మనకు పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ కనిపించే ఉత్తరేణి మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందని అందరికీ అవగాహన ఉండదు. మన భారతదేశపు ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి కొన్ని వందల రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లతో సహా అన్ని వైద్యంలో ఉపయోగించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఉత్తరేణి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరేణి ఆకులను పూర్వం ఎప్పటి నుంచో అనేక ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.
మనం ఎంతో భక్తిశ్రద్ధలతో చేసే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకుల్లో ఉత్తరేణి ఒకటి. ఉత్తరేణి ఆకులు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. శరీరంపై దురద, పొక్కులు, పొట్టుకు చెక్ పెట్టేందుకు ఉత్తరేణి ఆకుల రసం ఉపయోగపడుతుంది.
ఉబ్బసం దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను మంటల్లో వేసి ఆ పొగను పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిదను ఆముదంతో కలిపి దురద, తామరపై లేపనంలా రాస్తే క్రమంగా తగ్గుతుంది. కందిరీగలు, తేనెటీగలు మరియు తేళ్లు కరిచినప్పుడు ఆకులను నలిపి పసరు పూయడం వలన నొప్పి మరియు దురద తగ్గుతుంది.
పంటి నొప్పి తీవ్రంగా ఉంటే ఉత్తరేణి గింజల పొడి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కలిపి ముద్దలా చేసి ఆ పేస్టును పంటిపై రాస్తే పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. శరీరంలోని కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్టపై రాసుకోవాలి.
ఇక శరీరంలో కొవ్వు గడ్డలు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా దంచి ఆకులను పేస్ట్ ను కొవ్వు గడ్డలుపై పెట్టి దానిపై ఆకు వేసి బ్యాండేజ్ కట్టేయాలి. ఇలా ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇలా కనీసం రెండు రోజులు చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగి పోతాయి వీటి రసాన్ని అప్లై చేయడం ద్వారా ఎక్కడైనా చర్మ సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.