ప్రాంతీయతను బట్టి ఆహారపదార్థాలు అందరికి పరిచయం అవుతాయి. దినుసులు ఒకటే అయినా ఒకో ప్రాంతం లో ఒకో తీరుగా ఉపయోగించి తయారుచేసుకుంటారు. అదే విధంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజువారీ ఆహారంలో ఉపయోగించే రాగులు వాటితో చేసే పదార్థాలు ఎన్నో. రాగుల ఉపయోగంలో భాగంగా రాగి సంకటి, రాగి ముద్ద, రాగి మాల్ట్, రాగి అంబలి, రాగి రోటీలు ఇలా బోలెడు వంటకాలు. అయితే రాగులతో తయారుచేసే అంబలి కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వేసవి కాలం లో తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది. సాధారణ కాలంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఇంకా ఇందులో రాగులు వాడకం వల్ల అధికబరువు, ఎముకల పుష్టి, మధుమేహం, కొలెస్ట్రాల్, రక్త హీనత, కండరాల సంరక్షణ, వృద్ధాప్యాన్ని దూరం చేయడం వంటి ఎన్నో లాభాలు చేకూర్చే రాగులతో అంబలి తయారీ విధానం మీకోసం.
కావాల్సిన పదార్థాలు
రాగి పిండి : నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ : ఒకటి ( సన్నగా తరుగుకోవాలి)
పచ్చిమిర్చి: ఒకటి (సన్నగా తరుగుకోవాలి)
జీలకర్ర : అర స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
పుదీనా : నాలుగైదు ఆకులు
ఉప్పు : రుచికి సరిపడా
పెరుగు : అరకప్పు(అరగ్లాసు నీరు వేసి బాగా చిలకాలి)
నీళ్లు : ఒక గ్లాస్
తయారు విధానం:-
నాలుగు స్పూన్ల రాగి పిండి లో గ్లాసుడు నీళ్లు వేసి బాగా కలపాలి. పిండి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపి అందులో అరస్పూన్ జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టి సన్నటి మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడి చిక్కగా అవుతున్నపుడు అందులోకి ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత అందులో చిలికి పెట్టుకున్న పెరుగు, పుదీనా, మిగిలిన కొత్తిమీర, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇంటిల్లిపాది తీసుకోవడానికి రాగి అంబలి సిద్ధమైనట్టే. గ్రామీణప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా దీన్నే తీసుకునేవారు ఒకప్పుడు. అందుకే వారి శారీరక సామర్థ్యము.కూడా ఎంతో బాగుండేది అంతేనా….. ఎంత కష్టం చేసినా అలసిపోని జీవితం కూడా వారికే వర్తిస్తుంది. అప్పటి కాలం లా కాకపోయినా వారంలో రెండు మూడు రోజులు రాగి అంబలిని అల్పాహారంగా చేసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.