వేసవి ఉక్కపోత గూర్చి అందరికి తెలిసినదే. ఈ ఉక్కపోత వల్ల శరీరానికి చెమట అధికంగా పడుతుంది. కనీసం రెండు నిమిషాలు బయట తిరిగినా నీటిని ధారగా ఒంటి మీద పూసినట్టు చెమట కారిపోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది వేసవి లో బాహుమూలల్లో చెమట కు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎంత ఫ్రెష్ దుస్తులు వేసుకున్నా నిమిషాల మీద చెమటకు తడిసిపోవడం మాత్రమే కాకుండా ఆ చెమట వాసన కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ చెమట వాసనను అధిగమించే సులువైన చిట్కాలు ఉన్నాయ్ వాటిని మీకోసం చెప్పేస్తున్నా…… ఫాలో అయిపోండి.
వేసవిలో తాజాగా ఉండటానికి చిట్కాలు:
◆ వెనిగర్ గూర్చి చాలా మందికి తెలుసు. వంటల్లో వాడే ఈ వెనిగర్ పులుపు రుచితో ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన గుణాలు కలిగిఉంటుంది. వెనిగర్ సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. అంతేకాదు తీవ్రమైన వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. దుర్వాసన ఉన్న ప్రదేశాలలో సాధారణ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ స్ప్రే చేసుకుని ఆ ప్రాంతాన్ని పొడి బట్టతో తుడుచుకోవాలి. లేదా స్నానం చేసేటపుడు నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
◆ప్రతిరోజు స్నానం చేయడానికి వెళ్ళే ముందు మొత్తం శరీరానికి శనగపిండి మరియు పెరుగు మిశ్రమాన్ని పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. తరువాత సబ్బు ఉపయోగించకుండా స్నానం చేయాలి. దీనివల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి చెమట సరిగా బయటి రాక ఆ ప్రదేశంలో వెలువడే దుర్వాసనను అరికట్టవచ్చు. అలాగే చర్మ రంద్రాలు వదులుగా అవ్వడం వల్ల శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. చర్మరంధ్రాలు ఆరోగ్యంగా మారడం వల్ల చెమట వాసనను నియంత్రిస్తుంది.
◆ శరీరం నుండి వెలువడుతున్న దుర్గంధాన్ని తగ్గించడానికి మరొక మంచి ఉపాయం. సువాసన గల నూనెలను ఉపయోగించడం. స్నానానికి వెళ్ళేటప్పుడు 2 నుండి 3 చుక్కల ఎస్సెంటియల్ ఆయిల్ లేక రోజ్‌వాటర్ ను బకెట్ నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇది దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది మరియు శరీరంను సువాసనగా ఉంచుతుంది.
◆ తాజా కొబ్బరి పాలు చెమట ఎక్కువ ఉత్పన్నం అయ్యే ప్రదేశాల్లో అప్లై చేసి కొద్దిసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి లేదా ద్రాక్ష పళ్ల నుండి రసం తీసేసిన తరువాత మిగిలిన పిప్పితో బాగా రుద్దుకుని 5 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చెమట ఎక్కువ పట్టె ప్రదేశాల్లో చెమట తగ్గి తాజాధనం ఎక్కువసేపు ఉంటుంది.
◆ తాజా పుదీనా ఆకులు నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యవంతమవడం మాత్రమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. చర్మరంద్రాలు రిపేర్ చేయడం లో పుదీనా చక్కగా పనిచేస్తుంది.
◆మరొక సహజమైన ఉపాయం ఎండిన మారేడు ఆకుల పొడిని సేకరించి, సోప్ బేస్ ను తీసుకుని వేడి చేసి అందులో మారేడు ఆకుల పొడిని కలిపి సబ్బు తయారుచేసుకోవాలి. ఈ సబ్బును రోజూ వాడుతుంటే శరీర దుర్వాసనను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
చివరగా….
దుర్వాసనను తరిమికొట్టడానికి పైన చెప్పుకున్నా చిట్కాలను మాత్రమే కాకుండా నీటిని బాగా తీసుకోవాలి, అలాగే నూనె పదార్థాలు, వేపుళ్ళు వంటి వాటికి దూరంగా ఉండాలి. సహజంగా చలువ చేసే పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.