చాలామంది రాత్రి ఆహారంగా పుల్కా లేదా చపాతీ తీసుకుంటారు. అన్నం తీసుకునే వారికంటే ఇలా పుల్కా లేదా చపాతీ తీసుకునేవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నట్టే లెక్క. ఎందుకంటే దీనివల్ల కార్బోహైడ్రేట్ల లభ్యత తగ్గుతుంది శరీరం తేలికగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా ఈ అలవాటు సహాయపడుతుంది. అయితే వీటికంటే ఆరోగ్యకరమైన ఆహారం మరొకటి ఉంది. అదే పండ్లు తీసుకోవడం. మీరు పడుకునే ముందు ఏదైనా తినాలనుకున్నట్లయితే, మీరు చేయగలిగే మంచి ఎంపికలలో పండ్లు ఒకటి.
పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క మంచి మూలం. పండ్లను తినడం వలన శరీర బరువు తగ్గడం మరియు బరువు పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఐస్ క్రీం లేదా పొటాటో చిప్స్ వంటి ఇతర స్నాక్ ఆప్షన్‌ల మాదిరిగా కాకుండా, యాపిల్స్, నారింజ మరియు అరటిపండ్లు వంటి పండ్లు అంతర్నిర్మిత పోర్షన్ కంట్రోల్ యొక్క అదనపు ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.
పండ్లు ఆహారంగా తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణమవుతుంది. ఆరేడు గంటల లోపు తీసుకోవడం వలన శరీర వ్యవస్థ త్వరగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరుకుతుంది. ఇవి రాత్రంతా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే నీటి శాతం డీహైడ్రేట్ కాకుండా అడ్డుకుంటుంది. అలాగే మన ఆహారం వండినప్పుడు అందులో ఉండే సూక్ష్మ పోషకాలను కోల్పోతాం కానీ పండ్లను నేరుగా తీసుకున్నప్పుడు దానిలో ఉంటే ఎటువంటి విటమిన్లను లేదా సూక్ష్మ పోషకాలను కోల్పోయే అవకాశం ఉండదు.
మనం వండిన ఆహారం తీసుకున్నప్పుడు అందులో నూనె, ఉప్పు, కారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అదనంగా అధిక బరువు, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరిగేందుకు సహాయపడతాయి. పండ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. డయాబెటిక్ పేషెంట్లు నానబెట్టిన విత్తనాలతో పాటు పండ్లను కూడా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి రాత్రిపూట పండ్లను ఆహారంగా తీసుకోవడం మంచి ఎంపిక. మలబద్ధకం సమస్య ఉన్నవారికి రాత్రిపూట పండ్లను తీసుకోవడం, సరైన మోతాదులో నీటిని తాగడం చాలా బాగా ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గుండె వ్యాధులు, రక్త పోటు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.