సాధారణంగా ప్రతి ఇంట్లో గోడల మీద కనిపించే జీవి బల్లి. బల్లి గూర్చి బల్లి శాస్త్రాలు ఉన్నాయ్. అందుకే చాలా మంది బల్లి ఒంటి మీద పడుతుందేమో అని భయపడుతుంటారు. అలాగే చాలా మంది అమ్మాయిలకు బల్లి అంటే చాలా భయంతో కూడిన జుగుప్స. వాటిని చూసి డైనోసార్ లను చూసినంత టెన్షన్ పడుతుంటారు. ఇది ఒక కోణం అయితే వంటింట్లో మనం వండి పెట్టిన పప్పు, కూరలు, పచ్చళ్ళు లాంటివాటిలో ఎక్కడ జారిపడతాయో అని చాలా మంది భయపడుతుంటారు. ఒకటో రెండో బల్లులు ఉంటే సమస్య పెద్దగా ఉండదు కానీ ప్రతి గదిలో అవే కనిపిస్తుంటే చాలా చిరాకు మాత్రమే కాదు కోపం కూడా వస్తుంది.
కొందరు ఈ బల్లుల బాధ తప్పించుకోవడానికి బల్లులకు మందు పెట్టి చంపుతుంటారు. వాటిని అలా చంపకుండా వాటికవే వెళ్లిపోవడమో లేక మనమే వాటిని ప్రాణాలతో పట్టుకుని బయటకు వదిలేయడమో చేయచ్చు. చంపితే పోయేదానికి ఇంత అవసరమా అనుకునేవాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకొనక్కర్లేదు. అందుకే బల్లులను తరిమెసే చిట్కాలు మీకోసం.
కోడిగుడ్డు పెంకులతో
సాధారణంగా ఇంట్లో ఆమ్లెట్ వేయగానే పడేసే గుడ్డు పెంకులతో బల్లులను తరిమేయచ్చు. ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. గుడ్డు పెంకులను గదిలో నాలుగు మూలలా ఉంచాలి దీనివల్ల గుడ్డు వాసనకు ఆ ప్రాంతంలో మరొక ప్రాణి ఉందని భావించి బల్లులు వెళ్లిపోతాయ్. సింపుల్ గా బల్లులను తరిమేసినట్టు అవుతుంది.
వెల్లుల్లి తో..
ఒక స్ప్రే బాటల్ తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం మరియు నీళ్లు వేసి బాగా కలపాలి. అందులో కొద్దిగా వెల్లుల్లి ఎస్సెన్స్ వేసి స్ప్రే తయారుచేసుకోవాలి. ఈ స్ప్రే ను గదిలో మూలలు మరియు షెల్ఫ్ ల లో స్ప్రే చేయడం వల్ల వెల్లుల్లి వాసన కు బల్లులు పారిపోతాయ్. పై ప్రాసెస్ అంతా లేకపోయినా కేవలం వెల్లుల్లి రెబ్బలను కాస్త కచ్చా పచ్చగా దంచి గదిలో మూలలకు ఉంచడం వల్ల కూడా బల్లులు వెళ్లిపోతాయ్. ఇది చాలా సులువైనది కూడా.
నెమలి ఈకలు.
గోడలకు అమర్చే నెమలీకలు ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఇది మాత్రమే మనకు తెలుసు కానీ నెమలీకలను ప్రతి గదిలో అమర్చడం వల్ల బల్లులు తోకముడుచుకుని వెళ్లిపోతాయ్. కాబట్టి నెమలి ఈకలు మీకు నచ్చిన పద్దతిలో ఇంట్లో ఉంచుకోండి. దీనివల్ల బాబోయ్ బల్లులు అనే మాట ఇక మీ నోటి నుండి రాదు.
మిరియాలతో మ్యాజిక్
బల్లులను తరమడానికి మిరియాలు మహా భేషుగ్గా పని చేస్తాయి. పెప్పక్ర్ స్ప్రే కొడితే రోడ్ మీద దొంగలే పారిపోతారు మరి అల్పజీవులైన బల్లులు పోవా చెప్పండి. అయితే ఇది కొనాల్సిన పెప్పర్ స్ప్రే కాదు. ఇంట్లోనే ఉన్న కాసిన్ని మిరియాలు, నీళ్లు కలిపి ఒక స్ప్రే బాటల్ లో పోసి బల్లులు తిరిగే ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. మిరియాల ఘాటు భరించలేక బల్లులు వెళ్లిపోతాయ్.
చివరగా…..
బల్లులను తరమడానికి ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ పైన చెప్పుకున్న తేలికైన పద్ధతులు అవలంభించడం ద్వారా బల్లులు బాధ నుండి విముక్తి పొందవచ్చు.