కడుపునిండా ఆహారం తీసుకున్నప్పుడు మంచి నిద్ర పడుతుంది అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదని అంటున్నారు మంతెన సత్యనారాయణ గారు. ఆయన చెప్పిన ప్రకారం మనం తిన్న ఆహారం మనల్ని మత్తుగా ఉండేలా చేస్తుంది. దీనివలన నిద్ర పట్టినా అది గాఢనిద్ర కాదు అంటున్నారు. మత్తు నిద్ర అనేది కేవలం శరీరం నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
కళ్ళు, చెవులు, నోరులాంటి అవయవాలకు మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ తిన్న ఆహారం వల్ల అంతర్గత అవయవాలు పని చేస్తూ ఉండాల్సి వస్తుంది. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేంతవరకు జీర్ణ వ్యవస్థ పని చేస్తూ ఉండాలి. ప్రేగులలో ఆహారం కదలికలు జరగాలి. లివర్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉండాలి. గుండె రక్తాన్ని ఎక్కువగా పంప్ చేస్తూ ఉండాలి. అలాగే రక్త నాళ వ్యవస్థ రక్తాన్ని సరఫరా చేస్తూ ఉండాల్సి ఉంటుంది.
ఇలా శరీరంలోని ప్రతి అవయవం పని చేయడం వలన శరీరానికి విశ్రాంతి లభించదు. కానీ మనం సాయంత్రం సమయంలో 7 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవడం వలన 9 గంటల లోపు ఆహారం జీర్ణం అయిపోతుంది. శరీరానికి విశ్రాంతి లభించి మంచి నిద్ర పోవడానికి సహాయపడుతుంది. మనకి కనీసం ఏడు ఎనిమిది గంటల గాడ నిద్ర అవసరం అవుతుంది. కానీ ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్లో అలాంటి నిద్ర పట్టడానికి అవకాశం లేదు.
మనం ఆహారం తీసుకునేదే 10 గంటలకు అలా అయితే మనకు నిద్ర పట్టేందుకు 11:30, 12గంటలు సమయం అవుతుంది లేదా తెల్లవారి రెండు, మూడు గంటల సమయంలో గాఢనిద్ర పట్టవచ్చు. మళ్లీ ఉదయాన్నే లేచి ఇతర పనులు చేసేందుకు సరిపడా ఉత్సాహం ఉండదు. కాలాంతరంలో ఆరోగ్య, మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. పని త్వరగా ముగించి వీలైనంత త్వరగా ఆహారాన్ని తీసుకొనే అలవాటు చేసుకోవడం మంచిది.
కొన్ని రోజులపాటు ఇలా త్వరగా ఆహారం తీసుకోవడం వలన ఆకలి వేసే అవకాశం ఉండొచ్చు. కానీ కొద్దిగా మెదడును సిద్ధం చేయగలిగితే అది కూడా అలవాటు పడుతుంది. ఆహారం తీసుకోకూడదని మెదడు తనను తాను సిద్ధం చేసుకుంటుంది. ఇలా త్వరగా ఆహారాన్ని తీసుకొని పడుకోవడం ద్వారా శరీరానికి కావలసిన గాఢ నిద్రను అందించగలుగుతాం. నిద్ర వలన విశ్రాంతి లభించి మరింత ఉత్సాహంగా పనులు చేయగలుగుతాం.