అత్తిపండు అంటే పెద్దగా ఎవరికి తెలియదు కాని అంజూర పండు అనగానే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పచ్చిగా ఉన్నపుడు పుల్లగా వగరుగా వుండే ఈ పండు మెల్లిగా పండే కొద్ది మధురమైన తీపిని నింపుకుంటుంది. పక్వానికి వచ్చాక మూడు లేక నాలుగు రోజులకు మించి నిల్వ చేయలేని ఈ పండును చాలా వరకు ఎండించి డ్రై ఫ్రూట్ గా అమ్ముతారు. ఈ డ్రై ఫ్రూట్ ధర కూడా ఎక్కువే, ఇందులో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.
మరి అత్తిపండు గూర్చి కొన్ని ఆరోగ్యకక్రమైన నిజాలను పంచుకుందాం రండి మీకోసమే ఇవన్నీ….
విటమిన్-ఏ, విటమిన్-ఇ, విటమిన్-కె, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్-బి12, విటమిన్-బి1 వంటివి సమృద్ధిగా ఉన్న అంజూర్ పండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మేడి పండు మరియు మర్రి పండ్లకు దగ్గరగా అనిపించే ఈ పండు పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్ గా లేక ఫ్రెష్ ఫ్రూట్ గా ఎలా తీసుకున్నా బోలెడు ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ పండుతో అద్భుతమైన చిట్కాలు ఆరోగ్యాన్ని చేకూర్చే రహస్యాలు మీకోసం చదవండి మరి.
◆అంజూర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని పొట్టు కాస్త మందంగా ఉండి పీచును ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల అంజూర్ పండును తీసుకుంటే జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు బరువు తగ్గాలి అనుకునేవారికి ఉత్తమమైన పండుగా కూడా సహకరిస్తుంది.
◆ఈపండులో సన్నని గసగసాల పరిమాణంలో విత్తనాలు ఉంటాయి. ఇవి పేగుల గోడలను దృఢపరుస్తాయి మరియు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దీనివల్ల పేగులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అంతేకాదు పెద్ద పేగు క్యాన్సర్ ను నివారించడంలో కూడా అంజూర్ పండు అద్భుతంగా పనిచేస్తుంది.
◆ఫైల్స్( మొలలు) తో బాధపడేవారు ఎండు అంజూర్ పండ్లను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. దీనివల్ల మొలల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.
◆అధిక వేడి శరీరం ఉన్నవారు ఎన్ని చేసినా అధిక వేడి పునావృత్తం అవుతుంటుంది. అలాంటి వారు బాగా పండిన అంజూర్ పండ్లను చిదిమి అందులో కొద్దిగా కలకండ వేసి రాత్రిమొత్తం అలాగే ఉంచి ఉదయాన్నే పరగడుపున తినాలి. ఇలా చేస్తుంటే అధికవేడి తొలగిపోయి శరీరం చల్లదనం పొందుతుంది.
◆అత్తిపండు లేదా అంజూర్ లో ఉన్న పోషకాలు శారీరక బలహీనత ఉన్నవారికి అద్భుత వరం అని చెప్పవచ్చు. అత్తిపండ్లు తరచుగా తీసుకుంటూ ఉంటే బలహీనత నశించి శారీరక బలం పుంజుకుంటుంది.
◆మనశరీరంలో పొటాషియం సోడియం లెవల్స్ ను అత్తిపండు క్రమబద్దీకరిస్తుంది. అందువల్ల బిపి ని కంట్రోల్ లో ఉంచగలుగుతుంది.
◆అంజూర్ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళల్లో అనిమియాతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి అనిమియా బారి నుండి రక్షించబడతారు.
◆ఫినాల్ మరియు ఒమేగా6 ఆమ్లాలు అంజూర్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం మంచి కొవ్వులు పెంపొందడంలో సహాయపడతాయి. అలాగే అంజూర్ లో ఫెక్టిన్ లు మన శరీరంలో ఉన్న టాక్సిన్ లను బయటకు పంపేస్తుంది. అందుకే అంజూర్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుతుంది.
చివరగా……
అత్తిపండు లేదా అంజూర్ మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక సమయంలో తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలే కాకుండా శరీరాన్ని యవ్వనంగా కూడా ఉంచుతుంది. అయితే టేస్ట్ బాగుందని ఎక్కువగా తినేయకూడదు. మరి ఇప్పుడు అర్థమైందా ఇదేమి ఉత్తుత్తి పండు కాదు.