వంటింట్లో పోపుల పెట్టె, ఆ పోపుల పెట్టెలో మసాలా దినుసుల దిట్టం అందరి ఇళ్లలో ఉండేదే. అయితే ఈ మసాలా దినుసులలో జాజికాయ కు ఉన్న ప్రత్యేకత వేరు. కాసింత జాజికాయను తురిమి చిటికెడు పొడిని వేస్తే అద్బుతమే. ఈ జాజికాయ కేవలం వంటింట్లో ఉద్ధరించేది మాత్రమే కాదండోయ్ ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలను నింపుకున్నది కూడా. ఆయుర్వేద వైద్యంలో కూడా జాజికాయ ప్రాముఖ్యతను గొప్పగా వర్ణిస్తారు. ఇంత విశిష్టమైన జాజికాయ తో ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవలసిందే.
◆ విపరీతమైన చెవి పోటుతో బాధపడేవారు జాజికాయను కాసిన్ని నీళ్లు చుక్కలుగా చల్లి ఆ నీళ్లలో నూరి జాజికాయ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసేస్తే చెవి పోటు తగ్గుతుంది.
◆ పచ్చకామెర్ల జబ్బు చేసినపుడు జాజికాయను పథ్యంలో భాగం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జాజికాయ బలాన్ని చేకూర్చడమే కాకుండా నాలుక మీద పాచిని పోగొట్టి జిగురుగా ఉండే లక్షణాన్ని తగ్గిస్తుంది.
◆ విరేచనాలతో బాధపడుతున్నవారు జాజికాయను తీసుకోవడం వల్ల అడ్డుకట్ట వేస్తుంది. దంత సంరక్షణలో కూడా జాజికాయ పనిచేస్తుంది, దంతాలు నలుపుగా మారకుండా కాపాడుతుంది, అలాగే మలబద్దకం ను తగ్గించడంలో దోహాధం చేస్తుంది.
◆ జాజికాయ ను ఎందులో అయినా ఉపయోగించే మోతాదు తక్కువే కానీ అమితమైన ప్రభావాన్ని చూపించడంలో చాలా శక్తివంతమైనది.
◆ తలనొప్పిని తగ్గించడంలో జాజికాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. జాజికాయ పొడిని పాలలో కలిపి తీసుకుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
◆ కోపం ఎక్కువగా ఉన్నవారు జాజికాయను తీసుకోవడం వల్ల ప్రశాంతంగా మారతారు, నోటి దుర్వాసనను తగ్గించడంలో కూడా జాజికాయ పనిచేస్తుంది.
◆ సాంప్రదయకరమైన తాంబూలంలో జాజికాయను తప్పకుండా వాడతారు. జాజికాయ లైంగిక సమర్థతను పెంచడంలో దోహాధం చేస్తుంది.
◆ పిల్లల్లో విరేచనాల సమస్య ఎక్కువగా ఉన్నపుడు నెయ్యి, జాజికాయ, పంచదార మూడు కలిపి పిల్లలతో తినిపించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
◆ జాజికాయను ఎక్కువగా తీసుకుంటే మత్తు కమ్ముకుంటుంది. ఒకవేళ ఎక్కువగా తీసుకుని మత్తు ఆవరించినపుడు ధనియాలు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి.
◆ గుండె బరువు, గుండెలో నొప్పిగా ఉన్నపుడు జాజికాయను పాలలో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయను వాడటం వల్ల శరీరానికి మంచి రంగు కూడా వస్తుంది.
◆ వాంతులు, దగ్గు, జలుబు, నిమ్ము, గుండె సంబంధ సమస్యలు మొదలైన వాటిలో జాజికాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
◆ జ్వరం వచ్చినపుడు జాజికాయను వాడితే జ్వరం తొందరగా తగ్గిపోతుంది.
◆ అతిదాహం సమస్యతో బాధపడుతున్నవారు జాజికాయను తీసుకోవడం వల్ల చలువ చేసి దాహం తీరుతుంది.
చివరగా……
వంటింట్లో ఉన్న సుగంధ ద్రవ్యాల చిట్టాలో మసాలా దినుసుగా ఉపయోగపడుతూ ఆరోగ్యానికి అద్భుతమైన రక్షణ ఇచ్చే జాజికాయను ప్రతి ఒక్కరు పైన చెప్పుకున్నట్టు ఉపయోగించుకుంటే అద్భుతాలే మరి.