సదీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మొదలైనవి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శరీర స్థాయి సమర్థవంతంగా ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహారం పదార్థాలలో బాగా గమనిస్తే కొన్నింటిని మాత్రమే ఎక్కువగా తింటూ వాటినే ఆస్వాదిస్తూ వాటికే ప్రాధాన్యం ఇస్తుంటాం కూడా. అయితే మన ఆహారంలో షడ్రుచులు ఉండాలనేది పెద్దలు చెప్పిన మాట. ఈ షడ్రుచులు కేవలం ఉగాది నాడు మాత్రమే తీసుకునేది కాదు. రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.
- తీపి
- పులుపు
- ఉప్పు
- కారం
- చేదు
- వగరు.
పై ఆరు రుచులు మన ఆహారంలో ఉన్నట్లయితే మన శరీరం ఎలాంటి జబ్బులకు కూడా లోనవ్వదు. అయితే మనం కొన్నింటిని పక్కన పెట్టి కొన్నింటిని మాత్రమే ఇష్టంగా తింటుంటాం. అందుకే ఈ షడ్రుచులలో దాగున్న మర్మమేమిటో ఇపుడు చూద్దాం.
తీపి:
ఆహారంలో తీపిని తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో రక్తం,కొవ్వు, శుక్రం, ఓజస్సు, ఎముకల ఎదుగుదలకు సహకరించడం, వాత, పిత్త దోషాలను క్రమబద్దీకరించంలో తోడ్పడుతుంది.
తీపి ఎక్కువగా తీసుకుంటే అధికబరువు, అధిక నిద్ర, శ్వాసలో ఇబ్బంది, దగ్గు, జలుబు వంటి సమస్యలతో పాటూ స్వరపేటికను కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వాపులు, బోధకాలు వంటి సమస్యలను ఉత్పన్నం చేస్తుంది.
పులుపు :
పులుపును తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఆహారంలో కొద్దిపాటి పులుపు దేహదారుఢ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గుండెను, జీర్ణాశయాన్ని కాపాడుతుంది.
పులుపు ఎక్కువ తీసుకుంటే శరీరంలో రక్తం విరిగిపోవడం, గొంతు, రొమ్ము, గుండెలో మంట, పైత్యాన్ని వృద్ధి చెందించి కఫాన్ని పెంచడం జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలలో ఉన్న వారికి ఆరోగ్య నష్టాన్ని కలుగజేస్తుంది.
ఉప్పు :
ఉప్పు లేని వంట అసలు తినలేము. అయితే ఉప్పు కూడా మితంగా తీసుకోవాలనే విషయం అందరికి తెలిసినదే. ఉప్పు శరీరంలో మలినాలను బయటకు పంపేలా చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహారం జీర్ణమవడానికి తోడ్పడి మలవిసర్జన సాఫీగా జరగడానికి దోహదం చేస్తుంది.
ఉప్పు అధికంగా వాడటం వల్ల నిగ్రహాన్ని కోల్పోతారు, దీన్నే బిపిగా పిలుచుకుంటాం. రక్త ప్రసరణ వేగం పెరగడం వల్ల ఆకస్మాత్తు గుండెపోటు కు కూడా అవకాశం ఉంటుంది. చర్మ మరియు కేశ సంబంధ సమస్యలు రావడానికి ఉప్పు కారణం అవుతుంది.
కారం :
కారం తక్కువగా వల్ల జఠరాగ్ని వృద్ధి చెంది తిన్న ఆహారం శోషన చెందుతుంది. జలుబు, దద్దుర్లు, జిడ్డు, చెమట, మొదలైన మలినాలను బయటకు నెట్టేస్తుంది.
అదే కారం ఎక్కువగా తినడం వల్ల మూర్ఛ, బలహీనత, వణుకు వంటి సమస్యలను అలాగే జీర్ణాశయ అల్సర్ వంటి సమస్యలను కలుగజేస్తుంది. పాదాలు, భుజాలు, పక్కటెముకలు, వెన్నుపూస వంటి భాగాలను బలహీనం చేస్తుంది.
చేదు :
చేదంటే అందరూ ముఖం ఏదోలా పెడతారు. చేదును తీసుకోవడం వల్ల దాహం, మంట, జ్వరం వంటి సమస్యలను నిర్మూలిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంలో, తల్లిపాల వృద్ధికి కూడా చేదు సహకరిస్తుంది. గాయాలు, చీము, కొవ్వు వంటివి నిర్మూలిస్తుంది.
చేదు ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరంలో తేమ, రక్తం మందగించేలా చేసి శరీరాన్ని కళావిహీనం చేస్తుంది.
వగరు :
వగరంటే మనకు పొగరు. కానీ వగరు తీసుకోవడం వల్ల కురుపులు, గుల్లలు, మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది. వీటిని ఉత్పన్నం చేసే బాక్టీరియా ఎదుగుదలను నివారించి శరీరంలో రక్త వ్యాధులను నిర్మూలిస్తుంది.
వగరు ఎక్కువగా తీసుకుంటే గొంతు సంబంధ సమస్యలు మొదలై చెవుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రొమ్ము నొప్పి, కడుపునొప్పి, శరీరం నలుపుగా తయారవడం, మలబద్దకం కలిగి వాత సమస్యలను ప్రేరేపిస్తుంది.
చివరగా….
మనం చెప్పుకున్న ఈ ఆరు రుచుల మర్మం అందరూ అవగాహనతో తెలుసుకుని వాటిని సరైన విధంగా వాడటం వల్ల గొప్ప ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.