ఆవు ఎంత గొప్పదో, ఆవు విశిష్టత ఏమిటో మన దేశానికి ఉన్న పశుసంపధలో ఆవు ప్రాముఖ్యత ఏమిటో అందరికి తెలిసినదే. చిన్నప్పటి నుండి పాలు తాగే పెరుగుతూ వచ్చాము మనం. పాలు పడని తల్లులకు ఆవు పాలే దిక్కు. ఆవు పాల తియ్యదనం, అమ్మ ప్రేమంత మధురం అంటారు. గోమాత అని అందరూ భక్తిగా పిలుచుకునే ఆవు పాలు నుండి లభించే పెరుగు, వెన్న, నెయ్యి వీటి విశిష్టత కూడా తక్కువేమీ కాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది ఆవు నెయ్యి గూర్చి. ఆవు నుండి లభించే ఉత్పత్తులలో అవి నెయ్యి ఎక్కువ కాలం నిల్వ వుంటూ అద్భుతమైన ఆరోగ్యాన్ని రుచిని మనకు అందిస్తుంది. ఆవు నెయ్యితో కూడా ఆరోగ్య చిట్కాలు బోలెడు ఉన్నప్పటికీ కొన్నింటిని మనం ఇక్కడ చెప్పుకుందాం.
◆ సాధారణంగా నెయ్యి వేడి చేస్తుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి నెయ్యి శరీరానికి చలువచేసి రక్తాన్ని పెంచి శరీర ధాతువులన్నింటికి పుష్టిని కలిగిస్తుంది.
◆ఆవు నెయ్యిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని దరిచేరనివ్వదు, అలాగే కంటి జబ్బులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో శుద్ధమైన కళ్ళ కాటుక తయారుచేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడతారు.
◆ తూలి పడిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి వాటిలో ఆవు నెయ్యి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలో చాలా వరకు ఆవు నెయ్యిని మాత్రమే వాడుతుండటం గమనించవచ్చు.
◆ ప్రమాదవశాత్తు తగిలిన గాయాలు, గాయాల తాలూకు పుండ్లు, అలాగే అగ్నిప్రమాదం జరగడం వల్ల ఒళ్ళు కాలిపోయి బాధపడుతున్న వారికి ఆవు నెయ్యిని రాయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది.
◆ ఆవు పాలను బాగా చిలికి వెన్న తీసేసి తయారు చేసిన మజ్జిగకు కూడా గొప్ప ఔషధ లక్షణాలు ఉన్నాయి. పలుచటి ఆవు మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయం ఆరోగ్యవంతమవుతుంది. అలాగే పేగుల పనితీరు మెరుగుపడుతుంది.
◆ ఆర్థిక స్థోమత ఉన్నవారు ఆవు నెయ్యిని ప్రతిరోజూ ఒళ్ళంతా రాసుకుని బాగా మర్దనా చేసుకుని స్నానం చేస్తుంటే సరేసరంలో అవయవాలకు అన్నిటికి మంచి పోషణ లభించి శరీరం దృడంగా తయారువుతుంది. అంగహే కాదు చర్మం ఆరోగ్యవంతమవుతుంది మరియు మెరుపును సంతరించుకుంటుంది.
◆ అయితే ఆవు ఆరోగ్యాన్ని బట్టి దాని నుండి లభించే పాలు, పాల తాలూకూ పెరుగు మరియు వెన్న, నెయ్యి ల ఔషధ గుణాలు ఆధారపడి ఉంటాయి
◆ ఆవుకు అందించే ఆహారం మేత మొదలైనవి తాజాగా మరియు స్వచ్చంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆవును ఆరోగ్యవంగంగా చూసుకుంటే శుద్ధమైన నెయ్యిని పొందవచ్చు.
◆ దైవకార్యాల నుండి ఔషధ వనరుగా ఉపయోగించడం వరకు అన్ని విధాలుగా ఆవు నెయ్యి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది.
చివరగా…….
ఆవు నెయ్యిని ప్రస్తుతం ఎంతో కల్తీ చేసి బయట అమ్ముతున్న తరుణంలో స్వచ్ఛమైన నెయ్యిని ఎంచుకోవడం కూడా ఒక సవాల్ అనే అనుకోవచ్చు. అయితే శుద్ధమైన నెయ్యి దొరికితే మాత్రం ఆరోగ్యానికి గొప్ప రక్షణ లభించినట్టే.