తాంబూలం సేవిస్తే ఆరోగ్యపరంగా చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ఔషదాన్ని ఔషధంగానే తీసుకోవాలి. అంటే ఔషదాన్ని ఎవరైనా సూక్ష్మ పరిమాణంలోనే తీసుకుంటారు, అదే విధంగా తాంబూలం తీసుకోవాలనేది ఆయుర్వేద నిపుణుల సలహా. తమలపాకుల్ని మేకల్లా తింటూ ఉంటే అది వికటించి అనారోగ్యాన్ని కలుగచేసే కారకం అవుతుంది. “భావప్రకాశ” అనే వైద్య గ్రంథంలో తాంబూలం సేవిస్తే శరీరానికి కలిగే ప్రయోజనాలు, మరియు ప్రభావాలను గూర్చి వివరించారు.
◆ తాంబూలం తీక్షణ గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇందులో రసాయనాలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తాంబూల సేవనం ఎప్పటికి అతి కాకూడదు అనేది ఇందుకే.
◆ తమలపాకులు వగరు, కారం రుచుల్ని కలిగి బాగా వేడి చేస్తాయి. కాబట్టి తమలపాకులు ఎక్కువగా తీసుకోకూడదు.
◆ సరగుణం అంటే త్వరగా శరీరం అంతటా వ్యాపించే గుణం తమలపాకుకు ఉంది. అందుకని తమలపాకుతోపాటు ఏదైనా ఔషదాన్ని కలిపి తీసుకుంటే ఈ ఆకులు కేటలిస్ట్ లాగా పనిచేసి మనం తీసుకునే ఔషదాన్ని పనిచేయవలసిన స్థానానికి తొందరగా తీసుకువెళుతుంది.
◆ తమలపాకులు కామవృద్ధిని కలిగిస్తాయి. అందుకే పడకగదిలో తాంబూలాన్ని సేవించాలని ఒకప్పటి పెద్దలు చెప్పేవారు. లైంగిక శక్తిని, ఆసక్తి పెంపొందించడంలో తమలపాకులు చురుగ్గా పనిచేస్తాయి.
◆ తాంబూలానికి వశ్యం అనే గుణం ఉంది. అంటే వీటిని తినడం మొదలుపెట్టిన చాలా కొద్ది సమయంలో దీనికి బానిస అయిపోతారు. ఈ వశ్యాన్ని మనం ఎడిక్ట్ అవ్వడం లేదా ఎడిక్షన్ అని పిలుచుకుంటాము. ఈ గుణం కేవలం తమలపాకు కు మాత్రమే కాదు తాంబూలంలో వాడే వక్కపొడికి కూడా “మోహనం” అంటే పదే పదే తీసుకోవాలనిపించడం.
◆ తాంబూల సేవనం శ్లేష్మ రోగాలను పోగొడుతుంది.
◆ నోటి దుర్వాసనను పోగొట్టి, మౌత్ ఫ్రెషనర్ లా తోడ్పడుతుంది. ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నపుడు నోటిని వెంటాడే ఆ వాసనలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
◆ శరీర బడలికని, అలసటను, శ్రమని పోగొట్టి ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
◆ పరిమితంగా తింటే తమలపాకులు దంతాలను కాంతివంతం చేస్తాయి. కానీ తాంబూలం అతిగా తీసుకుంటే పళ్ళు గారపట్టి, పళ్లమద్యన ఎరుపు ఏర్పడి చాలా అసహ్యంగా తయారవుతాయి.
◆ దవడలు, పళ్ల మధ్య ఉండే పాచిని తొలగిస్తాయి. నాలుకను శుద్ధి చేస్తాయి. నోటిని నిర్మలం చేసి గొంతువ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
◆ ఆకుకూరలకు ఉండే ప్రయోజనాలన్ని తమలపాకుకు కూడా ఉన్నాయి. కానీ కఫ దోషాన్ని పెంచుతాయి. కష్టంగా అరుగుతాయి. కొద్దిగా ముదిరిన ఆకులు మంచిని చేస్తాయి.
◆ తమలపాకు చివర భాగాన ఆయుష్షు ఉంటుంది. మొదటి భాగం ( తొడిమ దగ్గర) లో కీర్తి, ఈనెల భాగంలో లక్ష్మీ, సంపద ఉంటాయి. కాబట్టి తొడిమని చివరిని ఈనెలని తీసేసి తాంబూలం వేసుకోవాలి. లేకపోతే ఆయుద్దు, కీర్తి, ఐశ్వర్యం నశిస్తాయి. ఈనెలని తింటే బుద్ధి నశిస్తుంది.
◆ తాంబూలాన్ని వేసుకున్నపుడు నమిళితే వచ్చే రసంలో మొదటి మరియు రెండవ సారి వచ్చే రసాలు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. అందుకే మొదటి రెండు సార్లు ఉమ్మివేస్తారు. మూడవసారి బాగా నమిలినపుడు వచ్చే రసంలో శరీరానికి గొప్ప ఆరోగ్యం చేకూర్చే ప్రయోజనాలు ఉంటాయి.
చివరగా…….
అతి అనర్థకమని, మితం అద్బుతమనే విషయం అందరికి తెల్సినట్టే తమలపాకు విషయంలో కూడా పైన చెప్పుకున్న వాటైని దృష్టిలో ఉంచుకుని అపుడపుడు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో ఉత్తమంగా ఉంకంటుందని వేరే చెప్పక్కర్లేదుగా……