వాము మనందరికీ తెలిసిన వంటింటి దినుసు. కానీ దాని ఔషధ విలవలు తెలియకుండానే మనం దీనిని అనేక వంటల్లో ఉపయోగిస్తున్నాం. వాము మొక్క మంచి పరిమళాన్ని వెదజల్లుతూ గుత్తులు గుత్తులు గా పువ్వులుతో ఉంటుంది. ఈ పూవులనుండే వాము వస్తుంది. వామునుండి తీసే సుగంధతైలం తైమూల్.
ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతున్నప్పుడు వాము లేదా వాముపొడిని వేడినీటిలో వేసి తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వామును కొంచెం వేయించి ఉప్పు, మిరియాలతో పొడిచేసి అన్నంలో మొదటి ముద్ద తినడంవలన ఉదరసంబంధ సమస్యలు తగ్గుతాయి. వాము, జీలకర్ర, ధనియాలు దోరగా వేయించి కషాయంలా మరిగించి తాగితే జ్వరం తగ్గిపోతుంది.
స్త్రీ లలో చనుపాలు వృద్ధి కావడానికి వాము సహాయకారి. వామును నీటిలో వేసీ మరిగించి తీసుకోవడం వలన మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. తేనెతో వాము కలిపి తీసుకోవడం వలన కిడ్నీలోని రాళ్ళు మూత్రంతో కలిసి బయటకుపోతాయి. వాము పొడిని గుడ్డలో కట్టి వాసన పీల్చితే తలనొప్పి, జలుబు తగ్గుముఖం పడతాయి. వాము తరచూ వాడడం వలన గుండెసంబంధ వ్యాధులు నిరోధించవచ్చు.
గోరువెచ్చని నీటిలో వాము వేసి నమలడంవలన దగ్గు, పంటినొప్పి తగ్గుతుంది. తమలపాకుతో వాము నమలడం వలన పొడిదగ్గు తగ్గుతుంది. పిల్లలు పడుకున్నప్పుడు దిండు పక్కన గుప్పెడు వాము దంచి పెట్టడం వలన ఆ ఘాటు వాసనకి ముక్కుదిబ్బడ పోతుంది. జలుబు వలన కఫం పేరుకుపోయినపుడు అరలీటర్ నీటిలో స్పూన్ వాముపొడి,స్పూన్ పసుపు వేసి చల్లారాక తేనె కలిపి రోజులో ఎక్కువగా తాగడం వలన కఫం కరిగిపోతుంది. మెత్తగా దంచిన వామును ఒక స్పూన్ గ్లాస్ మజ్జిగకు కలిపి తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గం శుభ్రపడుతుంది.
ఆస్తమా వ్యాధితో బాధపడేవాళ్ళు వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన ఆస్తమా తగ్గుముఖం పడుతుంది. వామును బుగ్గన పెట్టుకుని ఆ రసం మింగడం వలన కొండనాలుక వాపు తగ్గుతుంది. ఇలా ఎక్కువ సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వాము పేస్ట్ ను మోకాళ్ళ కు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడితే వాము పేస్ట్ రాయడం వలన తగ్గుతుంది. అంతేకాకుండా బుతుక్రమంలో వచ్చే నొప్పికి వాము మంచి పరిష్కారం.