ప్రస్తుత కాలంలో ప్రతిచోటా శాండ్విచ్లు మరియు సలాడ్లపై అందంగా పచ్చపచ్చగా కనిపిస్తూ ఆహ్లాదాన్ని మరియు అంతకు మించి ఆరోగ్యాన్ని చేకూర్చే మైక్రో గ్రీన్స్ గూర్చి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డ్రై ఫ్రూట్స్, మొలకలు, మాంసాహారం, పనీర్, చీజ్, పాలు, పెరుగు మొదలైన గొప్ప ఆహారాలకంటే కూడా అద్భుతమైన శక్తి వనరులను ఈ మైక్రో గ్రీన్స్ కలిగి ఉన్నాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన మైక్రో గ్రీన్స్ గూర్చి వాటి ప్రయోజనాల గూర్చి చదివేయండి.
మైక్రోగ్రీన్స్ అంటే కూరగాయలు మరియు ధాన్యాల విత్తనాలను నాటిన తరువాత మొలకలు వచ్చి సుమారు అంగుళం పొడవు పెరిగిన చిన్న ఆకుకూర లాంటి మొక్కలు. ఈ మైక్రో గ్రీన్స్ వాస్తవానికి 60 రకాల రకాలు ఉన్నాయి. మైక్రోగ్రీన్స్ పూర్తిగా ఎదిగి కూరగాయలు మరియు ధాన్యాలుగా రూపాంతరం చెందిన తరువాత కంటే చిన్న మొలకలుగా ఉన్నపుడు 40 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. మరి మైక్రో గ్రీన్స్ ఆరోగ్య ప్రయోజనాలు చూసేయండి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం, అయితే మైక్రోగ్రీన్స్ వంటి మొక్కల ఆధారిత ఆహారాలు రక్తపోటుపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి. “ఫైబర్ మరియు విటమిన్ కె కలిగిన ఏదైనా మొక్కల ఆధారిత ఆహారం రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కాబట్టి గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు వీటిని విరివిగా ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యను సులువుగా అధిగమించగలుగుతారు.
క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
మైక్రోగ్రీన్స్‌తో సహా మొక్కలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీ మైక్రోగ్రీన్స్‌లో లభించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ మూలకణాలను ఎదుర్కోవడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి సహాయపడతాయి.
సాధారణంగా ఏదైనా కూరగాయలలో పోషకాలకు రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. అయితే మైక్రోగ్రీన్స్ ఈ పోషకాలను మరిన్ని రేట్లు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి అనూహ్యంగా పెరగడానికి సహాయపడతాయి.
కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతారు.
కంటి ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మైక్రో గ్రీన్స్ ఆకుకూర దశలో ఉంటాయి కాబట్టి వీగిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు విరివిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మైక్రో గ్రీన్స్‌లో ఫైటోకెమికల్ లుటీన్ ఉంటుంది. మైక్రోగ్రీన్స్లోని లుటిన్ కంటెంట్ కళ్ళు అధిక కాంతి తీవ్రతను గ్రహించడంలో సహాయపడుతుంది.
మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి
వీటిలో ఫైబర్ శాతం ఎక్కువ. అందువల్ల మలబద్ధకాన్ని నివారించడంలో గొప్పగా సహాయపడతాయి.
జీర్ణ వ్యాధులను నివారించడానికి దోహదపడతాయి
మైక్రోగ్రీన్స్‌లో అధిక ప్రీబయోటిక్ ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన బాక్టీరియ పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీనివల్ల జీర్ణాశయం మరియు, జీర్ణాశయ గోడలు, పేగులు మొదలైనవి సమర్థవంతంగా పనిచేస్తూ వాటి తాలూకూ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని నివారిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గడానికి తోడ్పడతాయి
ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు కొవ్వు ఆహారం తీసుకునేటప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇప్పటికే ఆరోగ్యకరమైన ఆహారానికి మైక్రోగ్రీన్స్ గొప్పగా సహాయం చేస్తున్నాయి. వాటితో పాటు శరీరంలో ఉన్న చెడు కొవ్వులను తగ్గించి శరీర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా తోడ్పడతాయి.
చివరగా….
మైక్రోగ్రీన్స్ ప్రస్తుతం విరివిగా వాడుతున్న గొప్ప ఆరోగ్య మూలకం. వీటి వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలు చేకూరాలంటే తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి మరి.