జుట్టు స్త్రీ లందరికీ అందానికి ప్రతీక. ఇలాంటి జుట్టు అనేక కారణాలు వలన రాలిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సమస్యలు వచ్చిన తర్వాత బాధపడేకంటే మంచి ఆరోగ్యకరమైన చిట్కాలతో మరింత అందమైన జుట్టును పొందవచ్చు. దీనికోసం మనం చేయవలసింది సహజమైన, ఇంట్లోనే ఉండే పదార్థాలు తీసుకోవాలి. అవన్నీ మన జుట్టుకు రక్షణ, పోషణ ఇస్తాయి. ఇవి మన చుట్టుపక్కల పెరిగే లేదా ఇంట్లో ఉండే పదార్థాలే. అవేంటో చూద్దాం రండి.
స్టవ్పై ఒక గిన్నపెట్టి దానిలో మీరు కావలసినంత కొబ్బరి నూనె తీసుకోవచ్చు. దానిలో మెంతులు, ఎర్ర రెక్కల మందారం తీసుకోవాలి. వీలైనంత వరకు రెక్కల మందారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అవి లేనప్పుడు ఎర్ర ముద్ద మందారం తీసుకోండి. వాటికి ఉండే పుప్పొడి ఉండే మధ్య భాగం, కింద బేస్ని తీసేసి పూరేకులు మాత్రం వేసుకోవాలి.
ఇందులో కడిగి తుడుచుకున్న మందార ఆకులు ఒక పది వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా శుభ్రం చేసుకుని నీళ్ళు లేకుండా తుడిచి వేసుకోవాలి. ఇందులో కలబంద కూడా చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నూనె రంగు మారేంతవరకూ మరగబెట్టాలి. ఈ నూనెను చల్లార్చి ఒక గాజుసీసాలో నిల్వచేసుకోవచ్చు.
ఈ నూనెను జుట్టు కుదుళ్ళకు పట్టేలా నెమ్మదిగా వేళ్ళతో మసాజ్ చేస్తూ రాసుకోవాలి. ఇందులో వేసిన పదార్థాలు అన్నీ ఆయుర్వేద గుణాలున్న పదార్థాలు. ఇవి జుట్టు కుదుళ్ళను బలంగా చేయడంలో, తెల్లజుట్టును నివారించడంలో, తలలోని చర్మంలో ప్రబలే సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
మెంతులు ఎండినట్టు, గడ్డిలా ఉన్న జుట్టును మెత్తగా, పట్టులా చేయడంలో సహాయపడతాయి. ఎర్రగా మారిన జుట్టును నల్లగా, బలంగా చేయడంలో మందార పువ్వులు, ఆకులు సహాయపడతాయి. తర్వాత కరివేపాకు జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తుంది. తర్వాత వేసిన అలోవెరా అన్ని జుట్టు సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు జుట్టు రాలే సమస్య ను తగ్గించి లావైన, ఒత్తుగా ఉండే జుట్టును ఇస్తుంది.
నూనె రాత్రిపూట రాసుకుని ఉదయాన్నే లేదా మరుసటిరోజు తలస్నానం చేయడం మంచిది. నూనె తలలో దుమ్ము ధూళి చేరడానికి కారణమవుతుంది కనుక ఎక్కువ రోజులు తలలో ఉండకుండా జాగ్రత్తపడాలి.