శ్రావణమాసం వచ్చేసింది. తెలుగు మాసాలలో ఐదవమాసం శ్రావణమాసం. సకలదేవతలకు ప్రీతికరమైనది ఈ మాసం. కలియుగ వెంకటేశ్వరుడు పుట్టిన మాసమిది. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన సకలశుభాలను ఇచ్చే మాసమిది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో అష్టమి, నవమి, అమావాస్యకు కూడా పూజలు చేసుకునే నెల ఇది. ఈ నెలలో చేయకూడని పనులు, చేయవలసిన విషయాలు గురించి తెలుసుకోండి.
ఈ మాసంలో నియమాలను పాటించడం వలన లక్ష్మీ దేవి ఇంట్లో కొలువుంటుంది. చేయకూడని పనులు చేయడం వలన దరిద్రం వస్తుందని నమ్ముతారు. సూర్యోదయానికి ముందే ఇంట్లో స్త్రీలు నిద్రలేవాలి. లేచిన తర్వాత ఇంటిముందు తుడిచి కల్లాపి జల్లాలి. వీలైతే పేడకల్లాపి జల్లుకుని ముగ్గు పెట్టాలి. ఇలా నిండుగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీ దేవి కొలువుంటుంది. తర్వాత స్త్రీలు శుచి, శుభ్రంగా స్నానం చేసి ఉండాలి.
స్నానాదికాలు అయ్యాక పుష్పాలతో నిండుగా నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వలన ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ తప్పకుండా ఉండాలి. కుంకుమ లేకుండా బోసి ముఖంతో ఉండకూడదు. కాళ్ళకు పసుపు, పారాణి రాసుకుని ఎవరైతే నిండుగా ఉంటారో శ్రీ మహాలక్ష్మి ఆ ఇంట్లో కొలువవుతుంది. శ్రావణమాసంలో తలను విరబోసుకుని తిరగకూడదు. చక్కగా జడ అల్లుకోవాలి..
అలాగే ఇల్లు శుభ్రంగా, సువాసనలు వెదజల్లాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. చక్కగా జడవేసుకుని తలనిండా పూలతో , చేతులకు గాజులతో, నిండుగా ఉండాలి. లక్ష్మీ దేవి గుమ్మంలోకి వచ్చినప్పుడు
నిండుగా ఉంటే దేవి మెచ్చుతుంది. మెట్టెలు, నల్లపూసలు తీయకూడదు. ఎవరైతే ఇంటిని శుభ్రంగా పెట్టుకోరో వాళ్ళింట్లో లక్ష్మీ దేవి కొలువుండదు.
శ్రావణమాసంలో శుచి, శుభ్రతతో ఉంటూ దీపారాధన చేసుకోవాలి. నెలసరి సమయంలో ఐదు రోజుల పాటు పూజ గదివైపు వెళ్ళకూడదు. ఇప్పటిరోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వలన అన్ని గదులు తిరగడం అలవాటుగా మారిపోయింది. అలాగే పూజగదిలో వాడే సామానులు ముట్టుకోవడం వంటివి చేయకూడదు. సాయంత్రం సమయంలో తల దువ్వుకోకూడదు. పసుపు, కుంకుమ ఎప్పుడూ నిండుగా ఉండాలి.