ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది దాంతో పాటు ఆర్థిక స్థాయిలు పెరుగుతున్నాయి. వాటితో పాటు మనుషుల జీవితాలు చాలా బిజీ అయిపోతున్నాయి. కారణం ఈ అబివృద్ధి చెందుతున్న ప్రపంచంలో పోటీ పడటం, ఒకరిని మించిన విజయాలు మరొకరు సాధించాలనే పట్టుదల. జీవితంలో ఎదుగుతూ పోవడం సరైనదే అయితే, అందులోనే జీవితాలను లీనం చేసుకుని పెళ్లిళ్లు అయ్యాక పిల్లలని ఈ యాంత్రిక ప్రపంచంలో లీనం చేసి మన ప్రపంచాన్ని మానవ ప్రపంచం గా కాకుండా ఆర్థిక ప్రపంచంగా, విలువలు లేని బాల్యాన్ని తయారు చేస్తున్నాం.
పుట్టిన పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తుంటే అమ్మా, నాన్నలు చేతిలో పెడుతున్న వస్తువు స్మార్ట్ ఫోన్, ఒకప్పుడు పిల్లలకు కథలు, కబుర్లు చెప్పేవారు. తరువాత వాటి స్థానంలో బొమ్మలు వచ్చి చేరాయి, ప్రస్తుత కాలం లో ఏకంగా బొమ్మలు కూడా వెళ్లిపోయి స్మార్ట్ ఫోన్ లు వచ్చాయి. మూడేళ్లు కూడా నిండని పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు చూస్తుంటే ప్రస్తుత కాలంలో వాటి ప్రభావం ఎంతగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అన్నం తినాలంటే స్మార్ట్ ఫోన్, అల్లరి చేయకూడదంటే స్మార్ట్ ఫోన్, ఏడుపు మానాలంటే స్మార్ట్ ఫోన్. ప్రతిదానికి స్మార్ట్ ఫోన్. కాస్త వయసు పెరిగి నర్సరీ నుండి అయిదవ తరగతి లోపు పిల్లలకు వాచ్ లు కూడా తప్పనిసరి. ఇంకా వీడియో గేమ్స్, సిస్టం లేని ఇల్లు ఉండదు. ఆడుకునే వస్తువులు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలే. ఆర్థిక స్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా పిల్లలకు మాత్రం ఇలాంటి గాడ్జెట్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. పిల్లలపై వీటి ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు చూడండి మీకోసం.
సమస్యలు
◆పిల్లలలో మెదడు ఆలోచన సామర్థ్యము ఎక్కువ. ప్రతీది ప్రశ్నిస్తూనే ఉంటారు. చుట్టూ పరిసరాలను చూస్తూ పిల్లలు పరిశీలిస్తూ నేర్చుకోవడం లొనే వారి మానసిక సామర్థ్యము పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే పిల్లలకు ప్రకృతిని పరిసరాలను పరిశీలించే అవకాశం ఇవ్వాలి. ఏడవగానే మొబైల్ చేతిలో పెట్టి వారిలో ఆలోచనా సమర్త్యాన్ని పెద్దలే అణచివేస్తున్నారు.
◆స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ వెలుతురు ఎక్కువ ఉండటం, గేమ్స్ ఆడేటపుడు వీడియో లు చూసేటపుడు దృష్టిని ఒకే విధంగా నిలపడం వల్ల కంటి చూపు మందగించి చిన్నతనం లోనే దృష్టిలోపం సమస్యలు వచ్చి కళ్ళజోడు పెట్టె పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
◆పిల్లలకు చిన్నతనంలో మొబైల్ అలవాటు చేయడం వల్ల మానవ సంబంధాలను అర్థం చేసుకోలేరు. చిన్న వయసులో పిల్లలకు ఎవరు దగ్గరగా ఉంటే వాళ్లనే ఆత్మీయుగా చూస్తారు పిల్లలు. అలాంటిది మనుషుల స్థానంలో మొబైల్ వాళ్ళ జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆక్రమించుకోవడం వల్ల వారికి మానవ సంబంధాల విలువ తెలియకుండా పెరుగుతారు. పెరిగి పెద్దయ్యాక కూడా వారు ఆర్థిక సంబంధాలకే మొగ్గు చూపుతారు.
◆మొబైల్ చూపిస్తూ తినిపించడం వల్ల తృప్తికరంగా తినలేరు, అలాగే గాడ్జెట్స్ కు అలవాటు పడటం వల్ల సమయానికి నిద్రపోకపోవడం, మొండితనం, వారు చూస్తున్న వీడియోలను అనుకరించడం తద్వారా ప్రవర్తనలో క్రమశిక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
జాగ్రత్తలు
◆సమస్యలకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది అయితే అది తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. పిల్లలతో వీలైనంత ఎక్కువ గడపాలి దాని వల్ల గాడ్జెట్స్ ను దూరంగా ఉంచవచ్చు. పిల్లలతో ఆడటం, పాడటం, కథలు చెప్పడం వంటివి చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అనుబంధం బలపడుతుంది.
◆పిల్లలను తోటి పిల్లలతో కలిపి జట్టు ఆటలు ఆడించడం వల్ల నలుగురిలో కలిసే స్వభావం చిన్నతనం నుండి అలవడుతుంది.
◆నీతి కథలు, చందమామ కథలు లాంటివి చెప్పడం, మన పెద్దవాళ్ళ పద్దతులను అనుసరించడం వల్ల వ్యక్తిత్వ విలువలు పెరుగుతాయి.
◆పుస్తక పఠనం ను అలవాటు చేయడం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. మంచి పుస్తక సేకరణ పిల్లలకు ఉన్న గాడ్జెట్స్ అలవాటును దూరం చేస్తుంది.
◆సామాజిక అంశాల కలయిగా ఉన్న విషయాలను వివరించడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.
చివరగా…..
పిల్లలకు చెప్పడం కేవలం మాటల్లో కాదు పెద్దలు కూడా గాడ్జెట్స్ కు దూరంగా ఉంటే పిల్లలు కూడా మెల్లిగా వాటికి దూరంగా ఉండటానికి అలవాటు పడతారు.