గోరింటాకు అరిచేతులకు, పాదాలకూ రంగునిచ్చేందుకోసం ఆడవాళ్ళు వాడుకునే సౌందర్య సాధనం మాత్రమేనని చాలామందిలో వున్న అభిప్రాయం. అంతకన్నా ఎక్కువగా దాని ఉపయోగాలు పెద్దగా తెలియకపోవడంతో ఫ్రీగా దొరికే ఈ అద్భుత వనమూలికని మనం ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గోరింటాకు మొక్కలో ఆకులు, వేళ్ళు, బెరడు, పూలు, గింజలు అన్నీ ఆరోగ్యాన్ని కల్గించేవే!
◆గోరింటాకుని మెత్తగా నూరి నీళ్ళలో వేసి బాగా ఉడికించి చల్లార్చి ఆ నీటితో పండ్లని కడిగితే పుండ్లు త్వరగా మాడుతాయి. కాలిన చోట పూస్తే చల్లగా వుంటుంది. ఆకుని నూరి కడితే పుండ్లు తగ్గుతాయి.
◆ఆకులను నూరి ఉడికించి వడగట్టిన నీరుని బాగా పుక్కిలిస్తే నోటిపూత, టాన్సిల్ వాపు, పళ్ళు చిగుళ్ళలోంచి నెత్తురు కారడం తగ్గుతాయి.
◆ గోరింటాకుని నూరి నూనెలో వేసి బాగా ఉడికించి చల్లార్చి ఆ నూనెని పుళ్ళు మీద గానీ, కాలిన చోటగానీ, గాయాల మీదగానీ కొద్దిగా రాస్తే త్వరగా మాడుదలకొస్తాయి.
◆చలి జ్వరంలో గోరింటాకు లేత ఇగుళ్ళను నూరి నీళ్ళలో కలిపి త్రాగితే జ్వరం తీవ్రత తగ్గి త్వరగా కంట్రోల్ లోకి వస్తుంది.
◆గోరింటాకు గింజలు మెదడు జబ్బులతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయి. ఫిట్స్ జబ్బు, మూర్ఛలు, హిస్టీరియా నరాల బలహీనతలు ఉన్న వారికి రోజూ గోరింటాకు గింజలు ఇస్తే ఈ జబ్బుకు వాడుతున్న మందులు త్వరగా పనిచేసి, వ్యాధిని కంట్రోల్ లోకి తీసుకువస్తాయి. గోరింటాకు గింజల్ని ఎండించి బాగా మెత్తగా నూరి ఓ సీసాలో భద్రపరచుకోవాలి. వ్యాధి తీవ్రతని బట్టి 1/2 చెంచా నుంచి 1 చెంచా మోతాదులో రెండు పూటలా తేనెతో కలిపి, తినిపిస్తే ఈ వ్యాధుల్లో ఎంతో మేలు జరుగుతుంది.
◆గోరింటాకు పువ్వులు మంచి నిద్రను చేకూరుస్తాయి. వీటిని ఎండించి దంచి రాత్రిపూట 1/2 చెంచా పొడిని తేనెతో తీసుకుని పాలు త్రాగి పడుకుంటే కమ్మని నిద్ర వస్తుంది. గోరింట పువ్వులతో దిండు తయారుచేసుకొని తలకింద పెట్టుకుని పడుకున్నా మంచి నిద్రపడ్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
◆ గోరింటాకుని మెత్తగా నూరి చిక్కటి రసం తీసి ఆ రసంలో కొద్దిగా స్పిరిట్ కలిపి అరికాళ్ళకు రాసుకుంటే పాదాల మంటలు నెమ్మదిస్తాయి.
◆గోరింటాకు చెట్టు బెరడుని ఎండబెట్టి, దంచి పావుచెంచా పొడిని రెండుపూటలా తేనెతో తీసుకోవాలి. ఎలర్జీ వలన చర్మంపైన కన్పించే దురదలు, దద్దుర్లు, నల్లమచ్చలు, తెల్లమచ్చలు వంటి వ్యాధుల్లో ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడ్తుంది.
◆చెట్టు బెరడు, ఆకులు తీసుకుని ఎండించి మెత్తగా నూరి చర్మానికి నలుగు పెట్టుకొంటే చర్మ వ్యాధులన్నింటికీ మంచిది.
చివరగా….
చేతులకు, తలకు ఉపయోగించి అందాన్ని మాత్రమే పెంచుకోవడం కాదు, పైన చెప్పుకున్నట్టు వాడితే ఆరోగ్యం కూడా అందంగా పండినట్టే. అందుకే మరి అందరి ఇంటా ఉండాలి గోరింట చెట్టు.