9 best fruits for middle-aged people

ఈ తొమ్మిది పండ్లు తింటే మధ్య వయసును అందంగా గడపవచ్చు.

మనిషి జీవితం చాలా విచిత్రమైనది. బాల్యం,  కౌమారం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం ఇలా సాగిపోతోంది జీవితం. అయితే బాల్యం, కౌమారం, యవ్వనం ఈ మూడు ఎంతో సరదాగా గడిచిపోతే మధ్యవయసు మాత్రం ముప్పుతిప్పలు పెడుతుంది. ముప్పయ్యేళ్లు దాటగానే మధ్యవయస్కులుగా  మారిపోయి, పెళ్లి, పిల్లలు, వారి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడులు. వీటన్నిటి మధ్య సతమతమవుతూ ఏదో ఒక అనారోగ్యసమస్యను తెచ్చుకుంటాం. అంతే కాదు ఆ ఒత్తిడులలో అసందర్బపు ఆహార సమయాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటాం ఇన్ని ఒత్తిడులు ఉన్నపుడు సమతుల్యమైన ఆహారం లేకపోవడం వల్ల ఆరోగ్యం మరింత ఇబ్బంది పెట్టి బలహీనులుగా మార్చేస్తుంది. 

 మనం తీసుకునే ఆహారంలో ఎన్ని పదార్థాలు ఉన్నా ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో పండ్ల పాత్ర అనిర్వచనీయమైనది. ముప్పయ్యేళ్ళలో  అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన తొమ్మిది ముఖ్యమైన పండ్ల రకాలు వాటి  అవసరం అవి మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షిస్తాయి అనేది ఇపుడు తెలుసుకుందాం.

పండ్లతో పండంటి ఆరోగ్యం.

◆బత్తాయి

అన్నిచోట్లా అందరికి అందుబాటులో ఉండే పండు బత్తాయి. ఇందులో విటమిన్-బి పుష్కలంగా ఉంటుంది.  అలాగే బత్తాయిలో ఫైబర్ పాళ్లు ఎక్కువ. జింక్,  కాపర్, ఐరన్, కాల్షియం మొదలైనవి బత్తాయిలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఫ్యాట్ తక్కువ. అందుకే మధ్యవయస్కులకు బత్తాయి చాలా మంచిది. అయితే చాలా మంది బత్తాయి జ్యూస్ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు దీనివల్ల  ఫైబర్ ను కోల్పోతాం కాబట్టి నేరుగా బత్తాయిని వలిచి తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.

◆నిమ్మ

బత్తాయిలాగే సిట్రస్ జాతికి చెందిన నిమ్మలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. మనిషికి కావాల్సిన విటమిన్-సి సగంకు పైగా నిమ్మలో లభ్యమవుతుంది. నిమ్మను వంటల్లో మరియు జ్యూస్ గా ఎక్కువ వాడతారు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో చొచ్చుకువచ్చే కొవ్వుపదార్థాలను అదుపు చేసి కరిగించి బరువు తగ్గడంతో తోడ్పడుతుంది. ఇంకా విటమిన్-సి తగ్గినపుడు చోటు చేసుకునే స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది.

◆మామిడి

వేసవికాలం అనగానే మామిడి గుర్తు రావడం సహజం. మామిడిలో పుష్కలంగా ఫైబర్, విటమిన్-సి, కరోటినాయిడ్స్ మరియు ఆంటి ఆక్సిడెంట్లు  ఉంటాయి. మామిడి తినడం వల్ల రేచీకటి, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా సంరక్షిస్తుంది.

◆అరటి

అందరికి ఇష్టమైన అరటి పిల్లల నుండి పెద్దల దాకా తినగలిగే పండు. ఇందులో పోటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసహరం లో కూడా దొరకని పోషకాలు  ఒక అరటిపండులో దొరుకుతాయంటే ఆశ్చర్యమేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ ఏ, డి, ఇ, సి మెండుగా ఉంటాయి. 

◆నేరేడు

పుల్లగా, తియ్యగా, వగరుగా  ఉండే ఈ పళ్ళు పల్లెల్లో విరగ కాస్తాయి. మధుమేహం ఉన్నవాళ్ళకు ఈ పండు వరమే. కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్-సి, మాంగనీస్, జింక్, రైబోప్లోవిన్, నికోటిన్ నేరేడు లో లభ్యమవుతాయి. అనిమియాను రాకుండా చేస్తుంది. పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లిన వెంట్రుకలను కరిగించే గుణం నేరేడు పండు రసానికి ఉంది. 

◆ద్రాక్ష

గుత్తులు గుత్తులుగా అందరి కళ్ళను తనవైపు తిప్పుకునే ద్రాక్షలో  విటమిన్-సి, కె, ఎక్కువగా ఉంటాయి. సోడియం మరియు, కొవ్వులు ఇందులో తక్కువ ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. అజీర్తి, మలబద్దకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారక కణాలను విచ్చిన్నం చేసి కాపాడుతుంది. మైగ్రేన్ సమస్య, లివర్ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

◆జామ

విటమిన్-ఎ, విటమిన్-సి, ఒమేగా-3, ఒమేగా-6, కరగని కొవ్వు ఆమ్లాలు, పీచుపదార్థాలు అధికంగా ఉన్న జామ గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేదోడి యాపిల్ గా పేరుగాంచిన జామ వయసు వల్ల వచ్చే ముడుతలు తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది. అలాగే మధుమేహం ఉన్నవాళ్ళకు ప్రీతిపాత్రమైనది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. 

◆యాపిల్

రిచ్ ఫ్రూట్ అయిన యాపిల్ ను రోజుకు ఒకటి చెప్పున తీసుకుంటే డాక్టర్స్ అవసరం లేదు అనేది అందరి మాట. అయితే యాపిల్ ను తొక్కతీసి ముక్కలు కోసి తినడం వల్ల సంపూర్ణ పోషకాలు అందవు. అందుకే తొక్కతో సహా యాపిల్ ను తినాలని నిపుణుల సూచన. ఇందులో ఫెక్టిన్ కొవ్వు పదార్థాలను అదుపులో ఉంచుతుంది. యాపిల్ తొక్క 12 రకాల రసాయనపదార్థాలను కలిగి ఉండి క్యాన్సర్ అడ్డుకుంటుంది. అలాగే పెద్దపేగు సమస్యలను రొమ్ము క్యాన్సర్ ను రాకుండా రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

◆దానిమ్మ

ఎర్రెర్రని పండు వలిస్తే ముత్యాలాంటి పోషకాలు. మధుమేహ బాధితులకు కల్పవల్లి. శరీరంలో ప్రిరాడికల్స్ ను విచ్చిన్నం చేసి వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేస్తుంది. మతిమరుపు రాకుండా కాపాడటంలో దిట్ట.  ఇందులో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. మందగించిన రక్తసరఫరా వేగాన్ని పెంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

చివరగా….

పైన చెప్పుకున్న తొమ్మిది రకాల పండ్లు మన జీవితానికి దీర్ఘాయుష్షును ప్రసాధిస్తాయ్. అలాగే వీలువెంబడి డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకుంటూ ఉండాలి. శారీరక  సామార్త్యాన్ని పెంచి తద్వారా మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చడంలో సహాయపడతాయి.

Leave a Comment

error: Content is protected !!