మాటలు రాని పిల్లలకు వస ను ఉపయోగించడం సర్వ సాధారణంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో దీని వాడకం తప్పనిసరిగా ఉంటుంది. అయితే చిన్న కుటుంబాలు వచ్చేసి పెద్దలు దూరమై కేవలం భార్య, భర్త పిల్లలు ఉన్న చిన్న కుటుంబాలు ఏర్పడటం వలన కొన్ని ఉపయోగాలు మనకు తెలియడం లేదు. అలాంటి జాబితాలో వస కూడా ఉందని చెప్పాలి. ఘాటైన వాసన వికారం, చేదు రుచులు కలిగిన ఈ వస కొంచం పైత్యాన్ని కలిగించినా బుద్ధిబలాన్ని పెంచుతుంది.
అయితే చాలామందికి కూడా వసను కేవలం మాటలు రాని పిల్లలకోసం ఉపయోగిస్తారని మాత్రమే తెలుసు. కానీ వసతో చాలా ఉపయోగాలు ఉన్నాయ్. అవేంటో తెలుసుకుని తీరాల్సిందే మరి.
◆ పిప్పళ్ళు, శొంఠి, చిత్రమూలం, తుంగముస్తలు, చంగల్వకోష్టు మూలికలతో కలిపి కూడా వసను వాడుకోవచ్చు.
◆పెద్దలు చెప్పేమాట తాచుపాము కూడా వస ఉన్న దరిదాపులకు రాదని చెప్పడం చాలా చోట్ల వినే ఉంటాము. లైబ్రరీల్లో, పుస్తకాలలో, బట్టల బీరువాలలో ఇలా పలువిధమైన ప్రాంతాలలోపురుగులు చేరకుండా వసకొమ్ముల్ని ఉంచడం లేదా వసపోడిని చల్లడం వల్ల జాగ్రత్త చేసుకోవచ్చు.
◆ కీటకాలు, తేలు కుట్టిన ప్రాంతాలలో వస కొమ్మును అరగదీసి రాస్తే విషదోషాన్ని పోగొట్టి నొప్పిని తగ్గిస్తుంది.
◆ పిల్లలకు తరచూ జ్వరాలు, నిమ్ము, జలుబు, దగ్గు రావడం, కడుపులో నులిపురుగులు, కడుపునొప్పి, అజీర్తి వల్ల కలిగే విరేచనాలు, కాలేయం బలహీనంగా ఉన్న సమయంలో వసను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
◆ విరేచనాలు ఎక్కువగా అవుతున్న పిల్లలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. కలరా వచ్చినపుడు వసకొమ్ముల్ని శుభ్రం చేసి, పొడిగా దంచుకుని ఈ పొడిని పంచదార పాకంతో జతచేసి చిన్న చిన్న బిళ్ళలుగా తయారుచేసుకుని నిల్వచేసుకోవాలి. వీటిని కలరా వచ్చినపుడు రోజుకు ఒక బిళ్ళ చొప్పున వాడితే సమస్య తగ్గుతుంది.
◆ ముసలివారు వసకొమ్ము పొడిని దోరగా వేయించి దానిలో సైందవ లవణం కలిపి భోజనం చేసేటపుడు మొదట్లో ఒక ముద్ద అన్నంకు సరిపడు పొడిని వేసుకుని బాగా కలిపి తింటే పక్షవాతం, పంటినొప్పి, శ్లేషం వల్ల కలిగే దగ్గు, కాలేయం బలహీనతలు, మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రం బంధించడం, మూత్రపిండాలలో రాళ్లు మొదలైన వాటిని తగ్గించడంలో దోహదపడుతుంది.
◆ మహిళల నెలసరి సమయంలో ఋతురక్తాన్ని సాఫీగా జారీచేయండంలో తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను దరిచేరనివ్వకుండా ఉండటం మాత్రమే కాకుండా జలుబును తగ్గిస్తుంది.
◆ నీళ్లలో వసను వేసి మరిగించి ఆ నీళ్లతో పిల్లలకు స్నానం చేయించడం వల్ల మూర్ఛపోవడమే సమస్య మాత్రమే కాకుండా ఫిట్స్ కూడా తగ్గుతాయి.
◆ వసపోడిని కర్పూర తైలంలో కలిపి ఛాతీ మీద మరియు వీపు మీద రాసినట్లైతే రొమ్ములో గురగుర అనడం తగ్గుతుంది. అంతేకాదు దీన్ని నుదురుపై పట్టులాగా వేస్తే ఎంతో బాధించే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.
◆ జ్వరం తగ్గిపోయాక శరీరాన్ని అంటిపెట్టుకున్న నీరసానికి పథ్యం తీసుకునేవారికి వసను ఇవ్వడం వల్ల ఆకలి పుట్టి బలం కలిగి తొందరగా కోలుకుంటారు.
◆ దోమలు, ఒంటిరెక్క పురుగులు ఎక్కువగా ఉన్నపుడు వసకొమ్ము పొడిని నిప్ప్పుల మీద వేసి పొగబెడితే అవి వెళ్లిపోతాయి.
చివరగా……
వస అనేది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే కాకుండా పైన చెప్పుకున్నట్టు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వసకొమ్ములను దాచుకోండి