చాలామందిని వేధించే సమస్య చుండ్రు, చలికాలంలో బాక్టీరియా, ఫంగస్ లాంటివి ఎక్కువగా అక్టీవ్ అవుతాయి. అందుకే మాములు సమయంలో కొద్దిగా ఉన్న చుండ్రు చలికాలం రాగానే వేధింపులు మొదలుపెడుతుంది. చుండ్రు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ అది తగ్గక నిరాశలో, మానసిక వత్తిడి కి కూడా లోనవుతుంటారు. అయితే కాస్త ఓపికగా మరింత ఆందోళన తగ్గించి మనం చెప్పుకునే చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా చుండ్రుకు ఇలా చెక్ పెట్టేయచ్చు. ఆ చిట్కాలు ఏంటో మీకోసం మరి చదివేయండి, పాటించేయండి, సమస్యను తరిమేయండి.
◆చలికాలంలో సాధారణంగా నీరు తక్కువ తాగుతారు, కాలం ఏదైనా మనిషి రోజు తాగే నీటి పరిమాణం కనీసం మూడు నుండి ఐదు లీటర్ల ఉండాలనేది నిపుణులు, మరియు ఆరోగ్య సూచనలు ఇచ్చే పెద్దల అభిప్రాయం. అయితే చలికాలం పేరుతో నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల చర్మము పొడిబారడం జరుగుతుంది. అదే మన తల మాడుకు కూడా వర్తిస్తుంది. తగినంత తేమ లేకపోవడం వల్ల తలలో పొడిబారిన మాడు మెల్లిగా పొట్టులాగా తయారయ్యి అది క్రమంగా పెద్దగవుతూ చుండ్రు రూపం దాల్చి విసిగించే స్థాయికి వస్తుంది. కాబట్టి మొదటగా మూడు నుండి ఐదు లీటర్ల నీరు తాగడం మొదట తప్పనిసరి చేసుకోవాలి.
◆జుట్టుకు ఎప్పటికప్పుడు నూనె పెడుతూ ఉండాలి. రెండు రోజులకు ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుని తలంటు పొసుకోవడం వల్ల చుండ్రు తీవ్రత తగ్గుతుంది.
◆చుండ్రు నివారణకు హెయిర్ పాక్ ల మీద చాలా మంది ఆధారపడుతుంటారు. అయితే హెయిర్ పాక్ వల్ల చల్లదనం కుదుళ్లలోనికి వెళ్లి తలలో నరాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ కాలంలో హెయిర్ పాక్ లకు వీలైనంత దూరం ఉండటం మంచిది.
◆తప్పనిసరిగా చుండ్రు భరించలేక హెయిర్ పాక్ వేసుకోవాలని అనుకుంటే నిమ్మరసం, పెరుగు హెయిర్ పాక్ లేక, వేపాకులను బాగా రుబ్బి దాన్ని తలకు పట్టించడం వంటి పద్ధతులు ఫాలో అవ్వడం మంచిది అది కూడా కేవలం అరగంట కు మించి హెయిర్ పాక్ లను ఉంచుకోకుండా తొందరగా కడిగెయ్యాలి. ఎక్కువ సేపు ఉంచుకుంటే జలుబు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
◆పదిరోజులకు ఒకసారి లేదా, వారానికి ఒకసారి వేపనూనె ను తలకు మసాజ్ చేసుకుని గంట తరువాత తల స్నానం చేస్తుంటే చుండ్రు తొందరగా తగ్గిపోవడమే కాదు జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది కూడా.
చుండ్రు పెరగకుండా ఉండటానికి జాగ్రత్తలు
◆తలంటు పోసుకున్నాక జుట్టు తడిగా ఉన్నపుడు జడ వేసుకోవడం, లేదా ముడి వేయడం వంటివి చేయకూడదు, కుదుళ్ళు బాగా ఆరనివ్వాలి. లేకపోతే తడికి బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అదే చుండ్రును విజృంభించేలా చేస్తుంది.
◆వర్షంలో తడిసినట్టైతే ఇంటికి చేరాక మళ్ళీ తలస్నానం చేసి తలను బాగా ఆరబెట్టుకోవాలి.
◆ఇతరులు వాడిన తువ్వాలును, దువ్వెనను ఉపయోగించకండి మీకంటూ ప్రత్యేకంగా ఒక తువ్వాలు, దువ్వెన ఉంచుకోవడం మంచిది.
◆చుండ్రు ఉన్నపుడు ఎక్కువగా దురద పెడుతోందని పదే పదే గోకడం, రుద్దడం చేయకూడదుకు. దీనివల్ల తలలో పుండ్లు అయ్యే అవకాశం ఎక్కువ.
చివరగా…
చలికాలంలో విజృంభించే చుండ్రును పై చెప్పుకున్న చిట్కాలతో సులువుగా జయించవచ్చు. మొదట ఆందోళన తగ్గించుకుంటే అన్ని సులువే అనే విషయం మరవకండి.