best way to drink water for healthy life

వాటర్ లో మాటర్ తెల్సుకోకపోతే ఆరోగ్య పరంగా అట్టర్ ఫ్లాప్ అవుతాము.

మన శరీరంలో దాదాపు 70 శాతం నీరు, 30 శాతం కండరాలు, ఎముకలు, నరాలు వీటి కలయిక ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మనం మన రోజులో ఎంత శాతం ఆహారం తీసుకుంటున్నాం, ఎంత శాతం నీటిని తీసుకుంటున్నాం అనేది పరిశీలించుకుంటే ఆహారం ఎక్కువ, మంచి నీరు తక్కువ తీసుకుంటున్నవారు అధికశాతం మంది ఉన్నారు. 

          మనిషి రోజులో  కనీసం మూడు లీటర్ల నీటిని అయినా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈమధ్య అందరికి నీరు తీసుకోవాల్సిన విషయం పై అవగాహన పెరిగి బాటల్స్ లెక్కపెట్టుకుని మరీ తాగేస్తున్నారు. అయితే నీరు తాగడానికి కూడా ఒక పద్దతి ఉందని, అలా తాగిన వాళ్ళకే సరైన పలితం ఉంటుందనేది చాలా మందికి తెలియదు.

అసలు నీరు ఎందుకు తాగాలి??

    రోజువారీ మనం తీసుకునే ఆహారపదార్థం లాగానే నీరు తాగుతున్నాం, మన శరీరమంతా కండరాలు, ఎముకలు, నరాలతో నిర్మితమై ఉంటే మనం తాగే నీరు వాటన్నిటినీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గాలి, ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే మలినాలు చెమట మరియు మూత్రం రూపంలో బయటకు వెళుతాయి. అవి బయటకు వెళ్ళడానికి మన శరీరంలో తగినంత నీరు ఉంటేనే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మన శరీరంలో నీటి శాతం తక్కువ ఉంటే మన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఒక యంత్రం పనిచేయడానికి దానికి ఇంధనం ఎలా అవసరమో మన శరీరానికి అలాగే ఇంధనం వంటిది నీరు. అయితే ఆ నీటిని సక్రమంగా తాగుతున్నామా?? 

నీరు తీసుకోవాల్సిన పద్దతి

మనిషి రోజులో కనీసం అంటే మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసినదే అయితే అందరూ బాటల్స్ పక్కన  పెట్టుకుని దాహమేసినా, వేయకున్నా రోజుకు టార్గెట్ ఇది అన్నట్టు తాగేస్తుంటారు. ప్రతి ఒక్కరూ చేసే తప్పు అదే. నీటిని తీసుకునే విధానం ఒకటుందని ఎవరికి తెలియదు ఎక్కువగా. ఇపుడు అదేంటో చూద్దాం.

◆ రోజువారీ తీసుకునే నీటిలో  ఉదయాన్నే తాగే నీటికి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. రాత్రి తిన్న ఆహార పదార్థం  జీర్ణమై పేగుల్లో మిలిగిన వ్యర్థం ను బయటకు పోయేలా చేసేది మనం ఉదయం తీసుకునే నీరే. ఉదయం లేచి మనం కాలకృత్యం తీర్చుకున్నాక వేడి చేసిన నీటిని పరగడుపున తాగాలి. అది కూడా కేవలం పరగడుపున దాదాపు ఒకటిన్నర లీటర్ వరకు నీళ్లను తాగాలి. దీనివల్ల మన శరీరంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాన్ని బయటకు పంపి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

◆ ఉదయం అల్పాహారం తీసుకున్న రెండు గంటల తరువాత మరియు మనం  మధ్యాహ్న భోజనం చేయడానికి దాదాపు ఒక గంట ముందు అరలీటర్ వరకు నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల మన శరీరంలో జీర్ణమవుతున్న ఆహారాన్ని కాసింత సులువుగా మార్చి వ్యర్థాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

◆ మధ్యాహ్న భోజనం ముగిసిన తరువాత సాయంత్రం అంటే దాదాపు అయిదు నుండి ఆరు గంటల సమయం మధ్యలో కనీసం లీటర్ నీటిని తీసుకోవడం ఉత్తమం. ఉదయం నుండి శరీరం లో జరిగే క్రియలు మరియు మనం చేసే శారీరక శ్రమ వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది అందుకే డీహైడ్రేషన్ కు గురి  కాకుండా సాయంత్రం దాదాపు లీటర్ నీటిని తీసుకోవడం వల్ల శరీర క్రియను ఉత్తేజం చేసినట్టు అవుతుంది.

◆ రాత్రి పూట తీసుకునే ఆహారం మితం గా ఉండటమే కాకుండా నీళ్లను కూడా మితంగానే తీసుకోవాలి. దీనివల్ల నిద్రలో మెలుకువ రావడం అనే సమస్యను అరికట్టవచ్చు.

ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగితే??

చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. అది చాలా తప్పు మనం తీసుకునే ఆహారంలోనే దాదాపు నీటి శాతం ఉంటుంది. అలాగే మనం నమిలి మింగదానికి మన లాలాజలం ఎలాగూ ఉపయోగపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగడం వల్ల నీరు ఎక్కువగా అవసరం పడదు. కానీ కొందరు ఆహారం తీసుకునేటప్పుడు నీటిని ఎక్కువగా తాగడం వల్ల  నీరు ఆహారంతో చేరి దాన్ని ద్రవపదార్థంగా మార్చి తొందరగా జీర్ణం కాకుండా చేస్తుంది. అంతేకాకుండా అందులో నుండి విడుదల అయ్యే ఆమ్లపదార్థం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి బదులుగా పులిసిపోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది.  అందువల్ల ఆహారం తీసుకునేటప్పుడు నీటిని మితంగా కొలతలో చెప్పాలంటే ఒక గ్లాస్ లోపు  తీసుకోవడం ఉత్తమం.

ద్రవపదార్థాలు అన్ని నీటి లెక్క కాదు

చాలామంది రోజులో వేడినీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతూ తాము రోజు వారి తీసుకుంటున్న నీటితో లెక్కేసుకుని మూడు లీటర్లు పూర్తి చేసాం అనుకుంటారు. అయితే  మంచినీటిలో ఉండే లవణాలు, ఎంజైములు ఇలా తేనె కలిపిన నీటిలో, మరియు పండ్ల రసాలతో ఉండదు. కాబట్టి పండ్ల రసాలు, తేనె కలిపిన నీరు లాంటి వాటిని మన రోజువారీ నీటి కొలతల్లో చేర్చకండి.

చివరగా…….

పైన చెప్పుకున్న సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో దాహమేస్తే సగం నుండి గ్లాస్ వరకు నీటిని తాగవచ్చు. లేదూ ఇంకా ఎక్కువ తీసుకుంటే శరీరంలో జరుగుతున్న జీర్ణక్రియకు ఆటంకం కలిగించినట్టు అవుతుంది. జీర్ణమవుతున్న పదార్థం కాస్త కుడితిగా మారిపోయి అది జీర్ణం కాక పులి త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీసుకు వస్తాయి.

  కాబట్టి మంచినీటిని మంచిగా తాగితేనే ఆరోగ్యం మన సొంతమవుతుంది.

Leave a Comment

error: Content is protected !!