వంట చేసే సమయాలలో కాగుతున్న నూనెవలన, ఒక్కొక్కసారి మరుగుతున్న నీళ్ల వలన, వేడిగా ఉన్న వంట పాత్రలు మొదలైనవి చేయి జారడం లేదా వంటివి జరగడం వలన ఒకోసారి గాయాలు ఏర్పడటం మరొకసారి ఎక్కువగా కాలడం వంటివి జరుగుతాయి. ఒళ్ళు కాలినపుడు ఉన్న బాధకంటే అది క్రమంగా కాలంతో పాటు పెట్టె ఇబ్బందే ఎక్కువగా ఉంటుంది. ఇలా కాలిన గాయాల విషయంలో అశ్రద్ధ చేస్తే వాటి ప్రభావం ఎక్కువై సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రతో భయం నాస్తి! అన్నట్టు. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. అయితే ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలినపుడు చేయకూడని పనులు, మరియు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి అవేంటో తెలుసుకుంటే మనకు సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం సులువు అవుతుంది.
ఒళ్ళు కాలినపుడు చేయకూడని పనులు
◆ ఒళ్ళు కొద్దిగా కానీ ఎక్కువగా కానీ కాలినపుడు చాలామంది వెన్నపూస, బేకింగ్ సోడా లాంటివి కాలిన గాయాల మీద రాస్తుంటారు. ఈ పని చేయకూడదు.
◆ కాలిన వెంటనే ఆయింట్మెంట్స్ కానీ, లోషన్ లు కానీ, నూనెలు పూయడం కానీ చేయకూడదు.
◆ కాలినందువలన ఏర్పడిన బొబ్బలను చిదమడం, పొక్కులను పొరపాటున కూడా గిల్లడం వంటివి చేయకూడదు.
◆ ఒళ్ళు కాలే సమయంలో ఏదైనా గుడ్డ ఒంటికి అతుక్కుని పోయినప్పుడు దాన్ని బలవంతంగా లాగాలని చూడకూడదు. ఇలా చేయడం వల్ల గాయం పెద్దది అవుతుంది.
ఒళ్ళు కాలినపుడు చేయవలసిన పనులు
◆ చల్లని నీళ్లతో గాయాన్ని కడగాలి, ధారగా పడుతున్న నీటి కింద కాలిన భాగాన్ని ఉంచాలి.
◆ కాలిన శరీరం మీద బట్టలు కప్పవలసి వస్తే, ఆ బట్టలను చల్లని నీళ్లలో తడిపి గాయం చుట్టూ చుట్టాలి.
◆ పొరపాటున కూడా గాయం మీద గట్టిగా రుద్దకుడదు, గాయమయిన ప్రాంతంలో ఏవైనా ఆభరణాలు ఉంటే వాటిని తీసివేయాలి.
◆ కట్టు కట్టేటపుడు మెత్తగా గాయానికి అతుక్కోకుండా ఉండే బ్యాండేజ్ గుడ్డ ఉపయోగించాలి.
◆ ఎండవలన కానీ, గాలి వలన కానీ, ఏవైనా రసాయనాల వలన కానీ గాయాలు అయినపుడు చల్లని నీళ్లతో గాయాలను కడగడం ఉత్తమం.
◆ పెద్ద గాయాలను నిర్లక్ష్యం చేయకుండా అంబులెన్స్ సర్వీస్ సాయంతో హాస్పిటల్ వెళ్లి చికిత్స తీసుకోవాలి.
◆మంటలు వల్ల ప్రమాదాలు జరిగినపుడు అవాసురమైన ప్రథమచికిత్స చేసి ప్రాణాపాయం తప్పించవచ్చు.
చివరగా……
ఒళ్ళు కాలినపుడు గాలి వెలుతురు బాగా ఉన్న ప్రాంతంలో ఉండాలి, ఎండలోకి వెళ్లకూడదు, మరియు అతి చల్లని ప్రదేశాలకు దూరం ఉండాలి. గాయాలు మానిపోయే దశలో దురద పెట్టడం వంటివి జరుగుతాయి. అటువంటపుడు కొబ్బరి నూనె రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పైన చెప్పుకున్నవన్నీ పాటిస్తే సమస్య ను సులువుగానే ఎదుర్కోవచ్చు.