ఈమధ్యకాలంలో అందరిని బాధిస్తున్న సమస్య జుట్టురాలిపోవడం. విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాలతో వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శారీరక ఒత్తిడులు లేదా అనారోగ్యం కూడా జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. ఇక మహిళల విషయానికి వస్తే వారిలో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది.. మరికొందరిలో ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇంకొందరిలో హార్మోన్ల లోపం జుట్టు రాలడానికి కారణమవుతుంది.
మహిళల్లోనూ బట్టతల వస్తుందన్నది కాస్త బాధపెట్టేవిషయం. దీన్ని ‘ప్యాటర్న్ హెయిర్‌లాస్’ అంటారు. ఇలాంటి వారిలో పాపిట క్రమక్రమంగా వెడల్పుగా అవుతుండటం కనిపిస్తుంది. దీంతో మహిళల్లో బట్టతల వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు.
జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి చాలా మంది తలకు హెయిర్ పాక్ లు, నూనెలు తయారు చేసి పెడుతుంటారు. అయితే సమస్య శరీరంలో కూడా ఉన్నపుడు పైపైన ఎన్ని ప్రయోగాలు చేసినా వ్యర్థమే అందుకే ఆహార జాగ్రత్తలతో పాటు వాటిని అనుసరిస్తేనే చక్కని పలితం పొందవచ్చు.
ఆహార లో మార్పులు
యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, తాజా పండ్లు తీసుకోవాలి.

కొబ్బరి నూనెతో….
కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాయాలి. ఆ తర్వాత మునివేళ్లతో తలను బాగా మర్దనా చేయాలి. దీనివల్ల వెంటుకల కుదుళ్లలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి.

ఉల్లితో మ్యాజిక్
ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. ఉల్లిపాయను జ్యూస్‌లా చేసి తలకు పట్టించాలి. మునివేళ్లతో తల మొత్తం మర్దనా చేయాలి. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా వల్ల తలలో ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. అంతేకాదు తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే గుణం ఉల్లిపాయకు ఉంది. పలుచబడిన జుట్టును మందంగా ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.

బీట్రూట్…. మంచి టానిక్
సాధారణంగా రక్తహీనత కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. అందుకే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం కావలసినంత ఉండాలి. శరీరంలో ఏ సమస్యనైనా తీర్చే సామర్థ్యం బీట్‌రూట్‌కు ఉంది. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రక్తహీనతను అరికట్టవచ్చు. తద్వారా జుట్టురాలే సమస్యను కూడా నివారించవచ్చు.

అద్భుతమైన అమృతఫలం……. ఉసిరి
విటమిన్-సి లోపం వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఉరిసికాయ లేహ్యం, ఉసిరి పొడిని కలకండతో కలిపి చూర్ణం చేసుకుని రోజూ కొద్దిగా చప్పరించి తినడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. అలాగే ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో రిచ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి. ఇవి చుండ్రు, తల మంటను తగ్గిస్తాయి. వెంట్రుకల మొదళ్లు బలోపేతం అవుతాయి.

తరతరాల ఔషధం… వేప
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతే కాదు వేప నూనెను వారం కు ఒకసారి జుట్టుకు పెట్టుకుని బాగా మర్దనా చేసుకుని తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడం మాత్రమే కాకుండా తలలో కురుపులు, చుండ్రు, పేలు వంటి సమస్యలు పోయి జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది.
చివరగా…..
జుట్టు రాలే సమస్యను అతిగా ఆలోచించడం వల్ల జుట్టు మరింత రాలిపోతుందన్నది తప్పక నమ్మాల్సిన నిజం. అందుకే పైన చెప్పుకున్న వాటిని మనసుతో నమ్మి ఆచరించడం వల్ల సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు.