health benefits of ragi finger millet

అద్భుతమైన అమ్మమ్మ చేతి అమృతం మీకోసం.

కాలం మారేకొద్ది ఆహార అలవాట్లు మారిపోయాయి. ఆహార అలవాట్లు మారేకొద్ది మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బును కలిగిఉన్నారు 99% ఇదే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయితే ఒకనాటి మన అమ్మమ్మలు, వారికి వాళ్ళ అమ్మలు పెట్టిన పోషక పదార్థాలు ఎన్నో ఉన్నాయ్, ఒక అమృత తుల్యమైన పదార్థాన్ని మీకోసం తీసుకొచ్చా. 

 చిన్నతనం లో పెట్టే ఆహారమే ఎవరికైనా కూడా పునాది. అంటే ఆ ఆహారం వల్ల శారీరకంగా దృడం గా తయారవుతారు. ఇప్పట్లో పిల్లలకు హార్లిక్స్ లు, కాంప్లాన్ లు, బూస్ట్ లు బోర్న్ విటా లు. ఇంకా చిన్న పిల్లలకు అయితే సెరెలాక్ అంటూ పెట్టి వాళ్ళ పొట్టను అయితే నింపుతున్నారు కానీ శరీరానికి కావలసిన పోషకాలు అందించలేకపోతున్నారు. టీవీ లో యాడ్లు చూసి, వెనిల, చాక్లెట్ ఫ్లేవర్ లు చూసి కూడా వాటిని తాగేస్తూ అదే బలవర్థకమైన ఆహారం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మన అమ్మమ్మ లు తమ చిన్నతనం లో తీసుకున్న ఒక అద్భుతాన్ని ఇపుడు తెల్సుకుందాం.

రాగులతో ఏలుదాం ఆరోగ్య రాజ్యాన్ని

  ఏదో అద్భుతం, అమృతం అని చెప్పి రాగులు గూర్చి చెబుతావా అని మీకు కాసింత నిస్పృహ వస్తుందేమో మొదట చదివి తరువాత మీరే చెప్పండి నేను చెప్పినది అమృతమో కాదో!!

Ragi Malt PC Instagram kraftly_delights

 రాగి మాల్ట్

 రాగి మాల్ట్ ఎవరికి తెలియదు మేము మా పిల్లలకు పెడుతున్నాము అని మీరు అనుకుంటే పొరపాటే. అవును  ఎందుకంటే మరపట్టించిన రాగిపిండిని పాలల్లో కలిపి జావ గా తయారు చేసి దాన్నే రాగి మాల్ట్ అనుకుంటే పొరపాటు కదా మరి.  నిజమైన రాగి మాల్ట్ తయారీ విధానం ఇప్పట్లో ఎవరికి తెలియదు. అసలైన అమృతమంటే ఆ తయారు విధానం లోనే ఉంది మరి అందుకే ఇపుడు దాన్ని మీకోసం చెబుతా…….

తయారు విధానం 

రాగులు మాత్రం మామూలువే వీటికోసం ప్రత్యేకమైన రాగులు ఉండవు. రాగులను శుభ్రపరచుకుని వాటిని ఒక రాత్రి మొత్తం నీళ్లలో వేసి నానబెట్టాలి. తరువాత వాటిని ఒక పలుచటి గుడ్డలో వేసి మూటగా కట్టి చీకటి ప్రదేశం లో ఒకరోజంతా ఉంచాలి.  ఆ తరువాత ఆ మూటను విప్పి చూస్తే అందులో రాగులు మొలకలు వచ్చి ఉంటాయి. నిజానికి మనం చెప్పుకునే పోషకాలు అన్ని ఆ మొలకల్లోనే ఉంటాయి. ఇపుడు ఆ రాగులను ఎండబెట్టాలి. రాగులు బాగా ఎండిపోయి గట్టిపడ్డాక వాటిని ఇంట్లోనే మిక్సర్ లో కానీ, లేక బయట కానీ మరపట్టించుకుని ఒక టైట్ కంటైనర్ లో నిల్వచేసుకోవాలి. అద్భుతమైన రాగి మాల్ట్ పౌడర్ ఇపుడు సిద్ధం.

రాగి మాల్ట్ ఉపయోగించుకునే విధానం.

ఒక కప్పుడు పాలను తీసుకుని అందులో ముప్పావు కప్పు పాలను స్టవ్ మీద ఒక గిన్నెలో వేసి సన్నని సిమ్ లో మరిగించాలి. పాలు మరుగుతున్నపుడు ఒక స్పూన్ రాగి మాల్ట్ పౌడర్ ను పక్కన తీసిపెట్టిన పావుకప్పు చల్లని పాలల్లో వేసి జారుగా కలిపి మరుగుతున్న  పాలలో ఈ మిశ్రమాన్ని  మెల్లిగా వేస్తూ బాగా కలపాలి. నేరుగా పొడిని పాలల్లో వేస్తే ఉండలు కట్టే అవకాశం ఎక్కువ ఉంది అందుకే ఈ ప్రాసెస్ రాగి మాల్ట్ తయారు చేసుకోవడం లో ప్రధానం.  పాలల్లో కలిపిన రాగి మాల్ట్ మిశ్రమం బాగా ఉడికి చిక్కటి జావ గా తయారు అయినపుడు అందులో తగినంత బెల్లము లేక పంచదార కలిపి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాఫీ, టీ లకు బదులుగా తీసుకోవాలి.

ఉపయోగాలు….

 రాగుల్లో మిథియోనైన్ అమీనో ఆమ్లం  పుష్కలంగా ఉంటుంది. అలాగే  క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. చవకగా దొరికే ఆహార పదార్థాలను వాడే దిగువ తరగతి కుటుంబాలకు రాగులను మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అలాగే రాగి మాల్ట్ తయారీ కోసం వాటిని మొలకలు తెప్పించడం వల్ల మరింత పౌష్ఠికం గా తయారవుతాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దీన్ని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. 

చివరగా……

ఇంతటి అద్భుతమైన పౌష్టిక పదార్థాన్ని అందరికి అందుబాటు ధరలో ఉంచుకుని వందలు, వేలు వెచ్చించి  హెల్త్ డ్రింక్ ప్రొడక్ట్ లను కొనుగోలు చేయడం మూర్ఖత్వమే కదా. కాసింత ఓపికతో రాగులు కొనుగోలు చేసి మనం  ఉపయోగించుకోవడం వల్ల మనకు ఆరోగ్యమూ….. మన రైతన్నలకు ఆర్థిక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము. 

Leave a Comment

error: Content is protected !!