జుట్టు పలుచగా అయిపోతుంటే మనసంతా దిగులు కమ్ముకుంటుంది. అలాంటప్పుడు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడిన ఫలితం లేకపోతే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ వాడి చూడండి. దీనిని తలకు వాడడం వలన జుట్టు సమస్యలు తగ్గి జుట్టు తిరిగి ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఈ నూనె తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కేవలం మూడు మాత్రమే. ఆ పదార్థాలు వాడి కరివేపాకు నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను తీసుకోవాలి. ఇవి ఇంట్లో పెరిగిన చెట్టువైతే చాలా మంచిది. బయట నుంచి తెచ్చినవి అయితే ఒక లీటర్ నీటిలో రెండు చెంచాల పసుపు వేసి కరివేపాకు రెమ్మలు అందులో పది నిమిషాల పాటు నాన బెట్టండి. అలా చేయడం వలన కరివేపాకు పైన పేరుకున్న కెమికల్స్ బయటకు పోతాయి. తరువాత ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, మెంతులను మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్పై నూనె పెట్టి అందులో మిక్సీ పట్టుకున్న కరివేపాకు, మెంతుల పొడి వేసుకోవాలి. నూనెను చిన్న మంటపై ఉంచి మరగబెట్టాలి. నూనె బాగా మరిగి పచ్చ రంగులోకి మారిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. నూనె చల్లారిన తరువాత వడకట్టు సహాయంతో వడకట్టి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. గాజు పాత్రలో రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. రెండు నెలల తరువాత మళ్లీ తాజాగా చేసుకొని వాడుకోవచ్చు.
ఈ నూనెను తలకు ఫింగర్ టిప్స్ తో అప్లై చేసుకొని నాలుగు గంటల తర్వాత తలస్నానం చేయాలి. కుంకుడు కాయలతో లేదా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి నూనెను తలకు అప్లై చేయడం కరివేపాకు లోని ఔషధ గుణాలు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేస్తాయి. మెంతులులోని గుణాలు జుట్టు సమస్యలు అయినా చుండ్రు, దురదను తగ్గించి జుట్టును మృదువుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఈ నూనె వలన జుట్టు సమస్యలు తగ్గి అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.