తలలో చుండ్రు అనేది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఇబ్బందికి గురి చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీని వలన శరీరం అంతా మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పొట్టులాగా రాలే చుండ్రు పొడిచర్మం గలవారికి ఉంటే, ఆయిల్ చర్మం వారికి ముద్ద ముద్దగా ఉంటుంది. ఇది తలలో దురద, పుండ్లు పడేందుకు జుట్టు రాలిపోయేందుకు కారణమవుతూ ఉంటుంది. చుండ్రు తగ్గించుకోవడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలు, అనేక ఇతర రకాల ప్రొడక్ట్స్ ఉపయోగించి ఎటువంటి ఉపయోగం లేక నీరసించి పోయినవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కా ప్రయత్నించడం వల్ల చుండ్రు, తలలో పేలు, ఈర్లను కూడా తగ్గించుకోవచ్చు.
దీని కోసం మనకు కావలసినది వేపాకులు. వేపాకులను తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా నీటిని చేర్చి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి వేపాకుల రసాన్ని తీసుకోవాలి. ఈ వేపాకుల రసంలో కట్ చేసి శుభ్రంగా కడుక్కున్న అలోవెరా జెల్ ను వేసుకోవాలి. తాజా కొమ్మల నుంచి తీసిన అలోవెరా జెల్ ఉపయోగించడం మంచిది. ఈ కొమ్మలను కోసిన వెంటనే వచ్చే పసుపు ద్రావణాన్ని పోయేంతవరకు పక్కన పెట్టి తర్వాత శుభ్రంగా కడిగి అలోవెరా జెల్ తీసుకోవాలి. ఇప్పుడీ రెండింటినీ బాగా కలిపి తలను పాయలు పాయలుగా తీసుకుంటూ స్కేల్ప్ మొత్తానికి బాగా అప్లై చేయాలి.
ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయొచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల వేపలోని యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించి పేలు పెరగకుండా అడ్డుకుంటాయి. అలోవెరా జెల్ కూడా చుండ్రు సమస్యను అరికట్టడంలో సహాయపడుతుంది. జుట్టు మెత్తగా, మృదువుగా ఉండేందుకు అలోవెరా జెల్ సహాయపడుతుంది.
అలాగే ఒత్తిడి అధికంగా ఉండే వారికి చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినేవారికి కూడా శరీరంలో సెబమ్ అనే ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది చుండ్రు మొటిమలు రావడానికి కారణం అవుతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకుని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.