నల్లమందు ఒక డ్రగ్. దీని ప్రభావం ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. ఈ మత్తుమందుకు బానిసై ఎందరో ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే రోజువారీ జీవితంలో మునఁ తీసుకునే ఆహారం ద్వారా మనకు తెలియకుండానే నల్లమందును తీసుకునేస్తున్నాం అనే విషయం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. కానీ ఇదే నిజం. అసలు నల్లమందు మన ఆహారంలో ఎలా వెళ్తోంది ఏమిటి?? తప్పక తెలుసుకోవాల్సిందే మరి!!
రోజువారీ వండే కూరలు, పాయసాలు, స్వీట్లు మొదలైన వాటిలో తప్పక ఉపయోగించేవి గసగసాలు. అయితే వీటిని ఎక్కువగా వాడుతుంటే మాత్రం నల్లమందు చేతిలో మీరు బుక్ అయినట్టే!!
నల్లమందును తయారు చేసే మొక్క గింజలే గసగసాలు! గసగసాల మొక్క నుండి వచ్చే పాలను ఎండబెట్టి నల్లమందు తీస్తారు. గసగసాల్లో కూడా నల్లమందు ప్రభావం ఉంటుంది కాబట్టే మసాలాలు తరచూ ఆహారంలో తినటానికి అలవాటు పడ్డవారు మసాలాలు లేని ఆహారాన్ని తినాలంటే చాలా బాధపడిపోతారు.
అందుకే గసగసాల్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా తగ్గిస్తూ క్రమేణా మసాలా దినుసుల్లోంచి తప్పించేయాలి. వాటిని ఔషధంగా, పరిమితంగా అవసరం అయినప్పుడు మాత్రమే వాడుకుంటే మంచిది.
గసగసాలు ఎక్కువగా వాడటం వల్ల మలబద్ధకాన్ని తెచ్చిపెడతాయి. అందుకని విరేచనం సరిగా రాని వారు గసగసాల్ని పూర్తిగా వదిలేస్తేనే వారికి మలబద్ధకం నుంచి విముక్తి సాధ్యం అవుతుంది.
గసగసాలు చలవ చేస్తాయి. ఎప్పుడూ వేడి చేస్తోందని బాధపడే ఉష్ణశరీరతత్వం వున్న వారికి పేగుల లోపల ఎసిడిటీ పెరిగిపోకుండా కాపాడుతాయి.
అమీబియాసిస్ వ్యాధిలో పేగు లోపలి మ్యూకస్ పొర విరేచనం ద్వారా బైటకు పోతుంది. ఇలా పేగు లోపలి పొర పోవడం వలన పేగులు శిథిలం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిగురు, బంకలతో విరేచనం అవుతోందని అంటుంటారు. గసగసాలు ఈ అమీబియాసిస్ వ్యాధిలో ప్రేగుల్ని సంరక్షిస్తాయి. దోరగా వేయించి మెత్తగా దంచి తేనెతో గానీ, నేతితోగానీ తీసుకొంటే మంచిది. కొన్నాళ్ళపాటు అరచెంచా నుంచి చెంచా వరకూ తీసుకోవచ్చు.
నీళ్ళ విరేచనాల వ్యాధిలో కూడా పైన చెప్పినట్లే గసగసాలు తీసుకోవచ్చు. లేదా గసగసాలను నీళ్ళలో సూరి ఆ రసాన్ని పంచదార కలిపి త్రాగాలి. విరేచనాలు ఠక్కున ఆగుతాయి.
గసగసాలను దోరగా వేయించి పంచదార కలిపి అరచెంచా ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే గుండెకు మేలు చేస్తుందని వైద్యశాస్త్రంలో వుంది.
గసగసాల్ని దోరగా వేయించి, గుడ్డలో మూట కట్టి ఆ మూటని వాసన చూస్తూ పడుకుంటే గాఢనిద్ర పడ్తుంది. కలతలు, కలవరింతలూ వుండవు అదంతా నల్లమందు మూలాల ప్రభావమే.
చివరగా….
గసగసాలు ఆరోగ్యాన్ని చేకూర్చే ఔషధం అయినప్పటికీ అతిగా వాడటం వల్ల అందులోని నల్లమందు తాలూకూ ప్రభావం లోతుగా పనిచేసి, మసాలా లేని ఆహారం తినకుండా ఉండే స్థాయికి దిగజారిపోవడం జరుగుతుంది. అధిక మసాలా నిండిఉన్న ఆహారం ఆరోగ్యానికి పెనుప్రమాదమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అందుకె గసగసాలకు దూరం ఉంటే ఆరోగ్యం మీ వెంటే!! అవసరమైనప్పుడు ఆనందంగా వాడుకోండి తప్పులేదు సుమా!!