చాలా మంది మహిళలు సాధారణంగా గర్భం దాల్చిన తరువాత స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్నారు. అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏమిటి?? ఒకసారి చూద్దాం.
ఆకస్మిక బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ముఖ్యంగా బరువు పెరిగినపుడు కడుపు, తొడలు వంటి ప్రదేశాల్లోనే ముఖ్యంగా కొవ్వులు పెరగడం, తిరిగి బరువు తగ్గినపుడు ఆ ప్రదేశాల్లో బరువు వల్ల సాగిన చర్మం తిరిగి వదులు అవుతుంది. ఇలా వదులు అయినపుడు చర్మం మీద తెల్లని మరియు ఎర్రని చారలు ఏర్పడతాయి. వీటినే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. వీటి వల్ల ప్రమాదం మరియు నష్టం అంటూ ఏమి లేకపోయినా మహిళల్లో కొన్ని రకాల దుస్తులు ధరించడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇదొక మానసిక ఒత్తిడికి దారితీసే అంశం. అందంగా కనిపించాలనే తపనతో ఇదొక భాగం.
స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడానికి తరచూ వివిధ రకాల పద్ధతులు ఆశ్రయిస్తారు. ఈ స్ట్రెచ్ మార్క్స్ నుండి బయటపడటానికి, కొన్ని గృహ చిట్కాలు ఉపయోగించుకోవచ్చు. వీటిని తగ్గించడానికి మరియు వాటిని పూర్తిగా తొలగించుకోడానికి సహాయపడే వివిధ సహజ ఉత్పత్తులు ఉన్నాయి.
అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలి చదవండి మరి
కలబంద
కలబంద అనేది మనందరికీ తెలిసినదే, ఇది చర్మ కణజాలాన్ని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కలబంద నుండి తాజా జెల్ తీసుకొని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా రోజూ చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల ఫలితాన్ని మీరే గమనించవచ్చు.
దోసకాయ మరియు నిమ్మరసం
నిమ్మరసం యొక్క సహజ ఆమ్లత్వం మచ్చలను నయం చేయడానికి మరియు తగ్గించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ రసం మరియు దోసకాయ రసాన్ని సమాన భాగాలలో కలిపి ప్రభావిత ప్రాంతంలో మెల్లిగా అప్లై చేస్తూ మర్దనా చేయాలి. దీన్ని దాదాపు 10 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. తరువాత వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
బాదం మరియు కొబ్బరి నూనె
స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి బాదం మరియు కొబ్బరి నూనెను వాడచ్చు. ఈ రెండింటిని సమాన పరిమాణంలో తీసుకుని కలపాలి. దీన్ని క్రమం తప్పకుండా చర్మంపై మసాజ్ చేయాలి. ఇది చాలా సహజమైన పద్దతి దీని ద్వారా ఎలాంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తుంది.
నేరేడు పండు లేపనం మరియు ఆయిల్
నేరేడు గొప్ప ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి, ఇవి స్ట్రెచ్ మార్క్స్ ను నయం చేసేటప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. 2-3 నేరేడు పళ్ళు తీసుకొని వాటి నుండి విత్తనాలను తీసేయాలి. పండును పేస్ట్ గా చేసి ప్రభావిత ప్రాంతాల్లో లేపనం వేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచిన తరువాత వెచ్చని నీటిని ఉపయోగించి కడిగేసుకోవాలి. ఇంతేకాదు స్వచ్ఛమైన నేరేడు పండు నూనెలో చర్మ పునరుజ్జీవనం చేసే లక్షణాలు ఉంటాయి. అందువల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంలో ఇది సమర్థవంతంగా సహాయపడుతుంది.
కాస్టర్ ఆయిల్( ఆముదం)
స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతం సాధారణంగా పొడిగా కళావిహీనంగా ఉంటుంది. దీనికి పోషణ మరియు తేమ అవసరం. కాస్టర్ ఆయిల్ చర్మంపై మసాజ్ చేసినప్పుడు గుర్తులను నెమ్మదిగా నయం చేయడానికి సహాయపడుతుంది.
సాగిన చర్మాన్ని బిగుతుగా చేయగల ఒక చిట్కా మీకోసం.
మొహం మీద మొటిమలో, మచ్చలో వస్తే ఫేస్ పాక్ వేసుకున్నట్టే సాగిన చర్మాన్ని పూర్వ రూపానికి తీసుకురావడానికి ఈ పాక్ ను ప్రయత్నించవచ్చు

కావలసిన పదార్థాలు:
2 గుడ్డు సొనలు
ఒక నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఓట్స్ పౌడర్
2 స్పూన్ల బాదం పేస్ట్
పాక్ ను కలపడానికి తగినంత పాలు
తయారు విధానం:
పైన తెలిపిన అన్ని పదార్ధాలను బాగా కలపి స్ట్రెచ్ మార్కులపై లేపనంగా వేయాలి. పూర్తిగా ఆరిపోయాక చల్లని నీటిని కొద్దిగా తీసుకొని సున్నితంగా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. దీన్ని పైన చెప్పుకున్న టిప్స్ పాటించేటపుడు చేయకూడదు. దీనికోసం ఒకరోజును కేటాయించండి. తప్పకుండా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు.
చివరగా……
పైన చెప్పుకున్న టిప్స్ మరియు పాక్ ఎన్ని వాడినా ముఖ్యంగా ఈ స్ట్రెచ్ మార్క్ సమస్యను అధిగమించడానికి కావలసినది ఓపిక. మొదలు పెట్టగానే ఫలితం రావాలంటే కాదు. కాబట్టి ఓపికగా దీన్ని అధిగమించాలి సుమా….