రేపు జూలై 20వ తారీఖున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ. ఆషాడ మాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి జరుపుకుంటాం. ఈరోజు ఉపవాసం చేస్తుంటారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా కేవలం దైవారాధనలో రోజంతా గడుపుతుంటారు. హిందువులకు ఇది సంవత్సరంలో మొదటి పండుగగా భావిస్తారు. ఈరోజు విష్ణువు పాలకడలిపై నిద్రలోకి వెళ్తారు. అందుకే ఈ రోజును పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కోసం దశమి నాటి రాత్రి నుండి నిరాహారంగా ఉంటారు.
వేకువ జామున లేచి తలస్నానం చేసి, తులసితో విష్ణువుకు పూజ చేస్తారు. విష్ణు సహస్ర నామాలు చదువుతూ విష్ణువును స్తుతిస్తారు. కడుపు నిండిన వ్యక్తి యొక్క మనస్సు అనేక విధాలుగా పోతుంటుంది. అందుకే నిరాహారంగా ఉండి కేవలం దైవారాధనను మనసులో నిలుపుకొని పగలంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తూ దైవాన్ని స్మరిస్తారు. ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలోని గుడికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అల్పాహారం మాత్రమే భుజిస్తారు.
ఉపవాసం తర్వాత ఎక్కువ ఆహారం ఇవ్వడం వలన జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది కనుక అల్పాహారాన్ని ఇస్తారు. ఏకాదశి అనగానే మొదట గుర్తొచ్చేది పేలాల పిండి తినడం మరియు గోపూజ. ఉపవాసం ఉన్నప్పటికీ దేవుడు ప్రసాదంగా పేలపిండి తినవచ్చు. పేలాలపిండి తినడం వలన శరీరంలో చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా కాపాడుతుంది. వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సన్నద్ధం చేయడమే పేలాలపిండి తినడం వెనుక ఉన్న రహస్యం.
తొలి ఏకాదశి రోజు ప్రారంభం 09:59 జూలై 19 2021 రాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి తిథి ముగిసే సమయం 07:17 జూలై 20 2021 సాయంత్రం, 20 17 2021 ద్వాదశి పారాయణ సమయం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి సాయంత్రం 8 గంటల 20 నిమిషాల వరకు విష్ణువుని పూజించవచ్చు.
ఈరోజు బ్రాహ్మణులకు భోజనం లేదా స్వయంపాకం ఇవ్వాలి. అందరికీ పూర్తి ఉపవాసం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించవచ్చు.
మొదటిది ఉపవాసం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే తీసుకుంటే దానిని ఉపవాసం అంటారు.
రెండోది ఏకభుక్తం మధ్యాహ్నం వేళ మాత్రం భోజనం చేసి ఉదయం సాయంత్రం నిరాహారంగా ఉండడాన్ని ఏకభుక్తం అంటారు.
మూడవది నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయడాన్ని నక్తం అంటారు. నాలుగు అయాచితం భోజనానికి ఎవరైనా పిలిస్తే మాత్రమే భోజనానికి వెళ్లడాన్ని ఆయాచితం అంటారు. స్నానం. పై పద్ధతులు కుదరనప్పుడు కనీసం స్నానం చేసి దైవారాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు చదువడాన్ని స్నానం అంటారు.
ఇవన్నీ కూడా కుదరని వారు తిలాదానం ఇవ్వాలి దగ్గరలో ఉండే బ్రాహ్మణులను అడిగి నువ్వులను దానంగా ఇవ్వడం వలన మంచి జరుగుతుంది.
ఇందులో ఏ ఒక్కటి పాటించకుండా చేసే పరిస్థితిలో ఉండి కూడా చేయని వారికి కుంభీపాక రౌరవాది నరకం ప్రాప్తిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఉపవాసం ఉండేవారు మజ్జిగ, పాలు కొద్దిగా మంచినీరు వంటివి తీసుకోవచ్చు. స్వల్పంగా పండ్లు తీసుకోవడం మంచిదే. గుడిలో ప్రసాదం గా ఇచ్చినప్పుడు వద్దు అనకుండా తీసుకోవాలి. వండిన పదార్థాలను తినకూడదు.