Impressive Health Benefits of Mung Beans

పెసలుతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఇప్పటి వరకు అసలు చూసి ఉండరు.

కందిపప్పు, శనగపప్పులా పెసలు, పెసరపప్పు మనం వంటల్లో వాడుతూ ఉంటాం. పెసలు లేదా పెసరపప్పు శరీరానికి బలాన్నిస్తాయి,  శరీరావయవాలకు మంచి పుష్టిని కలుగచేస్తాయి.

◆రక్తక్షీణతలోనూ, పేగులకు సంబంధించిన అన్ని వ్యాధుల్లోనూ, వాత వ్యాధుల్లోనూ, నరాల జబ్బుల్లోనూ దీన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసి వండి పెట్టాలి.

◆ పెసరపప్పుని బాగా ఉడికించి, పై తేటని తీసి పంచదార వేసుకొని తాగితే వేడి తగ్గుతుంది, రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది అయితే రుచిగా ఉంది కదా అని గ్లాసుకన్నా ఎక్కువ తాగవద్దు. మితంగా తీసుకోవాలి. ఇది చలువ కలిగిస్తుంది, మూత్రాన్ని ఫ్రీగా అయ్యేలా చేస్తుంది, కడుపులో మంట తగ్గిస్తుంది.

◆చింతపండు వెయ్యకుండా పెసరపప్పుతో చారుకాస్తే దాన్ని పెసరకట్టు అంటారు. ఇది ఆకలిని పుట్టించి జీర్ణశక్తిని పెంచుతుంది. అన్ని రోగాల్లోనూ మంచిది. జ్వరంలో కూడా ఇవ్వచ్చు. అవకాశం ఉంటే ఉసిరికాయల రసంగానీ, టమోటా రసంగానీ, నిమ్మరసం గానీ, దానిమ్మ రసంగాని, ఇందులో కలిపి తాగవచ్చు. అవసరాన్ని బట్టి ఏది కలపాలో నిర్ణయించుకోవాలి. దీన్ని రోజూ అన్నంలో ఆహారపదార్థంగా తినడం మంచిది. శరీరంలో వాతం ఎక్కువై కండరాలు, ఒళ్ళు మొత్తం ఇబ్బంది పెట్టే వాత వ్యాధుల్లో తీసుకోవడం మరీ అవసరం!

◆పెసరపప్పు 1 కిలో, బియ్యం 4 కిలోలు.  ఇదే నిష్పత్తిలో బాగా కలిపి ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి. రోజూ మీకు కావలసినన్ని ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకొని అన్నం వండేయాలి. దీన్ని పెసర పులగం అంటారు.

◆మంచి రుచిని ఇస్తుంది. వేడిని తగ్గిస్తుంది మొలల జబ్బు వున్నవారికి మంచిది. శరీరానికి బలాన్ని, పుష్టినీ కల్గిస్తుంది. వాత వ్యాధుల్లో ఇది ఎంతో మేలు చేస్తుంది. పేగుపూత, ఇతర పేగు సమస్యలు వున్నవారికి ఇది మంచి ఆహారం. కాళ్ళుమంటలు, కళ్ళు మంటలతో బాధపడేవారు తప్పనిసరిగా ఈ పెసర పులగం తినడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.  అలాగని, అదేపనిగా అతిగా తినకూడదు అజీర్తి చేస్తుంది. జీర్ణశక్తిని బట్టి తీసుకోవాలి. వ్యాధిని బట్టి ఎంత తినాలో, మీ కడుపు పరిస్థితి మీకే బాగా తెలుసు కదా!!. అల్లం మిరియాలు, నెయ్యి వంటివి కలిపి తింటే తేలికగా అరుగుతుంది.

◆బియ్యం పెసరపప్పు 4 : 1 నిష్పత్తిలో కలిపి జావ కాచి తాగవచ్చు కూడా. ఇందులో దానిమ్మరసం గాని, టమోటారసం గాని, ఉసిరి రసం గాని కలుపుకోవచ్చు. జ్వరంలో మంచి మేలు చేస్తుంది. చక్కటి ఆహార పదార్ధం. అలాగే పొంగలి కూడా ఎంతో మంచిది.

◆పెసరపచ్చడి వేడి చేస్తుంది. కడుపులో మంట తెస్తుంది. కాబట్టి వేడి శరీరం ఉన్నవారు జాగ్రత్త. అయితే  పెసల్ని వేయించి, పొట్టుతో సహా పచ్చడి చేసుకొంటే చలవ ఇలా చేసుకున్నది అంటి అభ్యంతరం లేకుండా తినవచ్చు.

చివరగా….

ప్రతి ఇంట్లో ఉండే పెసలు, పెసరపప్పు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసాక కేవలం అనారోగ్యం ఉన్నపుడే కాదు కనీసం వారానికి ఒక్కసారి పెసరపప్పు తో ఎదో ఒక వంటకం చేసుకుని తింటూ ఉంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.  

Leave a Comment

error: Content is protected !!