గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉలవలు అపుడపుడు వాడుతుంటారు. ఒకప్పుడు ఉలవలు చాలా విస్తృతంగా వాడేవారు. కానీ ఇపుడు వాటిని ఎవరు కొంటున్నారో, ఎవరు వాడుతున్నారో అర్థం కావడం లేదు. అయితే కొన్ని రెస్టారెంట్లు ఉలవచారు బిర్యానీ లాంటి కొంబో లతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. గుర్రానికి గుగ్గిళ్ళు అనే మాట వల్ల ఉలవలు మనుషులు తినడమే తగ్గించారేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఉలవచారు ప్రయోజనాలు తెలుసుకుంటే ఇన్నిరోజులు ఎందుకింత తప్పు చేసాం అనిపించక మానదు. మరి ఉలవచారు ప్రయోజనాలు ఏమిటో చదవండి.
◆వాత వ్యాధులతో బాధపడేవారికి ఉలవచారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతం, కీళ్ళవాతం, ధనుర్వాతం, గాట్ అనే కీళ్ల వాతం, సయాటికా నడుము నొప్పి, స్పాండిలోసిస్ అనే మెడ నొప్పి మొదలైన బాధలున్నవారికి పలుచగా కాచిన ఉలవచారు, సతాళించిన గుగ్గిళ్ళు వంటివి ఆహారంలో భాగంగా ఇస్తూ ఉంటే వాత తీవ్రత తగ్గుతుంది. దీనిని కూడా తేలికగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే వేడి చేస్తాయి.
◆స్థూలకాయాన్ని తగ్గించే గుణం ఉలవచారుకు ఉంది. ఉలవలు వేయించి చారు కాచితే తేలికగా అరుగుతాయి. స్థూలకాయంలో కనిపించే అతిగా చెమట పట్టడం అనే లక్షణం, ఉలవలు వలన తగ్గుతుంది. స్వేదసంగ్రహకం అనే గుణం ఉలవలకు ఉంది.
◆ఉలవచారుకు అలసటను శ్రమను పోగొట్టి, బలాన్నిచ్చి, నొప్పులు తగ్గించే గుణాలు ఉన్నాయి. శ్రమను భరించగలిగే శక్తిని ఉలవలు పుష్కలంగా ఇస్తాయి అందుకే గుర్రాలకు, వ్యవసాయ పశువులకు గుగ్గిళ్ళు ఉడికించి పెడుతుంటారు. మనం ఉలవలతో చారు కాచుకుని తీసుకోవచ్చు. దీనివల్ల గొప్ప శారీరక పుష్టి కలుగుతుంది.
◆ఉలవల్ని బాగా ఉడికించి మెత్తగా రుబ్బి, గుడ్డలో వేసి పిండితే చిక్కటి పాలు వస్తాయి. ఇందులో పాలు కలిపి పంచదార వేసి తాగిస్తే బాలింతల్లో పాలు పెరుగుతాయి. ఇందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాము వేసి చారు కాచుకుని తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
◆ ఉలవలకు దృక్ప్రసాద, లోచనహితా అనే పేర్లు ఉన్నాయి. రేచీకటి మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది.
◆మూలవ్యాధులకు, మొలలకు చికిత్స చేసేటపుడు ఉలవచారును ఆహారంలో భాగం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రక్తస్రావం జరిగే సందర్భాలలో ఉలవలకు దూరంగా ఉండాలి.
◆ ఉలవచారులో పెరుగు కలిపి బాగా చిలికి మజ్జిగ తయారుచేసుకుని బోజనం తరువాత తాగితే. అన్నం తినడం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములు ఉన్నవారు ఉలవల చారును వేడివేడిగా తీసుకుంటే కఫము తగ్గి, వాత, కఫ దోషాలు తగ్గుతాయి.
◆గర్భాశయ దోషాలమీద ఉలవచారు ఔషదంలా పనిచేస్తుంది. నెలసరి సరిగా రాని వారికి, తెల్లబట్ట వంటి సమస్యలు ఉన్నవారికి కూడా గొప్ప పలితాన్ని ఇస్తుంది.
◆విరేచనాలు అవుతున్నపుడు ఉలవచారు తీసుకుంటే విరేచనాలకు విరుగుడు అవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరిగించి త్వరగా బయటకు వచ్చేలా చేస్తుంది.
◆ఉలవలకు వేడి చేసె గుణం ఎక్కువ కాబట్టి ఇది తగ్గాలాంటి ఉలవ చారులో ముల్లంగి రసాన్ని కలిపి చారుగా చేసుకుని తీసుకోవాలి. ముల్లంగి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది మరియు మూత్రపిండాల పనితీరు దృడంగా మారుస్తుంది.
చివరగా……
ఉలవచారు తో పైన చెప్పుకున్నట్టు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే గొప్ప ఆరోగ్యం సొంతమవడం కచ్చితం.