ప్రసవించిన స్త్రీ కి మంచి ఆకలి పుట్టిన తరువాత కట్టెకారాన్ని పెడతారు. అంటే కారంగా ఉండే మూలికలు లేదా ఆయుర్వేద ప్రయోజనాలు కలిగిన వంటింటిలో వాడుకునే దినుసులు ఉపయోగించి తయారుచేసేది కాబట్టి దీనికి కటేకారం అనే పేరు మన తెలుగు ప్రజల్లో స్థిరపడింది. దీనికి వాడే దినుసులు, వాటి వైద్య ప్రయోజనాల గూర్చి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆశ్చర్యపరిచే ఆ విషయాలు ఏమిటో చదవండి మరి.
కట్టేకారం ను అయిదు రకాల వంటింటి ఆయుర్వేద దినుసులు ఉపయోగించి తయారుచేస్తారు. ఆ అయిదు ఏమిటంటే……
పిప్పళ్ళు
మోడి
చవ్యం
చిత్రమూలం
శొంఠి.
పై అయిదు దినుసులలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిస్తే…..
పిప్పళ్ళు :
ఇది మృదు విరేచనకారి, పోషకపదార్థం, దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఉపయోగపడ్తుంది,
మోడి :
పిప్పిలి చెట్టు వేరును మోడి అని పిలుస్తారు. తేలు, పాము కరిచినపుడు విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
చవ్యం :
గజప్పిలి తీగను చవ్యం అంటారు. దీని గింజల్ని గజపిప్పలి అని పిలుస్తారు. ఈ తీగ సువాసనగా ఉంటుంది. ఇది ఉత్తేజాన్ని ఆకలిని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, ఆయాసం, రక్తస్రావాల్ని, రక్త మొలలను అరికడుతుంది.
చిత్రమూలం :
చిత్రకం మొక్క యొక్క వేరునే చిత్రమూలం అంటారు. ఇది ఆకలిని పుట్టిస్తుంది. పొట్టలోపలి అవయవాలను రక్షిస్తుంది. చర్మవ్యాధులలో మంచిది. విరేచనాలు, అజీర్తి, అరుచి, రక్తస్రావం అవుతున్న మొలలు మొదలైన వాటి నీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెనిగర్, పాలు లేదా ఉప్పుతో దీనిని మెత్తని ముద్దగా చేసి కుష్టు వ్యాధిలో మచ్చలమీద పట్టిస్తారు. దీని బెరడు వేరు కంటే గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఈ బెరడులో ప్లంబగిన అండ్ రసాయనం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే మంట పుట్టిస్తుంది. కానీ సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. తక్కువ మోతాదులో కండరాల్ని ఉత్తేజితం చేస్తుంది. ఎక్కువ మోతాదులో పక్షావాతాన్ని తగ్గిస్తుంది. గుండె కండరాలు ముడుచుకుపోయే వ్యాధిలో వాటిని ఉత్తేజితం చేస్తుంది. పేగుల్ని బలపరుస్తుంది. పేగుల్లో పాముల్ని చంపుతుంది, చెమట పట్టిస్తుంది మరియు మూత్రం సాఫీగా జరిగేలా చేస్తుంది, లివర్ ను బలంగా చేసి బైల్ బాగా విడుదల అయ్యేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శొంఠి :
శొంఠి గొప్ప ఉత్తేజకరాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. సువాసన కలిగి ఉంటుంది. అరుచి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పిలలో ఉపయోగపడుతుంది. అనేక బలవర్థక ఔషధాలలో దీన్ని తోడుగా వాడతారు. పొటాషియం ఆగ్జలేట్ ఎక్కువగా ఉంటుంది. జింజిబెరెన్, ఫోగో ఆల్, సినియోల్, సిట్రోల్, బోర్నియోల్, కాంఫీన్, ఫెల్లాన్ డ్రేన్ వంటి ఘాటైన క్షారాలు ఉన్నాయి.
పై అయిదు కలిపి మెత్తగా దంచి అందులో తగినంత బెల్లాన్ని జోడించి బాగా నెయ్యి వేసి నూరి, ఉసిరికాయంత ఉండలు చేసి బాలింతలు చేత తినిపిస్తారు. దీన్నే కట్టేకారం అంటారు.
కొద్దిగా నెయ్యి తీసుకుని తరువాత ఈ కట్టేకారం మిశ్రమ ముద్దను తిని వేడి నీళ్లు తాగితే బాలింతల్లో నడుమునొప్పి ఉండదు, ప్రసవ వేదనకు సంబందించిన నొప్పులు తగ్గుతాయి. గర్భాశయం చక్కగా కుచించుకుంటుంది.
ప్రసవించిన స్త్రీలకు సాధారణ ప్రసవం అయినవారికి కడుపు మీద నువ్వుల నూనె లేక నెయ్యి రాసి నడుముకు గట్టిగా గుడ్డను పట్టీలాగా కడతారు. దీనినే నడికట్టు అంటారు. ఇలా చేసి పైన చెప్పుకున్న కట్టేకారం ను తినిపిస్తూ ఉంటే ప్రసవానంతరం పొట్ట పడటం వంటి సమస్య దరిచేరదు.అంతే కాదు ప్రసవ సమయంలో జరిగిన శారీరక ఆరోగ్య మార్పులు మెల్లిగా కుదురుకుంటాయి.
చివరగా….
పై చెప్పుకున్నవి అన్ని మన పెద్దలు పాటిస్తూ వచ్చినవే కాబట్టి వాళ్లకు ప్రసవానంతరం ఆరోగ్యం చాలా గొప్పగా ఉండేది కాబట్టి ప్రస్తుత తరం కూడా ఆయుర్వేద గొప్పతనం తెలుసుకుని పాటిస్తే ఉత్తమమైన ఆరోగ్యం సొంతమవుతుంది.