి వేళ్ళు తిమ్మిరిగా ఉండటం జరుగుతుంది. క్రమంగా ఇది స్పర్శ తాలూకూ స్పందలకు చలించకుండా ఒళ్ళు చచ్చుబడిపోయిన భావన కలిగిస్తుంది కూడా.
అధిక బరువు
కొవ్వు పోగేయ్యేకొద్ది బరువు పెరిగిపోవడం సహజం. ఎప్పుడైతే శరీరం బరువు పెరుగుతున్నదని మీరు గమనిస్తారో అపుడే బరువు తగ్గడం పట్ల దృష్టి కేంద్రీకరించాలి. ఫలితంగా అధిక కొవ్వు కూడా క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
చివరగా….
శరీరంలో ఈ లక్షణాలు కనబడితే అసలు ఆలస్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోండి మరి.