మనిషి జీవితం రంగులమయంగా ఉండాలన్నా, రోజువారీ పనులు సక్రమంగా జరగాలన్నా కంటిచూపు ప్రధానం. అలాంటి కంటిచూపు ఇప్పటిరోజుల్లో ప్రమాదంలో పడింది. మనం తినే తిండిలో విటమిన్ రహిత ఆహారం, రోజులో ఎక్కువ సేపు ఫోన్లు చూడడం, కంప్యూటర్లతో గంటల తరబడి పనిచేయడం, పిల్లలకు ఆన్లైన్ క్లాసులంటూ ఫోన్, లాప్టాప్లతో ఎక్కువ సేపు గడపడంతో కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.
కళ్ళు తడారిపోవడం, దురదలతో మొదలై పవర్ఫుల్ కళ్ళద్దాలు వాడవలసి వస్తుంది. లేదా లేజర్ చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వాటివలన కూడా దుష్ప్రభావాలు రావచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ కూడా కంటిచూపుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లల్లో కంటిచూపు సమస్యలు సర్వసాధారణం అయిపోతున్న తరుణంలో కొన్ని జాగ్రత్తలు, చిట్కాలతో కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ విషయంకై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ఫోన్ కంప్యూటర్ ఎక్కువగా వాడాల్సి వస్తే అరగంటకోసారి పదినిమిషాలు విరామం ఇవ్వాలి. పొడారిన కళ్ళు కొంతసేపు కళ్ళు మూసుకోవడం ద్వారా తిరిగి తేమను సంతరించుకుంటాయి. రెండు అరచేతులను గట్టిగా రుద్ది, కొంచెం వేడి పుట్టాకా ఆ అరచేతులను కంటికి పెట్టడం వలన కళ్ళలోని నరాలకు విశ్రాంతి లభిస్తుంది. దూరంగా ఉన్న వస్తువులను, పచ్చదనాన్ని తదేకంగా చూడడంవలన కూడా కంటి చూపు మెరుగవుతుంది.
అలాగే ఆకుకూరలు, కేరట్, యాపిల్లాంటి విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే నాలుగు బాదంపప్పులను నానబెట్టి పైన పొట్టు తీసి, అందులో నాలుగు నల్లమిరియాలు, ఒక చెంచా పటికబెల్లం కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ పేస్ట్ ని మరుగుతున్న గ్లాసు పాలల్లో వేసి వడకట్టకుండా రాత్రిపూట తాగడం వల్ల కొన్నివారాల్లోనే మీ కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
దానితోపాటు మునగాకు రసంలో తేనె లేదా పటికబెల్లం వేసి తాగడం, లేదంటే వంటలలో ఎక్కువగా మునగాకు ఉపయోగించడం కూడా కంటి సమస్యలను దూరంచేస్తుంది. మునగాకులో కాల్షియం, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. నిమ్మజాతి సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా విటమిన్ సి లభించి కంటిసమస్యలు తగ్గుతాయి. గ్లాసు నీళ్ళలో స్పూన్ ఉసిరి రసం కలిపి తాగినా కంటిసమస్యలు రాకుండా చేస్తుంది.
కంటి వ్యాయామాలు కూడా కంటిచూపు సమస్యలు రాకుండా చేయగలవు. కనుక కనుబొమ్మలను చూపుడువేలు బొటనవేలు మధ్య ఉంచి నెమ్మదిగా నొక్కాలి. కళ్ళను పైకి,కిందకు అంటూ కనుబొమ్మలను పట్టుకుని రెప్పలను ఆర్పి, తెరవడం వలన కళ్ళకు వ్యాయామం జరిగి బిగిసుకు పోయిన కండరాలు ఉపశమనం పొందుతాయి.