ఆరోగ్య సంరక్షణలో భాగంగా బోలెడు ప్రయోగాలు చేస్తుంటాం. అన్ని సహజమైన దుష్ప్రభావాలు లేనివి అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు చేస్తున్నది టీ లు, కాఫీ లు మానేసి గ్రీన్ టీ బాట పట్టారు. మరికొందరు బ్లాక్ టీ కూడా తాగేస్తున్నారు. ఇంకొందరు మరికొంచెం ముందుకు వెళ్లి జామ ఆకులతో, గులాబీ రేకులతో, మందారం పూవులతో టీ లు తయారు చేసుకుని తాగేస్తూ ఉన్నారు. వీటివల్ల ఫలితాలు ఎంత వరకు ఉన్నాయనేది పక్కన పెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి ఏ విధమైన భయం లేదు.
అయితే ఆయుర్వేద పరంగా శరీరంలోని అన్ని జబ్బులను అసమతుల్యతలను తరిమి కొట్టే ఒక అద్భుతమైన మనకు అందరికి తెలిసిన పదార్థం ఉపయోగించి తయారు చేయగల ఒక టీ గూర్చి చెప్పబోతున్నాను. దీని వల్ల ప్రయోజనాలు కూడా మీకోసం తప్పకుండా చదవండి మరి.
వెల్లుల్లి టీ…..
వెళ్ళిల్లి తో టీ ఏంటి?? వెర్రి వేయి విధాలు అనుకోవద్దు. వెల్లుల్లి ఎంత గొప్ప వంటింటి దినుసో అంతకంటే ప్రభావవంతమైన ఆరోగ్య ప్రదాయిని. అలాంటి వెల్లుల్లి తో తయారు చేసే టీ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొదట వెల్లుల్లి టీ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం.
కావలసిన పదార్థాలు
- వెల్లుల్లి రెబ్బలు : రెండు లేక మూడు
- తేనె : ఒక స్పూన్
- నిమ్మరసం : సగం కాయ
- నీళ్లు : 250 మిల్లీ లీటర్లు
తయారు విధానం
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత దించి ఒక గ్లాస్ లో వేయాలి. ఇపుడు వెల్లుల్లి రెబ్బలను మరీ మెత్తగా కాకుండా కేవలం రెండు మూడు దెబ్బలు వేసి కాసింత దంచాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో వేసి గ్లాసు మీద మూత పెట్టాలి.
నీరు గోరు వెచ్చగా అయినపుడు అందులో ఉన్న వెల్లుల్లి రెబ్బలు తీసివేయాలి. ఇపుడు ఆ నీటిలో ఒక స్పూన్ తేనె, సగం కాయ నిమ్మరసం పిండుకోవాలి. అంతే వెల్లుల్లి టీ రెడి అయినట్టే.
ప్రయోజనాలు
ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ టీ తో మొదలు పెట్టాలి. దీనివల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది, రక్తం శుద్ధి ఆవుతుంది, శరీరంలోని మలినాలు నశిస్తాయి. రోజు మొత్తానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇందులో ఉన్న నిమ్మకాయ రసంలో సిట్రస్ రోజు మొత్తం ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది, అలాగే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల దీర్ఘ కాలం వాడితే యవ్వనాన్ని చెక్కు చెదరనివ్వదు. తేనె సహజమైన చెక్కరలు కలిగి ఉండటం వల్ల శరీరంలో సమతా స్థాయిని ఉంచుతుంది. చర్మానికి మృధుత్వాన్ని, తేమను అందిస్తుంది. రోజంతా చురుగ్గా ఉండటంలో తేనె కూడా సహాయపడుతుంది.
చివరగా……
మొత్తం వంటింట్లో ఉండే దినుసులు అవడం, తయారీ కూడా సులువే కావడం వల్ల ఎలాంటి కష్టం లేకుండానే ఆరోగ్యం మన సొంతమైపోతుంది. కాబట్టి వెల్లుల్లి టీ ని తప్పక తయారు చేసుకుని తాగండి. ముఖ్యంగా రోగాల కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా మరి.