healthy lifestyle current situation

మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

మనిషి అదృష్టవంతుడు, ఏ జీవికి లేని ఎన్నో సౌలభ్యాలు మనిషికి ఉన్నాయ్. గొప్పగా మాట్లాడగలడు, చూసినదాన్ని వర్ణించగలడు, విన్నదాన్ని అనుభూతి చెందగలడు, ఏదైనా చూడాలంటే చక్కగా నడుస్తూ వెళ్ళిపొగలడు. కానీ ప్రస్తుతం మనిషి నిజంగానే అదృష్టవంతుడిలా జీవిస్తున్నాడా అంటే మనిషి అయోమయంతో పిచ్చి చూపులు చూడాల్సిందే. అభివృద్ధి అనే వంతెన మీద నడుస్తూ మనిషికి సంపూర్ణ ఆరోగ్యమెక్కడ?? జరుగుతున్న కాలాన్ని ఎలాగూ మార్చలేము, కనీసం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నిజాలు నిజంగా చూద్దాం. తరువాత వాటిని విశ్లేషించాక మీరే చెబుతారు అవన్నీ నిజమా?? కాదా?? అని. ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి ఇంకా వీధుల్లో చక్కర్లు కొడుతున్న కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం కూడా.

నడక మన ఆరోగ్యానికి చక్కని సోపానం

ఉదయాన్నే లేస్తాము కాఫీలు, టీలు తాగుతాము, కాసేపు ఎదో ఒక టీవీ చానల్ చూస్తాము, స్నానం చేసి ఆఫీసులకు పరిగెడతాము. ఏ స్కూటీ మీదనో లేదా బైక్ లేదా కార్. వెళ్లినపటి నుండి కంప్యూటర్ల ముందు కళ్ళప్పగించి, కుర్చీకి ఒళ్ళప్పగించి సాయంత్రం వరకు  వర్క్ చేస్తూనే ఉంటాం. ఇదంతా మానసిక అలసటకు కారణం అవుతుంది. అందుకే ఉదయాన్నే లేవాలి 5 గంటల నుండి కనీసం 6 గంటల వరకు ఒక గంట సేపు నడక. మీ రోజును మార్చేస్తుంది. రోజంతా ఉల్లాసంగా ఉండేట్టు చేస్తుంది. ఆపసోపాలు పడి అవి ఇవి ఆసనాలు వేయకపోయినా రోజు పది నిమిషాలతో లక్షణంగా నడకను మొదలుపెట్టి రోజులో భాగం చేసుకుంటే ఆరోగ్యం క్యాట్ వాక్ చేస్తూ మనముందుకు వస్తుంది. 

కంటి నిండా నిద్ర జీవితానికి కలల పంట

నమ్మండి, నమ్మకపోండి మీ ఇష్టం. కానీ మనిషి మానసిక ఆరోగ్యానికి నిద్రకు మించిన ఔషధం లేదు. పడుకోవడం, మేల్కొవడం ఎవరు ఎన్ని గంటలకు చేస్తున్నారు?? ఒక్కసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే సిగ్గుతో తలవంచుకోవడం కాయం.  ఉదయమేమో నిక్కీ, నీలగి 8 గంటలకు లేస్తారు. రాత్రి 12 గంటల వరకు మొబైల్ కు మూతులు, ముఖాలు అప్పగించి ఆ మొబైల్ వెలుగులో దయ్యాల్లా మేలుకొని ఉంటారు. సహజంగా మన శరీరానికి అందవలసిన శక్తి అయిన సూర్యుడి వెలుగు, విటమిన్ డి వంటివి సూర్యోదయ కిరణాల్లోనే పుష్కలంగా ఉంటాయనే విషయాన్ని ఎప్పుడో మరిచిపోయిన భారతీయ సంస్కృతి వారసులం. నిద్రకు మార్గం సుగమం అయితే మేలుకోవడం, రోజంతా చురుగ్గా ఉండటం దానికదే జరిగిపోతుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.

ఆహారమే మన ఆరోగ్యం

ఎక్కడెక్కడా?? మనం రోజూ తింటున్న ఆహార పదార్థాల చిట్టా ఎక్కడా?? ఒకసారి వాటిని ఎవరికి వారు గమనించుకుంటే మంచిది. రోజులో ఎంత చెత్త తింటున్నాం, ఎంత చెడు కొలెస్ట్రాల్ మనశరీరంలో చేరుతోంది, ఎన్ని కేలరీలు తినేస్తున్నాం అన్ని కూడా సులువుగా అర్థం చేసుకోగలం. సహజమైన పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు వదిలి ప్యాక్ చేయబడిన ఆహారం వైపు మొగ్గు చూపడం అవివేకం కదా!!  సీజన్ల వారిగా దొరికే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. తాజా ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా బయట ఆహారం మానేయాలి. మరొక్క విషయం మరవకండి తీసుకునే ఆహారం ఏదైనా సరే మెల్లిగా బాగా నమిలి తినాలి. తొందరలో ఆహారాన్ని నమలకుండా తినడం వల్ల జీర్ణసంబంధ వ్యాధులు చుట్టుముడతాయి.

అలవాట్లతో అగచాట్లు తప్పించుకుందాం

పైన చెప్పుకున్న తిండి, నిద్ర, వ్యాయామం ఇవన్నీ మన అలవాట్లే. అయితే వాటిని మనం సరిచేసుకున్నా కొన్ని అనారోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాయి. మద్యపానం, ధూమపానం అలాంటివే. అలాగే ఆహారం తీసుకునే ముందు, ఇంట్లోకి  రాగానే శుభ్రత పాటించడం. ఉతికిన బట్టలు ధరించడం, ఇలాంటివి చాలా ముఖ్యం. 

చివరగా…….

అమ్మ ఒడి లాంటి ప్రకృతితో….. ప్రకృతిలో…..

ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా ప్రస్తుత కాలంలో మనిషి ఎక్కువ ఇబ్బంది పడుతున్నది  మానసిక సమస్యలతోనే. కాబట్టి యోగ, ధ్యానం చక్కని పరిష్కారం. ఇవి మతానికి సంబందించిన ప్రక్రియలు అనుకోకుండా జీవన విధానానికి సంబందించిన ప్రక్రియలుగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించవచ్చు. చివరగా చక్కని మాట. కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు మన జీవితానికి అవసరమే కానీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, అవసరానికి వాడుకుని మిగిలిన సమయంలో ప్రకృతికి దగ్గరగా ఉండటం జీవితానికి గొప్ప ఔషధం.

Leave a Comment

error: Content is protected !!