మన శరీరం ముఖ్యంగా మూడు గుణాలతో నిండి ఉంటుంది. అవే వాత, పిత్త, కఫ దోషాలు. శరీరంలో ఉత్పత్తి అయ్యే వాయువులు కండరాల మధ్యలో కలిగించే ఇబ్బందిని చాలా మంది వాతం చేసిందని అంటూ ఉంటారు. ఇది తీసుకునే ఆహారంలో దోషం వల్ల వేళలు మారడం, శరీర తత్వాన్ని ప్రభావితం చేసే పదార్థాల వల్ల కలిగే సమస్య.
రెండవది పిత్తము. శరీరం వేడి చేయడమే పిత్తము యొక్క లక్షణం. తీసుకునే ఆహారం కానీ, వాతావరణ పరిస్థితులు శరీర తత్వానికి విరుద్ధంగా పనిచేసే పదార్థాలు తీసుకోవడం వల్ల మరియు అధిక వేడికి కారణమయ్యే పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే సమస్య ఇది.
మూడవది మనం ఇపుడు చెప్పుకోబోతున్నది కఫము. ఇది ముఖ్యంగా వాతావరణం, తీసుకునే ఆహార పదార్థాల వల్ల కలిగే సమస్య. మన శ్వాశకోశం, గొంతు నుండి శ్లేష్మం ఉత్పత్తి అయ్యి అది ఊపిరితిత్తులలో చేరి అసౌకర్యాన్ని కలుగచేస్తుంది. గొంతు గరగరగా ఉండటం. గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు అనిపించడం, శ్వాశ తీసుకోవడం లో ఇబ్బంది అనిపించడం మరియు ఊపిరితిత్తుల భాగంలో శబ్దం వచ్చినట్టు అనిపించడం లక్షణాలు ఉంటాయి. ఈ కఫము ముఖ్యంగా చల్లని వాతావరణం మరియు చల్లని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కలుగుతుంది. ఈ కఫాన్ని తరిమికొట్టే ఒక మంచి చిట్కా మీకోసం మరి చూడండి.
కఫాన్ని తరిమి కొట్టడానికి కారప్పొడి.
కావలసిన పదార్థాలు
●పిప్పళ్ళు
●పిప్పలిమూలం
●చవ్యం
●చిత్రమూలం
●శొంఠి
పై అయిదు పదార్థాలు ఆయుర్వేద దినుసులు అమ్మే అంగళ్లలో దొరుకుతాయి. వీటిని సేకరించుకొని ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మెత్తగా దంచి పొడిచేసుకుని పలుచటి వస్త్రంలో జల్లించుకోవాలి. ఇపుడు ఈ చూర్ణం చాలా మెత్తగా ఉంటుంది. దీన్ని టైట్ కంటైనర్ లో నిల్వచేసుకోవాలి.
◆ఒక చెంచా పొడిని ఒక పెద్ద గ్లాసు( సుమారు 250మిల్లీలు) నీటిలో వేసి బాగా కలిపి స్టవ్ మీద ఉంచాలి. ఆ నీరు సుమారు పావు గ్లాసు మిగిలేవరకు మరగబెట్టాలి. కాసింత చిక్కటి కషాయం తయారవుతుంది. దీనిని వడగట్టి తాగాలి. ఇలా చేస్తే కఫము చాలా వేగంగా తగ్గుతుంది. కావాలని అనుకుంటే ఇందులో కొద్దిగా తీపిని కలుపుకోవచ్చు.
◆అంతే కాదు కఫము ఎక్కువగా ఉన్నపుడు పిప్పళ్ళు తీసుకుని నేతిలో వేయించి, మెత్తని పొడి చేసి తేనెలో కలిపి ఒక అరచెంచా మోతాదులో తీసుకుంటే కఫము తగ్గుతుంది.
◆కఫానికి మరొక మంచి చిట్కా చిత్రమూలం, కరక్కాయల పై బెరడు, ఉసిరికాయల బెరడు, పిప్పళ్ళు వీటిని సేకరించి మెత్తగా దంచి పొడిచేసుకుని నిల్వచేసుకోవాలి. దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే క్రమంగా కఫము తగ్గిపోతుంది.
చివరగా…..
కఫము అనేది ఉత్పన్నమైతే కలిగే ఇబ్బందిని పైన చెప్పుకున్న పద్దతులు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు అయితే అసలు సమస్య రాకుండా చూసుకుంటే సమస్యను రాకుండా చేసుకోవచ్చు కాబట్టి అతి చల్లని పదార్థాలకు, అతి చల్లని వాతావరణానికి దొకరంగా ఉండటం శ్రేయస్కరం.