హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికి ఎలాంటి జబ్బులు అంటవని పూర్వీకుల నమ్మకం.. తులసి లో ఉన్న ఔషధవిలువలు మాత్రం వెలకట్టలేనివి.
తులసిలో ఏముంది??
ఇది తక్కువ కేలరీల ఔషధ మూలిక ఆంటి ఆక్సిడెంట్ , ఆంటి ఇన్ఫ్లమేటరీ మరియు ఆంటి బాక్టీరియల్ లక్షణాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇంకా విటమిన్లు ఏ, సి మరియు కె, అలాగే మాంగనీస్, రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వులు సహా అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇన్ని పోషకాలు ఉన్న తులసితో అబ్బురపరిచే కొన్ని విషయాలు తెలుసుకుందాం.
◆చాలామందిని వేధించే సమస్య కఫం. కఫానికి తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రోజు నాలుగు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు కఫం నుండి ఉపశమనం పొందవచ్చు.
◆కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నయమవుతుంది.
◆జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి మిరయిలను మెత్తగా దంచి గుళికలు( మాత్రలు) గా చేసుకుని వాడటం వల్ల ఆకలి పెరుగుతుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది.
◆దంత సంరక్షణ కోసం తులసిని వాడచ్చు. తులసి ఆకులను నీడలో ఎండించి దంచి మెత్తని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పళ్లపొడిలా ఉపయోగించడం లేదా మనం రోజూ వాడే పేస్ట్ లో కలిపి పళ్ళు తోముకోవడం వలన పళ్లమీద పసుపు రంగు తొలగిపోయి తెల్లగా అవుతాయి అలాగే దంతాలు దృఢంగా తయారు అవుతాయి.
తులసితో ఇంకా ఎన్నో…….
దగ్గు, జలుబు వేధించే సమయంలో తేనెలో తులసి ఆకులు రసం కలిపిటీసుకుంటే సమస్య మటుమాయం.
కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడం లాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కనురెప్పల మీద రాసుకోవాలి అయితే కంట్లో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
శరీరంలో ఉష్ణోగ్రతను హెచ్చుతగ్గులు లేకుండా చేసే గుణం తులసి ఆకులు ఉంది. అలాగే ప్రతిరోజు ఒక పూట పుదీన, తులసి ఆకులను నీటిలో వేడి చేసి టీఆ చేసుకుని తాగడం వల్ల జ్వరానికి మంచి ముందులా పనిచేస్తుంది.
గుప్పెడు తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే గొంతునొప్పి మటుమాయం.
బొంగురు గొంతుకు తులసి అద్భుత ఔషధం ప్రతిరోజు ఒక స్పూన్ తేనెలో ఒక స్పూన్ తులసి రసం కలిపి తాగితే శ్రావ్యమైన గొంతు మీ సొంతం.
తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
చివరగా…….
తులసిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల వెలకట్టలేని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని, వేధించే జబ్బులను పారద్రోలవచ్చు.