amazing health benefits of Rice Boiled Water

మనం వ్యర్థమనుకుని పారబోసే దీని గూర్చి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

మధ్యాహ్నం అవ్వగానే వేడి వేడిగా కంచంలో అన్నం వడ్డించుకుని మంచి కూరలతో ఎంజాయ్ చేస్తాము. అయితే ఇప్పట్లో అన్నం ఎంత పొడిగా ఉంటే అంత తినబద్దెస్తుంది అంటారు. కానీ తాము పోషకాలు వృదాచేసి మిగిలిపోయిన అన్నం అనబడే నిస్సారమైన ఆహారాన్ని తింటున్నామని గ్రహించరు. ఇంతకు నిస్సారం ఏమిటి, పోషకాలు పడేయడం ఏమిటి అని ఆలోచించక్కర్లేదు ఇక్కడే మీరే చదవండి.

ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా తినే ఆహారం అన్నమే. కాస్త కలిగిన వాళ్ళు అయితే రోటీలు, రకరకాల వెరైటీలు చేసుకుని తింటూ ఉంటారు కానీ కామన్ మ్యాన్ అయిన మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళం మాత్రం అన్నమే రామచంద్ర అనాల్సిందే. కానీ చాలా ఇళ్లలో అన్నం వండేవాళ్ళు గంజి వార్చి అన్నం వండుతారు. ఇక్కడే కదా మరి మనం చెప్పుకునే పోషకాలు అన్ని మన వీధి మురుగు కాలువలోకి వెళ్లిపోతున్నాయ్. అదేనండి అన్నం వంచేసిన గంజిని తీసుకెళ్లి పారబోస్తుంటే అలాగే కదా ఇక అనాల్సింది.

అందుకే ఈ గంజిలో దాగున్న ఆశ్చర్య పరిచే అద్భుతాలు మీకోసం చూడండి మరి.

◆అన్నం వండేసిన గంజిలో ఏముందంటే బోలెడు విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి

◆గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి బోలెడు శక్తిని ఇస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళ తరంలో అన్నం గంజి వంచేసినా ఆ గంజిలో ఉప్పు వేసి లేక  కాసింత మిర్చి, ఉల్లిపాయ, ఉప్పు కలిపి మధురంగా ఉండేలా తయారుచేసుకుని మనం చెప్పుకునే బ్రేక్ఫాస్ట్ అదేనండి అల్పాహారంగా తీసుకునేవాళ్ళు. అందుకే మన పెద్దలు ఎలాంటి జబ్బులకు గురి కాకుండా ఆరోగ్యవంతంగా ఉండేవారు.

◆గంజిలో ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు ఉంటాయంటే ఆశ్చర్యమేస్తుంది. గంజి తీసుకోవడం వల్ల ఈ అమైనో యాసిడ్లు మన శరీరంలో తక్షణ శక్తిని ఇస్తాయి. గ్లూకోజ్ కూడా ఇవ్వలేని శక్తిని మనం గంజి ద్వారా పొందవచ్చు అంటే ఆశ్చర్యమే కదా మరి.

◆సాధారణంగా అనారోగ్యంతో ఉన్నపుడు పెద్దలు ఆహారాన్ని తీసుకోవద్దని సూచిస్తారు. జీర్ణవ్యవస్థ సరిగా ఉండకపోవడం వల్ల ఆహారాన్ని తినవద్దని చెబుతారు. దానికి ప్రత్యామ్నాయంగా  పెద్దలు సూచించేదే గంజి. గంజి వల్ల జీర్ణాశయం శుభ్రపడి మలబద్దకం నివారించబడుతుంది. అంతే కాదు విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఉన్నప్పుడు  పిల్లలకు అయినా పెద్దలకు అయినా గంజి గొప్పగా పనిచేస్తుంది.

◆గంజిలో ఉన్న అమైనో ఆమ్లాలు మన శరీర కండర నిర్మాణాన్ని సమర్థవంతంగా ఉండేలా చేస్తాయి. అందువల్ల బాడీ బిల్డింగ్ చేసేవారు తమ డైట్ మెనూ లో తప్పనిసరిగా గంజిని చేర్చుకుంటారు..

◆ఇంకా గంజిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల్లో శారీరక ఎదుగుదలకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

◆గంజిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వల్ల శరీరంలో పెరిగే కాన్సర్ కారక కణాలతో పోరాడి కాన్సర్ ను మన దరి చేరకుండా రక్షణ ఇస్తుంది.

◆గంజి కేవలం ఆరోగ్యపరంగానే కాదండోయ్ సౌందర్య సాధనంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. గంజిని కాసింత మొహానికి రాయడం ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముడుతలు పోయి చర్మం కాంతివంతం అవుతుంది.

◆గంజిని తలకు పట్టించి కాసేపయ్యక తలస్నానం చేయడం వల్ల జుట్టు మెరుపు సంతరించుకుంటుంది. అలాగే గంజిని కుదుళ్లకు పట్టేలా మర్దనా చేసి తరువాత తలంటు పోసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తలలో చుండ్రు, దురదలు వంటి సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తుంది.

చివరగా…..

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు గంజి కాచుకుని కడుపు నింపుకునేవారు అనే కథల్లో మరియు పెద్దల నోట వినడాలు చూసి ఇంట్లో వార్చిన గంజిని తీసుకోవడం చిన్నతనంగా భావించాల్సిన అవసరం లేదు. మనం చిన్నతనంగా భావించి వదిలేసుకుంటే పెద్ద ఆరోగ్యప్రయోజనాలను చేతులారా పారబోసినట్టే. మరి బెంజ్ కారున్న వాడైనా గంజిని తాగడం వల్ల వెలకట్టలేని ఆరోగ్యాన్ని పొందుతాడాని ఇప్పుడైనా నమ్ముతారా??

Leave a Comment

error: Content is protected !!