amla indian gooseberry health benefits

అందరికి అందుబాటులో ఉండే అమృతఫలంలో ఆరోగ్య రహస్యాలు

మన పెద్దలు చెప్పినట్టు ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. మాసాలు తగ్గట్టు అలవాట్లు మార్చుకొమ్మని, జాగ్రత్తలు తీసుకొమ్మని చెబితే వెకిలిగా నవ్వేసి ముందుకెళ్లిపోతాం. ఒక్కసారి సైంటిఫిక్ గా ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ప్రతి పండుగకు మర్మం ఉన్నట్టే పెద్దల మాటలో ఎంతో రహస్యముంటుంది. కార్తీక మాసం వచ్చేస్తోంది. వస్తూ వస్తూ చలిని రెట్టింపు చేసుకుంటూ వస్తుంది. ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. కాలాన్ని మార్చుకుంటూ వస్తుంది ఆ కాలం వల్ల మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కారాలు కూడా తనతో వెంటబెట్టుకు వస్తుంది. కార్తీకంలో ఆధ్యాత్మికంగా శివాలయాలు కిటకిటలాడతాయి, శివనామస్మరణం మార్మోగుతుంది. అలాగే ఉసిరికాయ దీపాలు కనులవిందు చేస్తాయి. కార్తీకం తీసుకొచ్చే అద్భుతమైన అమృత ఫలం ఉసిరికాయ. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధంగా విస్మయపరిచే ఫలితాలను ఇస్తుంది ఉసిరికాయ. ఇంతకు ఉసిరికాయలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటి,అవి మనకు ఎలా మేలు చేస్తాయి ఒకసారి చదవండి.

విటమిన్ సి పుష్కలంగా లభించే ఉసిరికాయ వగరు, పులుపు, చిరు చేదు, చివరలో కాసింత తీపిదనాన్ని కలిగి ఉంటుంది.  ఉసిరికాయను వంటల్లో కాకుండా ఆయుర్వేద వైద్యం లో విరివిగా వాడతారు.  త్రిగుణాలను అదుపులో ఉంచే త్రిపల చూర్ణంలో  ఉసిరికాయ చూర్ణం కూడా ఉంటుంది. అంటే త్రిపలాలలో ఉసిరికాయ ఒకటి అని అర్థం. 

ఉసిరి ఉపయోగాలు చూద్దామా

◆తెలుగు వారి ఆవకాయ అమోఘం, మామిడి లాగే ఉసికాయతో ఆవకాయ పెట్టి లాగిస్తుంటారు. అయితే ఉసిరి ఏడాది మొత్తం అందుబాటులో ఉండదు కాబట్టి ఉసిరికాయను ఉప్పుతో కలిపి ఎండబెట్టి ఒరుగులుగా తయారుచేసి నిల్వచేసుకుంటారు. అజీర్ణం, నోటికి రుచి తెలియకపోవడం, అధిక దాహం వంటి సమస్యలు ఉన్నవారు రోజు ఒక ఒప్పును బుగ్గన పెట్టుకుని చప్పరించడం వల్ల గొప్ప పలితం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో గొప్పగా పనిచేస్తుంది.

◆ఉసిరికాయను తీసుకోవడం వల్ల అధిక కొవ్వులు కరిగించి బరువు తగ్గడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

◆ఉసిరికాయను ఆహారంలో భాగం చేసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారం నుండి ఐరన్ ను చాలా తొందరగా గ్రహించగలుగుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం తో బాధపడుతున్న మహిళలు ఉసిరికాయను తీసుకోవడం ఉత్తమం. కనీసం ఒరుగులుగా నిలవచేసుకోవడం లేదా ఉసిరిక పొడి ని వినియోగించడం అయినా చేయాలి.

◆ఉసిరిలో లభ్యమయ్యే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది అంతేకాకుండా చెడు కొవ్వులను నిర్మూలించే గుండెకు కావాల్సిన మంచి కొవ్వులను గ్రహించడంలో తోడ్పడుతుంది. అందుకే గుండె జబ్బులు ఉన్నవారు మధ్యవయస్కులు ఉసిరికాయను తప్పనిసరిగా తీసుకోవాలి.

◆కంటి చూపు సమస్యలు ఉన్నవారికి ఉసిరికాయ చక్కని పరిష్కారం. ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.

◆లివర్ లో చేరిన మలినాలు, విష పదార్థాలను తొలగించడంలో ఉసిరి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. 

చివరగా…..

ఉసిరికాయను రోజు ఆహారంలో  భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ప్రకోపించే త్రిగుణాల అస్తవ్యస్తం క్రమబద్దమవుతుంది, అలాగే జుట్టుపెరుగుదలకు, ఆరోగ్యాన్ని కాపాడడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి, జ్ఞాపకశక్తికి,  ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, అల్సర్ సమస్యలకు. ఇలా ఎన్నింటికో గొప్పగా పనిచేస్తుంది. మరి కార్తీకంలో మొదలయ్యే ఉసిరిని నేరుగా తీసుకుంటూ ఇంకా ఎక్కువగా దొరికితే నిల్వచేసుకుని ఏడాది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment

error: Content is protected !!