మునుపటిలా ఏదీ గుర్తుండటం లేదనేది కొందరి దగ్గర వింటూ ఉంటాం. ఐడి కార్డ్ ఎక్కడ పెట్టానో ఏమిటో అంటూ డ్యూటీ కి వెళ్లేముందు ఇల్లంతా చక్కర్లు కొడతాడు ఒక మధ్యవయస్కుడు. మీ నాన్న మొబైల్ నెంబర్ చెప్పరా అంటే తన మొబైల్ లో ఫోన్ బుక్ ఓపెన్ చేస్తే తప్ప చెప్పలేకపోతాడు ఒక టీనేజర్. బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మరిచిపోయానంటూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలు. కళ్ళజోడు ఎక్కడో పెట్టి మరిచిపోయానంటూ వృద్ధుడి అగచాట్లు.
పైన విషయాలు గమనిస్తే కేవలం పెద్దవాళ్లే కాదు ఇప్పట్లో చిన్న వయసు వారు కూడా మతిమరుపు బాధితులే. అయితే ఈ మతిమరుపు కేవలం ప్రస్తుత యాంత్రిక జీవనం వల్ల 90% సంభవిస్తోందని నిపుణుల అభిప్రాయం. మరి దాన్ని అధిగమించాలంటే ఇదిగో ఇలా చేయండి సమస్య హుష్ కాకి అని పారిపోద్ది.
◆ దినపత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. పత్రికలలో ఇచ్చే క్విజ్ లు, పదకేళి లాంటి పజిల్స్ ను పూరిస్తూ ఉండాలి. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మీలో బాషా జ్ఞానం మెండుగా ఉంటే మీ పరిధిలో ఒక భాషలో విషయాలు మరొక భాషలోకి మార్చడానికి ప్రయత్నించండి. దీనివల్ల మెదడు డిజెనరేషన్ అయ్యే క్రమం తగ్గి చురుగ్గా మారుతుంది.
◆ శరీరానికి వ్యాయామం ఎలాగో, మెదడుకు కూడా అలాగే వ్యాయామం ఉండాలి. కాబట్టి ప్రతిదానికి మొబైల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఆధారపడకుండా సొంతంగా ఆలోచించడం చేయండి. ముఖ్యంగా గణిత సమస్యలు, మనకు తెలిసిన వారి ఫోన్ నంబర్లు వంటివి ఫోన్ బుక్ లో కాకుండా మెదడులో నిక్షిప్తం చేసుకోండి.
◆ మెదడు ను మనం ఎంత వాడితే అంత గొప్పగా ఆలోచించగలుగుతాం. దానికి పనిపెట్టకపోతే పనితీరు మందగించి ఆలోచించడం అనే విషయకంటే ముందు అనాసక్తి, నిర్లక్ష్యం, బద్దకం వంటివి చుట్టుముడతాయి. దీనివల్ల మెదడు కణాలు అయిన న్యూరాన్ లు మందకొడిగా మారిపోయి ఆలోచనా పటిమను కోల్పోతాయి.
◆ ఆందోళన, దిగులు వంటివి లేకుండా ఉండేలా మానసిక ప్రశాంతత కోసం యోగ, ధ్యానం వంటివి చేయాలి. రోజులో కొద్దిసేపు కుటుంబసభ్యులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు మొబైల్, కంప్యూటర్ వంటి వాటిని అవసరమైనంత మేరకు మాత్రమే వాడుతుండాలి.
◆ మెదడు సామర్త్యాన్ని గొప్పగా తీర్చిదిద్దేది పుస్తకపఠనం. వీలైనంతవరకు పుస్తకాలు చదవడం, లైబ్రరీకి వెళ్లడం, రచనలు, ఉపన్యాసా గ్రంథాలు, ఆత్మ కథలు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ చదువుతుండాలి. రోజులో కనీసం గంట సమయమైన పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి, చదివిన విషయాలను పునరుశ్చరణ చేసుకోవడం విశ్లేషించుకోవడం వలన ఆలోచనలు పెరుగుతాయి. వీటి వల్ల మెదడులో న్యూరాన్ లు పునరుత్తేజం పొందుతాయి.
చివరగా…..
మతిమరుపును జయించాలంటే ఒంటరితనాన్ని వీలలైంతవరకు అధిగమించాలి. నలుగురితో సంభాషించడం, అభిప్రాయాలు పంచుకోవడం, ఆసక్తికరమైన విషయ సేకరణ అభిరుచి కలిగిన దేన్నీ వదలకుండా జీవితంలో భాగం చేసుకుంటాయి మొబైల్, కంప్యూటర్, టీవీ లాంటి వాటికి ప్రాధాన్యం తగ్గించాలి. దీనివల్ల ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటూ మతిమరుపును మెడపట్టి మన జీవితం నుండి బయటకు గెంటేస్తాయ్.