ఆకులో ఎన్ని పదార్థాలు ఉన్నా ఆవకాయ ముక్క లేకపోతే వెలితి. నోటిని అరుచి ఆవరించినపుడు ఒక ఆవకాయ బద్ధ ఉంటే ఆనందంగా అన్నం తినేయచ్చు, ప్యాలెస్ లో ఉన్న బడా బాబులకు అయినా గుడిసెలో ఉండెకూలి కి అయినా జిహ్వను వహ్వా అనిపించే ఘనత ఆవకాయదే. ముఖ్యంగా తెలుగోళ్లకు ఆవకాయ అంటే పంచప్రాణాలు. ఏడాదికి సరిపడా పెద్ద మొత్తంలో నిల్వచేసి పెట్టుకుంటారు. కొందరికి ప్రతిరోజు ఆవకాయ లేకపోతే ముద్ద దిగదు. ఇంత అటాచ్మెంట్ ఉంది అందరికి ఆవకాయతో.
అజీర్తి చేసినపుడు ఆవకాయ ఉంటే ఇక కడుపు గడగడలు, బిడబిడలు పరార్ అంటారు పెద్దలు. ఆవకాయతో ఉపయోగించే ఆవపిండి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అయితే ఆవకాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అంతే నష్టాలు కూడా ఉన్నాయనేది నిజం. ఆ నిజాలు ఏమిటో చూసేద్దాం మరి.
ఆవకాయ వలన కలిగే ప్రయోజనాలు.
◆ ఆవకాయను తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులకు వ్యతిరేకంగా పనిచేసి నులిపురుగులను నిర్మూలించడంలో తోడ్పడుతుంది.
◆ జీర్ణక్రియ నెమ్మదించడం లేదా అతిగా ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన సమయాలలో ఆహారాన్ని తీసుకోకుండా వేళ కానీ వేళలో ఆహారాన్ని తీసుకుంటే కలిగే అజీర్తికి నిర్మూలించడంలో ఆవకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాదు అజీర్తి వల్ల కలిగే వాత దోషాలను కూడా తగ్గిస్తుంది.
◆ అతి చల్లని ఆహారం లేదా చల్లని వాతావరణం మరియు ఊపిరితిత్తులలో ఏర్పడే శ్లేష్మం ద్వారా ఎదురయ్యే కఫ దోషాలను నివారించడంలో ఆవకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
◆ శరీరంలో వేడిని పెంచడం ద్వారా అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
◆ ఆవకాయతో ఉన్న పులుపు మరియు ఘాటు, కారం వల్ల అపుడపుడు అవకాయను తీసుకుంటే శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.
◆ ముఖ్యంగా జ్వరం వచ్చినపుడు అన్నం తినకూడదని చాలా మంది అంటారు మరియు డాక్టర్లు సూచిస్తారు. అయితే వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసి బాగా కలులుపుకుని కాస్త ఘాటుగా తింటే ఒంట్లో ఉన్న జ్వరం పరార్ అవుతుంది.
ఇవన్నీ ఆవకాయ వల్ల కలిగే లాభాలు అయితే ఆవకాయ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా చూసేద్దాం.
ఆవకాయ వల్ల కలిగే నష్టాలు
◆ ఆవకాయలో ఉండే పులుపు వల్ల ఎక్కువగా ఆవకాయను తింటే కడుపులో పైత్యాన్ని పెంచడం ద్వారా పేగులోపల పుండ్లు అనబడే అల్సర్ కు కారణం అవుతుంది. ఈ అల్సర్లు ఇలాగే ఉంటే క్రమంగా పెద్దగా మారి ఆపరేషన్ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది.
◆ ఆవకాయను నిల్వచేసుకోవడం వల్ల అది మరింత పైత్యాన్ని పెంచుతుంది. అంటే ఆవకాయ పాతబడేకొద్ది పైత్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉపయోగించిన నూనె, ఆవపిండి, ఎండుకారం, మామిడికాయ ముక్కలు అన్ని కలిసి ఊట గా మారి అతి పైత్యాన్ని కలిగించేవి గా ఉంటాయి. అందుకే కొత్త ఆవకాయ కంటే పాత ఆవకాయ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు, నిపుణులు చెబుతుంటారు.
◆ ఆవపిండి వాతాన్ని తగ్గించేది అయినప్పటికీ, ఆవకాయ నిల్వ వల్ల అందులో జరిగే చర్య వల్ల దాన్ని అతిగా తిన్నపుడు తగ్గిపోయిన వాతపు నొప్పులు తిరిగి మొదలవుతుంటాయి. కాబట్టి వాత సమస్య ఉన్నవారు అవకాయను పరిమితంగా తీసుకోవడం మంచిది.
◆ ఆవకాయ తీసుకోవడం వల్ల కఫాన్ని తగ్గించుకునే మాట నిజమైనప్పటికి ఎక్కువగా తీసుకుంటే దగ్గు, జలుబు, తుమ్ములకు కారణం అవుతుంది.
అయితే ఆవకాయ కు ఆవపిండి కలపడం వల్ల మామిడికాయ, ఎండుకారం, నూనెల వల్ల కలిగే దోషాలు అణచివేయబడతాయి.ఆవపిండి వాడకుండా తయారు చేసిన మాగాయ లాంటివి కచ్చితంగా ఆవకాయ కంటే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగిస్తాయనేది ఒప్పుకోవాల్సిన నిజం.
చివరగా…..
ఆవకాయ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమైనా మెండుగా ఉన్నాయంటే మొదటి కారణం ఆవాల వల్లనే. శరీరంలో కలిగే సమస్త దోషాలను ఆవాలు సులువుగా నశింపజేస్తాయి. ఆవకాయతో ఈ అవాల మోతాదు కాసింత ఎక్కువే ఉంటుంది కాబట్టి కొత్తవకాయ ఆరోగ్యానికి మంచిదే, పాతబడినా నష్టాలు పెద్దగా కలిగించకపోవచ్చు కానీ ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరమే.