leaf vegetables health benefits

ఆరోగ్యానికి ఆయువు పట్టులైన ఇవి తింటున్నారా??

రోజువారి ఆహారంలో మనం కచ్చితంగా వాడేవి ఆకుకూరలు. కనీసం పప్పు, చారులోకి కొత్తిమీర, కరివేపాకు అయినా లేనిది వంటకు వాసన రుచి రాదు. అలాంటి ఆకుకూరలు మనకు వాడుకోవడమే తెలుసు కానీ అందులో దాగున్న ఆరోగ్యపరమైన విలువలు ఏమిటో అంతగా తెలుసుకోము. అందుకే ఇప్పుడు ఆకుకూరల్లోకి వెళదాం అంతేనా అందులో దాగున్న పోషకాలు ఏమిటో ఒకసారి విశ్లేషిద్దాం.

ఆకుకూరలో ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలలో పెరుగుదల మరియు దృఢత్వాన్ని కలుగచేస్తాయి. ఆకుకూరల్లో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువ గా ఉంటాయి దీనివల్ల ఆకుకూరలు అందరూ తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. కాల్షియం, బీటాకెరోటిన్, ఐరన్, విటమిన్-ఎ, విటమిన్-సి మొదలైనవి శరీరంలో ఎముకలను, దంతాలను పటిష్టంగా ఉంచుతూ, కంటి చూపుకు ఎంతో సహకరిస్తాయి. అలాంటి కొన్ని ఆకుకూరలు వాటి పోషకాలు వాటి ఆరోగ్య   రహస్యాలు చూద్దాం మరి.

◆ పాలకూర.

పాలకూరలో విటమిన్ -ఎ, విటమిన్ -సి, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే పాలకూరలో ఉన్న గుణాలు ఊపిరితిత్తులు కాపాడుతూ మహిళల్లో ఎదురయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడంలో గొప్పగా పనిచేస్తుంది.

◆ తోటకూర

తోటకూరను మనం పప్పు, పులుసు, పొడికూర మొదలైన వివిద పద్ధతుల్లో వండుకుంటాం అయితే ఈ తోటకూరలో మలబద్ధకాన్ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.  పాస్పరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం మొదలైనవి శరీరంలో ఆకలిని వృద్ధి చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

◆ గోంగూర

గోంగూర పచ్చళ్ళు ఎంత ఫెమస్ ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి పక్కన ఒక ఉల్లిపాయకు కొరుక్కుని తింటుంటే స్వర్గమేనా అన్నట్టు ఉంటుంది. అలాంటి గోంగూరలో విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. అయితే గోంగూరను ఎక్కువ తినడం వల్ల అరిగించుకోలేము కారణం ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటమే.  శరీరంపై పెరిగిన గడ్డలు మీద గోంగూరను ఆయుధంతో వేడి చేసి ఆ ఆకులను గడ్డల మీద వేయడం వల్ల చక్కని పలితం ఉంటుంది. తుమ్ములను తగ్గించడానికి, ఇంకా ఒంట్లో నీరుచేరినపుడు గోంగూరను  ఆహారంలో తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి

◆ మెంతికూర

మెంతికూర పప్పు ఎంతబాగుంటుందో, మెంతులు ఎంత ఆరోగ్యకరమైనవో అందరికి తెలిసినదే. ఈ మెంతి కూరలో ఐరన్, విటమిన్-బి1, విటమిన్-బి2, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకించి  మధుమేహం ఉన్నవాళ్ళకు మెంతికూర చక్కటి ఆహారపదార్థంగా ఉపయోగపడుతుంది. 

◆ పుదీన

సమోసాలు, చాట్స్ లో తప్పనిసరిగా వాడేది పుదీనా చెట్నీ, దీని సువాసన అందర్నీ కట్టిపడేస్తుంది. జ్వరం వచ్చినపుడు పుదీన ఆకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాదు కామెర్లు, కడుపులో మంటకు కూడా చక్కని పరిష్కారం.  వేవిళ్ళు ఉన్నపుడు  స్పూన్ నిమ్మరసం, స్పూన్ పుదీనా రసం కలిపి తాగడం వల్ల  వేవిళ్ళు నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి ఉన్నపుడు పుదీనా చక్కని మందుగా  పనిచేస్తుంది.

◆ కొత్తిమీర

కొత్తిమీర లేని వంటను ఆస్వాదించలేము అన్నది సత్యం. ఇందులో విటమిన్లు, ఖనిజలవణాలు, బి1, బి2, ఐరన్ మొదలైనవి మెండుగా ఉంటాయి. కొత్తిమీర జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల అనీమియాను నివారించవచ్చు. అలాగే కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు ఆరోగ్యం చేకూరుస్తుంది, శరీరంలో రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తుంది.

చివరగా……

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆకుకూరలను ప్రతిరోజు తీసుకుంటే ఏ జబ్బులు మన దరిదాపుల్లోకి కూడా రావని ప్రత్యేకంగా చెప్పాలా…

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!