health precautions for kids rainy season

వర్షాకాలం లో ఇవి పాటిస్తే పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.

చినుకులు పడగానే మనసు ఆహ్లాదం. ఆ చల్లని వాతావరణం కు పిల్లలు కూడా కేరింతలు కొడతారు. అలాగే వాతావరణం ఇంకా బలంగా తేమతో కూడుకుని తయారయ్యేకొద్ది పిల్లలు కూడా మెల్లిగా ముక్కులు చీదడం, దగ్గడం మొదలెడతారు.  వాతావరణం లో జరిగే మార్పులు సహజంగానే అందరి మీద ప్రభావం చూపిస్తాయి. అయితే పిల్లల విషయంలో కాసింత బెంగ సహజమే. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల  వాతావరణం మారగానే వాళ్ళు మెత్తబడతారు. అయితే ఈ వర్షాకాలం కేవలం చిన్న చిన్న సమస్యలతో వెళ్లిపోదు. మనం నిలక్ష్యం చేస్తే పిల్లలకు చాలా ప్రమాదకరమైన సమస్యలను అంటించి వెళ్తుంది. అందుకే వర్షాకాలంలో పిల్లల కోసం కొన్ని జాగ్రత్తలు.

శుభ్రత

శుభ్రత అంటే రోజు స్నానం చేసి శుభ్రంగా ఉండటమే కాదు, ఇంటిని పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం.  వర్షం వల్ల నిలిచిన నీటిని తొలగించడం. ఎక్కడా తడి ఉండకుండా జాగ్రత్త పడటం. ముఖ్యం గా చెత్తను తడితో కలవకుండా జాగ్రత్తగా దూరంగా పారవేయడం. చెత్త కు తేమ తగిలి కుళ్లడం వల్ల వైరస్, బాక్టీరియా పెరిగేందుకు దోహదం చేస్తుంది. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలకు ఆవాసంగా మారతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గుణ్య లాంటి జ్వరాలు వచ్చి అవి క్రమంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. 

ఆహారం

వర్షాకాలంలో సాధారణంగా అందరికి అనిపించే విషయం వర్షాన్ని చూస్తూ వేడి వేడి పకోడిలో లేక అప్పుడే కాల్చిన మొక్కజొన్న పొత్తులో తినాలని. ఇక్కడే అర్థమైపోలేదూ వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే వర్షాకాలంలో మంచిదని. పిల్లలకు అయితే వేడి చేసి చల్లార్చిన నీటిని ఇవ్వడం వల్ల నీళ్లలో ఒకవేళ బాక్టీరియా ఆనవాళ్లు ఉన్నా నశిస్తాయి. చల్లటి ఆహారంలో బాక్టీరియా, వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.  అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలు తొందరగా నీరసానికి గురి అవుతారు కాబట్టి చల్లటి పదార్థాలు దూరం ఉండటమే శ్రేయస్కరం. అలాగే బయట  నుండి తెచ్చిన పదార్థాలు, పండ్ల రసాలు, ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పదార్థాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఇంకా  వర్షాకాలంలో లభ్యమయ్యే బొప్పాయి, దానిమ్మ, యాపిల్, నేరేడు వంటి పండ్లను నేరుగా బయట కొనుగోలు చేసి శుభ్రంగా కడిగి పిల్లలకు ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం మాత్రం నిర్మూలించాలి.

జాగ్రత్తలు

వర్షాకాలంలో పిల్లలు ఏ మాత్రం మెత్తబడినా పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు గృహవైద్యానికి దూరంగా ఉండటమే మంచిది. చిన్న పిల్లల వైద్యులను సంప్రదించడం ఉత్తమం. సమస్య చిన్నదిగా ఉన్నపుడు పెద్దవాళ్ళ సలహాను పాటించడం కూడా ఉత్తమమే. అయితే ఏదైనా చేసే ముందు ఒకరికి ఇద్దరిని అడిగి విషయాన్ని క్లియర్ చేసుకున్నాక పాటించడం ఉత్తమం.

పిల్లలు బయటకు  వెళ్ళేటప్పుడు గొడుగు లేదా రైన్ కోట్ వేయడం మర్చిపోకండి దీనివల్ల అసందర్బపు వర్షాల వల్ల ఇబ్బంది తప్పుతుంది. అలాగే బయట ఆహారానికి దూరంగా ఉండమని పిల్లలకు చెప్పాలి.  వర్షం చినుకుల్లో తడిసిన పదార్థాలు అసలు ముట్టవద్దని చెప్పాలి. ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఉత్సాహపడే విషయం వర్షంలో ఐస్ క్రీమ్ తినాలని అనుకోవడం. సరదా అందరికి ఉంటుంది కానీ మొదట ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.  దోమతెరలు వాడటం ఎంతైనా మంచిది. ఆలౌట్ లు, మస్కిటో కాయిల్స్ కు దూరం విదితమే ఉత్తమం. దోమల వచ్చే సమస్యలు ఏమో కాని మస్కిటో కాయిల్స్ వెదజల్లే పొగ వల్ల కాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. వీలైతే సాంబ్రాణి ధూపం లేక పొగ వేయడం ఉత్తమం.

చివరగా…… 

పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి అల్లం, మిరియాలు, వెల్లుల్లి వంటివి ఆహారంలో తప్పనిసరిగా జోడించాలి. వర్షంలో  ఆకుకూరలు ఎక్కువ తడిసి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వండుకోవడం ఉత్తమం.  ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలాన్ని సమర్థవంతం గా ఎదుర్కొని వర్షపు చినుకుల్లా  పిల్లల నవ్వులు ఆస్వాదించగలం.

Leave a Comment

error: Content is protected !!