మన శరీరం వండిన పదార్థాలు తినడానికి తయారు చేసినది కాదు. మనిషికి తెలివి పెరిగేకొద్దీ అగ్ని పుట్టించడం, పదార్థాలు వండడం నేర్చుకున్నాడు. కానీ శరీరం సహజంగా దొరికే పదార్థాలను తినడానికి తయారు చేయబడింది. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా ఆహారాన్ని వండుకొని తినడం మొదలు పెట్టామో శరీరంలో అనేక అనారోగ్యాలు కలగటం మొదలయింది. వీటిని నివారించడానికి ఎంత త్వరగా సహజ పద్ధతులకు మారుతామో అంతే త్వరగా ఆరోగ్యాన్ని పొందగలుగుతాం.
దాని కోసం మనం తీసుకోవాల్సినవి మన ఆహార పదార్థాలలో ఎక్కువ పండ్లు, పండ్ల రసాలను భాగం చేసుకోవడం. మనకు తెలిసి ఆపిల్ను అత్యంత ప్రాముఖ్యమైన పండు అని భావిస్తాం. దీనిని తినడం వలన సకల రోగాలు తగ్గిపోతాయి అని చెబుతుంటారు కానీ మనకి అతి తక్కువ ధరలో ఆపిల్ అందించే పోషకాలను లాభాలను అందించే పండ్లు ఇంకా ఉన్నాయి. అవే జామకాయలు.
జామకాయలు మనకి సంవత్సరం అంతా అందుబాటులో ఉంటాయి. అలాగే తక్కువ ధరలో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన యాపిల్ వల్ల లభించే పోషకాలన్నీ లభిస్తాయని వీటిని పేదవాడి ఆపిల్ అని చెబుతారు. అలాగే సీజనల్ గా దొరికే సీతాఫలం, నేరేడు వంటివి ఆ సమయంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు చాలా బాగా సహాయపడుతాయి. సహజ చక్కెరలు వలన ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి.
అలాగే సంవత్సరమంతా దొరికే బొప్పాయి కూడా మనం రోజూ తినే ఆహారంలో భాగం చేయాలి. కర్బూజ, పుచ్చకాయ వంటివి తీసుకుంటూ ఉంటే మన శరీరానికి శ్రమ తగ్గి, కొవ్వు నిల్వలను పెంచకుండా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వీలైనంత జంక్ ఫుడ్ని దూరం పెట్టి రోజులో కనీసం ఒక్క పూట అయినా కేవలం పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న విష వ్యర్థాలను నిర్విషీకరణ చేస్తోంది.
శరీరంలో టాక్సిన్లు పేరుకోకుండా కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆహారం చాలా బాగా సహాయపడుతుంది. కూల్ డ్రింక్ బదులు పండ్లరసాలు తీసుకోవడం వలన నోటి నుండి, మలబద్ధకం వరకు ఎన్నో రకాల వ్యాధులను ప్రారంభదశలోనే తగ్గించుకోవచ్చు. అందుకే ప్రకృతి మనకు అందించిన పండ్లను తరచూ తింటూ అనారోగ్యాలకు దూరంగా ఉందాం.