టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే వంటకం బాగుంటే కుమ్మేస్తాము. ఇంకా మనకు బాగా నచ్చిన కూర ఏదైనా ఉంటే అపుడు తినే లెవల్ ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే ఇలా ఎక్కువ తినేసాక కడుపు భారంతో బాధపడటం, తిన్న పదార్థం అరగకపోవడం ఇంకా త్రేన్పులు, పైత్యం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కేవలం భోజనం విషయమే కాదు ఎన్నో రకాల పళ్ళు, ఆహారపదార్థాలు కూడా ఇబ్బంది పెట్టేస్తాయి. అయితే ఇలా అతిగా తిన్నపుడు కలిగే ఇబ్బందులను సరిచేయడానికి కొన్ని ఆహారపదార్థాలు ఉంటాయి.
ఏ పదార్థం తినడం వల్ల ఏ ఇబ్బంది కలిగిందో, ఆ ఇబ్బందిని నివారించుకోవడానికి ఏ పదార్థం తింటే సమస్య తీరుతుందో చదవండి మరి.
◆ కొబ్బరి అందరికి ఇష్టమైన పదార్థం. కొబ్బరిని అతిగా తింటే పైత్యం చేసి అజీర్తి చేస్తుంది. అయితే కొబ్బరి వల్ల కలిగే ఈ ఇబ్బందులు తగ్గాలంటే మరమరాలను తింటే సమస్య తగ్గుతుంది.
◆ఫలాల రాజు మామిడి అంటే ఇష్టపడని వారు ఉండరు. తియ్యని మధురమైన రుచితో మైమరపించే మామిడి దొరికినపుడు ఇష్టం తో ఎక్కువగా తినేస్తుంటాం. అయితే తరువాతనే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది గుర్తు చేసుకుంటూ ముందే భయపడాల్సిన అవసరం లేదు. మామిడి పళ్ళను ఎక్కువగా తింటున్నపుడు మధ్యమధ్యలో గోరు వెచ్చని పాలను అర గ్లాసు నుండి గ్లాసుడు తాగుతూ ఉండాలి. దీనివల్ల ఎలాంటి సమస్య ఎదురవ్వదు.
◆ అరటిపళ్ళు తినేవాళ్ళు ఒకటి రెండు పళ్ళు తింటే సమస్య ఉండదు కానీ ఎక్కువ మోతాదులో తింటే వాతం మరియు, అజీర్తి చేస్తుంది. ఈ సమస్యను తగ్గించే చిట్కా నెయ్యి, పంచదార రెండు కలిపి తీసుకోవడం. దీనివల్ల కడుపులో ప్రకోపించే వాతం విరిగిపోతుంది.
◆మాంసాహారం వల్ల కలిగే అజీర్తికి కాంజికం చక్కటి విరుగుడుగా పనిచేస్తుంది. అన్నాన్ని నీళ్లలో నానబెట్టి, పులిసిన తరువాత వడగట్టాలి. ఇలా వడగట్టిన తరువాత వచ్చే నీటిని కాంజికం అంటారు.
◆ నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లటి సిట్రస్ పండ్లు అధికంగా తీసుకునేటప్పుడు చిన్న ముక్క బెల్లం తింటుంటే సమస్య ఉండదు
◆ ఉలవలు, ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు ఎక్కువగా తీసుకున్నప్పుడు అజీర్తి సమస్య ఏర్పడుతుంది. అయితే వీటిని తినేటప్పుడు నూనె కానీ, నెయ్యి కానీ జోడించుకుంటే అజీర్తి ఆమడ దూరంలో ఉంటుంది.
◆ బాదం పప్పు అతిగా తింటే పైత్యం కలుగుతుంది. దీనికి విరుగుడుగా ఒకటి లేదా రెండు లవంగాలు నోట్లో వేసుకుని మెల్లిగా చప్పరిస్తూ, నములుతూ రసాన్ని మింగుతుండాలి.
◆ మినప్పప్పు ఎంత బలమైనా ఎక్కువగా తింటే అరగదు. ముఖ్యంగా మినపసున్ని ఉండలు ఎక్కువగా తిన్నపుడు మజ్జిగ బాగా తీసుకుంటే సమస్య ఉండదు.
◆ కాకరకాయ కూడా ఎక్కువ తింటే పైత్యం చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవాళ్లు కాకరకాయ ఎక్కువ తీసుకోవాలంటూ ఎక్కువ తింటూ ఉంటారు. వారికి సమస్య రాకూడదు అంటే కాకరకాయ ముక్కలకు నిమ్మరసం బాగా పట్టేలా చేసి 10 నిమిషాల తరువాత బాగ పిండేసి వాటిని వండుకోవాలి.
◆ శనగలు, శనగపిండి, శనగపప్పు తో వండినవి ఎక్కువగా తిన్నపుడు ముల్లంగి రసం కొద్దిగా తాగితే అజీర్తి ఉండదు.
◆ పెసరట్టు, పెసర పచ్చడి, పెసలు వంటివి అతిగా తిన్నపుడు అన్నంలో కాసింత ఉసిరికాయ తొక్కుడు పచ్చడి వేసుకుని తింటే సమస్య రాదు
◆ కందకూర పులుసులో బెల్లం కలుపుకుని తింటే ఎక్కువ తిన్నా దానివల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అలాగే మజ్జిగలో సైందవ లవణం కలిపి తాగడం వల్ల జలుబు రాదు మరియు కొందరికి మజ్జిగ వంటకపోవడం లాంటి సమస్య ఎదురు కాదు.
◆ చెరకు రసం అందరికి ఇష్టమైంది అయితే అతిగా తాగడం ఆరోగ్యానికి అనర్థకమే. ఒకోసారి ఆగలేక తాగలనిపిస్తుంది అపుడు చెరకు రసంలో అల్లం కలుపుకుని తాగితే సమస్య రాకుండా ఉండటమే కాదు రుచి ఇనుమడిస్తుంది కూడా.
చివరగా……
అతి అనర్థకమనే విషయం ఆహారంకు కూడా వర్తిస్తుంది. అందుకే అతిగా తినే పదార్థాలకు పైన చెప్పుకున్నవి వాడితే సమస్యను దూరంగా ఉంచవచ్చు.