మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ఎదిగేకొద్ది వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఎంతటి కష్టమైన సమస్యలను అయినా తమ మేధాశక్తితో పరిష్కరించుకుంటూ సాగిపోతున్నారు. అయితే తమ జీవిత లక్ష్యాలే మహిళలను మానసిక ఒత్తిడిలో పడేసి ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికాలం లో మహిళల జీవితంలో సాధారణం అయిపోయిన సమస్య pcod. అసలు ఈ pcod అంటే ఏంటి?? దీని లక్షణాలు ఏమిటి?? ఎందుకు వస్తుంది?? దీనికి పరిష్కారం ఏంటి?? ప్రశ్నలకు సమాధానమే మన విశ్లేషణ.
పిసిఓడి
పాలిసిస్టిక్ ఒవెరీ డీసీజ్. ప్రస్తుత గైనకాలజీ క్లినిక్ లు కళకళలాడుతున్నాయి ఈ సమస్యతో వస్తున్న మహిళలతో. ఈ సమస్య ఏంటి అంటే మహిళల శరీరంలో ప్రతినెలా విడుదల కావాల్సిన అండాల కేంద్రమైన అండాశయం లో ద్రవంతో కూడిన చిన్న చిన్న నీటి తిత్తులు ఏర్పడతాయి. దీన్నే ప్రస్తుతం పిసిఓడి సమస్యగా పేర్కొంటున్నారు.

లక్షణాలు
పిసిఓడి సమస్య ను శరీరంలో జరిగే కొన్ని మార్పులు ఆధారంగా కనుగొనవచ్చు. స్వతహాగా సన్నగా ఉన్న మహిళలు అనూహ్యంగా బరువు పెరగడం, శరీరంలో అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ కావడం, మొహం మీద మొటిమల సమస్య ఎక్కువగా ఉండటం ఎన్ని మందులు, క్రీములు వాడినా తగ్గకపోవడం. మోహమంతా మొటిమల వల్ల వికారమైపోవడం. నెలసరి అస్తవ్యస్తం అవ్వడం, కడుపులో అకస్మాత్తుగా నొప్పి రావడం. వంటి సమస్యలు ఉన్నపుడు పిసిఓడి గా అనుమానించవచ్చు.
నిర్ధారణ
పిసిఓడి నిర్ధారణ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు. అలాగే పైన చెప్పుకున్న కారణాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా కూడా సమస్యను నిర్ధారిస్తారు.
సమస్యలు
పిసిఓడి వల్ల పైన చెప్పుకున్నట్టు బరువు పెరగడం, మొటిమలు, అవాంఛిత రోమాలు మాత్రమే కాకుండా అండాలు విడుదల కాకపోవడం వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, రెండు, మూడు నెలలకు ఒకసారి నెలసరి వచ్చినా రక్తస్రావం చాలా కొద్దిగా అవ్వడం లేదా అధిక మోతాదులో రక్తస్రావం అవ్వడం, ఎన్ని మందులు వాడినా సమస్య పరిష్కారం కాకపోవడం జరుగుతుంది. పెళ్ళైన వాళ్లకు ఈ సమస్య వల్ల గర్భం దాల్చడం లో అడ్డంకులు, ఒకవేళ గర్భం దాల్చినా నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జుట్టు విపరీతంగా రాలిపోవడం, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉండటం కూడా చాలా మందిలో కనిపిస్తాయి.
కారణాలు
పిసిఓడి సమస్యకు కారణాలలో ముఖ్యమైనది మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఈస్ట్రోజోన్, ఆండ్రోజోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమానతలు వల్ల పిసిఓడి సమస్య వస్తుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ పెరగడం వల్ల కూడా అధిక బరువు పెరిగిపోతారు.
చికిత్స
పిసిఓడి సమస్య కేవలం మందుల ద్వారా తగ్గడం అసంభవం. రోజువారీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. ఆహారాన్ని వేళకు తీసుకోవడం, రోజు తప్పనిసరి వ్యాయామం, యోగ, నడక, ధ్యానం వంటివి ఆచరించాలి. ఎక్కువ ఎమోషన్ కు గురి కాకుండా ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, తృణధాన్యాలు, పోషకాల మిళితమైన మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, రక్త పెరుగుదలకు ఉపయోగపడే క్యారెట్, బీట్రూట్ జ్యుస్ లు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, నూనెలో ఎక్కువగా వేగిన వేపుళ్ళు, బయటి తిండికి దూరంగా ఉండాలి.
చివరగా….
పైన చెప్పుకున్నవన్ని పాటిస్తూ మానసిక ఒత్తిడిని అధిగమిస్తే పెద్ద సమస్యగా మొండిగా వెంటపడి మహిళల్ని వేధించే పిసిఓడి కూడా మెల్లిగా మాయమైపోతుంది.